అప్పు చేయడం, ఇవ్వడం మనిషి జీవితంలో భాగం. ఒక్క మనుషులనే కాదు, సంస్థలైనా, ప్రభుత్వాలైనా అప్పులు చేయడం, ఇవ్వడం సాధారణమే. ఎంతవారైనా కాంత దాసులే అన్నట్లుగా ఎంతవారైనా ఎప్పుడో ఒకప్పుడు అప్పుల అప్పారావు అవతారమెత్తక తప్పదు. అప్పులు చేయడం తప్పు కాదు. కాని అప్పు చేసి పప్పు కూడా తినాలనుకుంటే మాత్రం క్షమించరాని నేరం. అలాగే ఆదాయ వనరులను దృష్టిలో పెట్టుకొని అప్పు చేయాలేగాని ఇస్తున్నారు కదా అని పుచ్చుకోకూడదు. తిరుమల వెంకన్న కుబేరుడి దగ్గర చేసిన అప్పు ఇప్పటికీ తీరలేదని సరదాగా చెబుతుంటారు.
అయినదానికి కానిదానికి అప్పులు చేస్తూపోతే మనుషులకైనా, ప్రభుత్వాలకైనా పెనుభారంగా మారతుంది. మనుషుల విషయంలో కుటుంబాలు చితికిపోతాయి. కొందరు ఆత్మహత్యలు చేసుకుంటారు. ప్రభుత్వాల విషయంలో ఆత్మహత్యలుండవుగాని సర్కారు ఎడాపెడా అప్పులు చేస్తే ఆ భారం ప్రజల మీద పడుతుంది. అప్పులు పాలకులు చేస్తే వాటిని తీర్చాల్సిన బాధ్యత, భారం ప్రజలపై పడతాయి. అది పన్నుల రూపంలో, వివిధ చార్జీల రూపంలో ఉంటుంది. సరే...ఇదిలావుంచితే ప్రముఖ ఆంగ్ల పత్రిక సమాచారం ప్రకారం....ఏపీలో చంద్రబాబు ప్రభుత్వం అప్పు చేయందే రోజు గడిచే పరిస్థితి లేదట...!
నాలుగైదురోజుల్లో 1,500 కోట్లు అప్పుడు తెచ్చుకోబోతోంది. ఎక్కడి నుంచి తెచ్చుకుంటున్నదో తెలియదుగాని అప్పు తీసుకోవడం అనివార్యమైంది. ఈ అప్పు తెచ్చుకుంటేనే అభివృద్ధి కార్యక్రమాలకు నిధులు విడుదల చేసే అవకాశముంటుంది. ఈ 'రుణానందలహరి' రాబోయే రోజుల్లోనూ కొనసాగుతుందని అధికారులు చెబుతున్నారు. విచారించదగ్గ విషయమేమిటంటే అప్పు చేయకుంటే ఉద్యోగులకు జీతాలు ఇవ్వలేని స్థితిలో ప్రభుత్వం ఉందట...! ఓ పక్క ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడి మాటలు కోటలు దాటుతున్నాయి. మళ్లీ అమరావతి గురించి గొప్పలు చెప్పుకుంటున్నారు.
ఈమధ్య పరిపాలన భవనాల నిర్మాణానికి శంకుస్థాపన చేయడం, ఓ ప్రయివేటు విశ్వవిద్యాలయం నిర్మాణానికి శంకుస్థాపన చేయడం వగైరా కార్యక్రమాలతో అద్భుత అమరావతి దండకం ప్రారంభించారు. చంద్రబాబుకు వెన్నుదన్నుగా ఉన్న కేంద్ర మంత్రి వెంకయ్య నాయుడు ప్రశంసలు తారస్థాయికి చేరుకున్నాయి. నాయుళ్లిద్దరూ ఒకరినొకరు నిరంతరం పొగుడుకుంటున్నారు తప్ప అప్పుల ఊబి గురించి ఆలోచిస్తున్నారో లేదో తెలియదు. ఇక చంద్రబాబు సర్కారుకు ఎంత అప్పు కావాలంటే అంత ఇచ్చేందుకు ప్రపంచ కాబూలీవాలా ప్రపంచ బ్యాంకు ఉండనే ఉంది.
