ఇండియా ఎటాక్‌ చేసిందా.? లేదా.?

పాక్‌ ఆక్రమిత కాశ్మీర్‌లోని తీవ్రవాద శిబిరాలపై (టెర్రరిస్ట్‌ లాంచ్‌ ప్యాడ్స్‌)పై భారత సైన్యం 'సర్జికల్‌ స్ట్రైక్స్‌' నిర్వహించిన విషయం విదితమే. మొత్తం 38 మంది తీవ్రవాదుల్ని భారత పారాట్రూప్‌ కమాండోలు మట్టుబెట్టారని భారత ప్రభుత్వం చేసిన అధికారిక ప్రకటన తాలూకు సారాంశం. ప్రపంచానికి అర్థమయ్యేలా, మొత్తం 25 దేశాలకు చెందిన దౌత్యాధికారులకు ఇదే సమాచారాన్ని భారత ప్రభుత్వం అందించింది. 

కానీ, పాకిస్తాన్‌ వెర్షన్‌ ఇంకోలా వుంది. అసలు, భారత్‌ చెబుతున్నట్లుగా సర్జికల్‌ స్ట్రైక్స్‌ అనేవి జరగనేలేదంటూ పాకిస్తాన్‌ ఆర్మీ సంచలన ప్రకటన చేసింది. అయితే, ఇక్కడే ఓ ట్విస్ట్‌ వుంది. పాకిస్తాన్‌ మీడియాతోపాటు, పాకిస్తాన్‌ ప్రధాని సర్జికల్‌ స్ట్రైక్స్‌ జరిగిన మాటని ఒప్పుకోవడం గమనార్హం. పాకిస్తాన్‌ ఆర్మీ ఒకలా, పాకిస్తాన్‌ ప్రభుత్వం ఇంకోలా.. పరస్పర విరుద్ధ ప్రకటనలతో ఒక్కసారిగా పాక్‌ ప్రజానీకం తీవ్ర ఆందోళనకు గురయ్యారు. 

నిజానికి, సర్జికల్‌ స్ట్రైక్‌ జరిగింది పాక్‌ ఆక్రమిత కాశ్మీర్‌లో. అది నిజానికి భారత భూ భాగం. ఇక్కడే వచ్చింది అసలు చిక్కు అంతా. అక్కడ చనిపోయింది తీవ్రవాదులు కావడంతో, దాడుల్ని ఒప్పుకుంటే, పాకిస్తాన్‌ సైన్యానికీ, తీవ్రవాదులకీ వున్న లింకులు బయటపడ్తాయి. అందుకే, పాక్‌ ఆర్మీ తూచ్‌ అనేసింది సర్జికల్‌ స్ట్రైక్స్‌ని. కానీ, పాకిస్తాన్‌ ప్రజల్ని రెచ్చగొట్టడం ద్వారా రాజకీయ లబ్ది పొందాలి గనుక, భారత్‌పై ఘాటైన వ్యాఖ్యలు చేయడానికి వీలుగా దాడి జరిగిందని పాక్‌ ప్రధాని ఒప్పేసుకోవాల్సి వచ్చింది. 

పాక్‌ మీడియాలో, సర్జికల్‌ స్ట్రైక్‌ కారణంగా జరిగిన విధ్వంసానికి సంబంధించి ఫొటోలు దర్శనమిస్తున్నాయి. అదే సమయంలో, పెద్దయెత్తున పాకిస్తాన్‌ సైన్యం, ట్రక్కుల్లో తీవ్రవాదుల మృతదేహాల్ని తరలిస్తున్న విజువల్స్‌ కూడా పాక్‌ మీడియా ప్రసారం చేస్తోంది. ఎంతమంది తీవ్రవాదులు చనిపోయారన్నదానిపై భారత ఆర్మీ ఇంతవరకు ఎలాంటి అధికారిక ప్రకటనా చేయకపోవడం గమనార్హం. 38 మంది తీవ్రవాదుల్ని మట్టుబెట్టడంతోపాటు 8 మంది తీవ్రవాదులు, పాక్‌ సైనికుల్ని సర్జికల్‌ స్ట్రైక్స్‌ సందర్భంగా సజీవంగా పట్టుకున్నారన్న ప్రచారమైతే జరుగుతోంది. 

కొసమెరుపు: మా దగ్గర అణ్వాయుధాలున్నాయ్‌ జాగ్రత్త.. అంటూ ఇప్పటిదాకా రెచ్చగొట్టిన పాకిస్తాన్‌, భారత సర్జికల్‌ స్ట్రైక్స్‌ తర్వాత ఆ ఊసెత్తడంలేదు. కనీసం, గట్టిగా సమాధానం చెబుతామన్న మాటే కరవయ్యింది పాకిస్తాన్‌ నుంచి. పాకిస్తాన్‌ నోట మాటపడిపోవడానికి కారణం, అసలు దాడి జరిగిందని ఒప్పుకోవాలా.? జరగలేదని బుకాయించాలా.? అన్నదానిపైనే పాకిస్తాన్‌కి క్లారిటీ లేకపోవడమే.

Show comments