జల్లికట్టు - జత కట్టు

మూడు, నాలుగు జిల్లాల్లో ప్రాచుర్యం పొందిన సాంప్రదాయ క్రీడ కోసం సర్వోన్నత న్యాయస్థానాన్నిసవాలు చేసి, మూడు రోజుల్లో రాష్ట్ర , కేంద్ర ప్రభుత్వాలు ఆర్డినెన్సు కి ఆమోదం తెచ్చేలా చేసిన జాతి ఎక్కడ ......

మూడు  సంవత్సరాలు  అవుతున్నా, అధికార, ప్రతిపక్షాలు పార్లమెంట్ సాక్షిగా ఇచ్చిన హామీని గాలి కి  వదిలేసినా  కిమ్మనని మన  పౌరుషమెక్కడ??

రైల్వే జోన్ లేదు, వెనుకబడిన జిల్లాలకు ఇస్తామన్న రాయితీలు లేవు, పోలవరానికి సరిపడా నిధులు లేవు , ఇచ్చిన  2000కోట్లు  కూడా  నాబార్డ్ రుణమే. ఎటువంటి  ప్రత్యేకత లేని ఒక ప్యాకేజ్ మరల దానికి చట్ట బద్ధత కూడా  లేకుండానే  సన్మానాలు  చేయించుకుంటున్నా ఏమీ అనలేని నిస్సహాయులము మనము , మెజారిటీ వచ్చిన  ప్రైవేట్ బిల్లును , ద్రవ్య  బిల్లు అని  తిరస్కరించినా పల్లెత్తు మాటనని అమాయకులము...ఆంధ్రులము.
ప్యాకేజ్ కి  ఒప్పుకుంటే  సిఎం  ఇంటి ముందు ఆత్మహత్య  చేసుకుంటానన్న సమైక్యాంధ్ర శివాజీ,

ఎంపీ లతో రాజీనామా చేయిస్తానన్న జగన్ ,
కత్తికెదురెళ్ళే కంఠం - మాట ఇస్తే వెనక్కి తీసుకోనన్న పవన్,
రాజీ పడటం జీవితంలో లేదన్న బాబు ....

వీళ్లంతా  మూడు  సంవత్సరాలు  అవుతున్నా , ఏ అమృత ఘడియల కోసం  వేచి చూస్తున్నారో  ఒక  సామాన్యుడు గా నా ఊహకి అందటంలేదు. ఇంకో రెండు సంవత్సరాలలో వచ్చే ఎన్నికలకు మరల  ఇవే వాగ్దానాలు , ఇవే పార్టీలు.....మన జీవిత చక్రంలో 5 సంవత్సరాల విలువైన కాలము కరిగి పోతుంది తప్ప వచ్చే మార్పేమీ లేదు. మన  యువత  అత్యంత  అమూల్యమైన  సమయాన్ని కోల్పోతూ , చాలీచాలని జీతాలతో పక్క రాష్ట్రాలకి  వలస పోతున్నారు.

ఎక్కడుంది లోపం ?? ఎవరిని నిందించాలి??

తమిళనాడు లో రాష్ట్ర ప్రభుత్వ మద్దతు లేకుండా అంత పెద్ద నిరసన సాధ్యమయ్యేది కాదు. సంప్రదాయాన్ని కాపాడుకోవడానికి రాజకీయ , సినీ ప్రత్యర్థులందరు ఒక్క తాటి పైకొచ్చారు, కాదు, రావలిసి వచ్చింది. మరి మన రాష్ట్రాన్నే కాపాడుకోవటానికి మనకెంత నిబద్ధత ఉండాలి .ఇప్పుడు కాకపోతే ఇక కాదు. ఎందుకంటే స్వయముగా హామీ ఇచ్చిన ప్రధాని ,భాగస్వామ్య పార్టీ గా వున్నా రాష్ట్ర ప్రభుత్వము ,సమర్ధించే ప్రతిపక్షం . వచ్చే పార్లమెంట్ లో సమీకరణాలు ఎలా ఉంటాయో?

ఎవరు అడక్క పోయినా, జల్లికట్టు కి  సంఘీభావంగా  ట్వీట్లు ఇస్తున్న మన హీరోలు  మనకి  మద్దతు గా  ముందుకొస్తారా ? తమిళనాడు తరహాలో అన్ని రాజకీయ పార్టీలు  సంఘటితంగా  పోరాడతాయా ?? తప్పని సరిగా .....కానీ  మనము వీళ్ళనుంచి ఎమన్నా ఆశించే ముందు  ఒక “అనివార్యత”  సృష్టించాలి . అది కేవలము విద్యార్థులు  తలచుకొంటేనే సాధ్యము.  మన కాలేజెస్, యూనివర్సిటీస్ ముందుకొచ్చే వరకు  పైన  చెప్పిన  వ్యక్తులు  కానీ , హీరో లు  కానీ , ఉద్యోగులు  కానీ  ముందుకు రారు. ఎప్పుడు రావాలి ఆంధ్ర ప్రదేశ్ కి  తెలంగాణ  తరహా  ఐటీ సంస్థలు?
ఎప్పటికొచ్చేను తెలంగాణ తరహా ప్రభుత్వ సంస్థలు ? నిలదీద్దాము  నాయకులను ..... అందరూ  కలిస్తే , జత  కడితే  కేంద్రము  దిగి రాదా? వాళ్ళకి ఆంధ్ర  ఓట్లు/ సీట్లు వద్దా? 3 రోజుల్లో ఆర్డినెన్సు ఇవ్వగలిగిన  కేంద్ర ప్రభుత్వము  రైల్వే  జోన్ , ప్రత్యేక హోదా కానీ  లేదా మనము  నష్టపోయిన  సంస్థలు  ఆంధ్రాకి  వచ్చేలా ప్రొత్సాహాకాలు ఎందుకు ఇవ్వలేదు ? 3 సంవత్సరాలు సరిపోవా? మనకి సత్తా లేదనా.... ప్రత్యేక హోదా తెచ్చుకో లేకపోతే కనీసము మనల్ని మరలా తమిళనాడు లో కలిపేయమందాము…..  మన తర్వాత  తరాలకైనా సాధించుకోవడము అలవాటు అవుతుంది.

మన  హక్కులు సాధించుకోలేకపోతే  మనదంతా  
ఒకటే కులం – “అమాయకులం” 
ఒకటే మతం- “సతమతం”

-ఎం.మురళీ మోహన్ 

Show comments