గతంలోనే అప్పుల కోసం ప్రపంచ బ్యాంకుతో ఒప్పందం కుదిరింది. మరి అక్కడి నుంచి ఎంత వచ్చిందో తెలియదు. బాబు సర్కారు ఒక్క ప్రపంచ బ్యాంకు నుంచే కాదు, జపాన్, చైనా, మరో రెండు మూడు విదేశీ ఆర్థిక సంస్థల నుంచి కూడా భారీ ఎత్తున రుణాలు తీసుకోవడానికి ప్లాన్ చేసింది. ఇవేవీ ఉదారంగా రుణాలివ్వవు. అనేక షరతులు పెడతాయి. ఈ విషయంలో ప్రపంచ బ్యాంకు మరింత కర్కశంగా వ్యవహరిస్తుంది. అయినప్పటికీ ప్రభుత్వం అంగీకరిస్తూనే ఉంటుంది. ఉమ్మడి రాష్ట్రానికి బాబు సీఎంగా ఉన్నప్పుడు ప్రపంచ బ్యాంకుతో అంటకాగారు. అప్పట్లో 'ప్రపంచ బ్యాంకు జీతగాడు చంద్రబాబు' అని కమ్యూనిస్టు పార్టీలు ప్రచారం చేశాయి. పుస్తకాలూ ప్రచురించాయి.
తాను నిజాయితీపరుడినని, పారదర్శకంగా పరిపాలిస్తున్నానని చెప్పుకుంటున్న బాబు అప్పులు ఎందుకు చేయాల్సివస్తోందో, ఏ అవసరాలకు అప్పులు చేస్తున్నారో, ఏ షరతులకు అంగీకరించి లోన్లు తెస్తున్నారో ప్రజలకు చెప్పాల్సిన అవసరముంది. ఆయన దుబారా తగ్గించుకుంటే, ఆడంబరాలు, అట్టహాసాలు మానేస్తే ఆర్థిక పరిస్థితి కొంత మెరుగు పడుతుందేమో...! రుణ భారం మోసేది ప్రజలేననే సంగతి అర్థ శాస్త్రం చదువుకున్న బాబుకు తెలియకుండా ఉండదు. ఇదిలా ఉంటే...ప్రత్యేక హోదా ఎగ్గొట్టిన కేంద్ర ప్రభుత్వం ఏపీని అన్నివిధాల ఆదుకుంటామని చెబుతున్న సంగతి తెలిసిందే.
ఆదుకునే సంగతి ఎలా ఉన్నా తాను ఏపీకి ఇచ్చే డబ్బు, రాష్ట్రం నుంచి తనకు రావల్సిన డబ్బుకు సంబంధించి పైసా పైసా లెక్కవేస్తోంది. నయా పైసా వదిలేది లేదన్నట్లుగా వ్యవహరిస్తోంది. డబ్బు విషయంలో నిక్కచ్చిగా ఉండాల్సిందే. కాదనం. కాని ఆర్థిక కష్టాలు ఉన్న రాష్ట్రానికి కూడా ఎలాంటి మినహాయింపులూ ఇవ్వడంలేదు. తాజాగా అందిన సమాచారం ప్రకారం....నవంబరు నెలకు సంబంధించి పన్నుల్లో వాటాగా ఏపీకి అందాల్సిన మొత్తంలో 790 కోట్లు కోత పెట్టింది. ఎందుకు? గత ఆరు నెలల్లో ఏపీకి నిర్దేశిత మొత్తం కంటే ఎక్కువ (పనుల్లో వాటా) ఇచ్చిందట. దీంతో ఆ డబ్బు రికవర్ చేసుకుంటున్నట్లు చెప్పింది. నవంబరులో పన్నుల్లో ఏపీ వాటా 1,760 కోట్లు. దాంట్లో కోత పడటంతో అధికారులు ఆందోళన చెందుతున్నారు. వచ్చే నెలలో ఎంత వస్తుందో తెలియదంటున్నారు.