చిన్నమ్మని కాకాపడ్తున్న రాములమ్మ

వారెవ్వా.. రాజకీయం అంటేనే అంత. జయలలిత మరణానంతరం తమిళనాడులో రాజకీయాలు చిత్ర విచిత్రంగా తయారయ్యాయి. ఒకప్పుడు జయలలిత ఎవర్నయితే బయటకు గెంటేశారో, ఆమె ఇప్పుడు ఏఐఏడీఎంకే పార్టీ బాధ్యతలు స్వీకరించడానికి సిద్ధంగా వున్నారు. ఎవరైతే, జయలలిత మరణానికి కారణం.. అనే ఆరోపణలెదుర్కొంటున్నారో ఆమెకిప్పుడు బోల్డంత మద్దతు లభిస్తోంది కొందరు 'ప్రముఖుల' నుంచి. 

తాజాగా, సినీ నటి విజయశాంతి (కాంగ్రెస్‌లో వున్నారంటే వున్నారంతే.. గతంలో ఆమె టీఆర్‌ఎస్‌ ఎంపీగా పనిచేశార్లెండి..) శశికళను చెన్నయ్‌లో కలిశారు. అంతకు ముందు విజయశాంతి, చెన్నయ్‌లోని మెరీనాబీచ్‌లోగల జయలలిత సమాధి వద్ద ఘనంగా నివాళులర్పించేశారు. శశికళను కలిసిన విజయశాంతి, ఏఐఏడీఎంకే పార్టీ పగ్గాలు చేపట్టాల్సిందిగా కోరారు. కామెడీ కాకపోతే, ఏఐఏడీఎంకే పార్టీతో విజయశాంతికి ఏంటి సంబంధం.? అదే మరి, రాజకీయమంటే. 

తెలుగునాట రాజకీయాల్లో విజయశాంతి అడ్రస్‌ గల్లంతయ్యింది. ఆమెకు సినీ నటిగా తెలుగుతోపాటు తమిళ, హిందీ సినిమాల్లోనూ ఒకప్పుడు పాపులారిటీ వుండేది. చెన్నయ్‌లో ఆమెకు ఇప్పటికీ సన్నిహితులు చాలామందే వున్నారు. అలా ఆ పాత పరిచయాల్ని ఉపయోగించి, తమిళ రాజకీయాల్లో తన ఉనికిని చాటుకోవాలనుకుంటున్న విజయశాంతి.. అంటూ గత కొన్నాళ్ళుగా ప్రచారం జరుగుతున్న విషయం విదితమే. అద్గదీ శశికళని విజయశాంతి 'కాకాపట్టడానికి' అసలు కారణం. 

తెలంగాణ అన్న కేసీఆర్‌ తరిమేస్తే రాజకీయాల నుంచి ఔట్‌ అయిపోయిన విజయశాంతి, ఇప్పుడు చిన్నమ్మపై ఆశలు పెట్టుకున్నారన్నమాట. మొత్తమ్మీద విజయశాంతి తమిళ రాజకీయాలపై నిజంగానే ఆసక్తి ప్రదర్శిస్తున్నారా.? ఆమె కాకా పట్టినంతమాత్రాన శశికళ, విజయశాంతిని అక్కున చేర్చుకుంటారా.? అనే ప్రశ్నలకు సమాధానం తెలియాలంటే కొన్నాళ్ళు వేచి చూడాల్సిందే.

Show comments