చంద్రబాబుకి అంత భయమేంటి.?

ఆయన ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి.. కనుసైగతో ఎవర్నయినా శాసించగలరు. కానీ, ఆయన భయంతో విలవిల్లాడుతున్నారు. మొన్నామధ్య కర్నూలు జిల్లాలో ముఖ్యమంత్రి చంద్రబాబు పర్యటించినప్పుడు, మచ్చుమర్రి ఎత్తిపోతల పథకాన్ని ప్రారంభించారు. ఈ సందర్బంగా ఏర్పాటయిన బహిరంగ సభలో స్థానిక ఎమ్మెల్యే, వైఎస్సార్సీపీ నేత ఒకరు ఆ ప్రాజెక్ట్‌ ప్రారంభమయ్యింది వైఎస్‌ రాజశేఖర్‌రెడ్డి హయాంలోనేనని గుర్తు చేసుకున్నారు. అంతే, చంద్రబాబుకి కోపమొచ్చేసి.. మైక్‌ కట్‌ చేయించేశారు. 

ఇప్పుడు, కడప జిల్లాలో చంద్రబాబు పర్యటిస్తున్నారు. కర్నూలు జిల్లాలో వైఎస్సార్సీపీ ఎమ్మెల్యే ఇచ్చిన షాక్‌తో కుదేలైన చంద్రబాబు, ముందస్తు జాగ్రత్త చర్యల్లో భాగంగా కడప జిల్లాకు చెందిన వైఎస్సార్సీపీ ముఖ్య నేతల్ని 'అధికార మదం'తో హౌస్‌ అరెస్ట్‌ చేయించారు. ఈ విషయమై కడప ఎంపీ అవినాష్‌రెడ్డి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. పైడిపాలెం రిజర్వాయర్‌కి సంబంధించి పనులఱు 90 శాతం వైఎస్‌ రాజశేఖర్‌రెడ్డి హయాంలో పూర్తయ్యాయన్నది అవినాష్‌రెడ్డి వాదన. అయితే, వైఎస్సార్సీపీ వాదనను టీడీపీ కొట్టి పారేస్తోందనుకోండి.. అది వేరే విషయం. 

విపక్ష నేతలే అయినాసరే, ప్రొటోకాల్‌ ప్రకారం సిట్టింగ్‌ ఎంపీ, ఇతర ప్రజా ప్రతినిథులకు ప్రభుత్వ కార్యక్రమాల్లో చోటు దక్కుతుంటుంది. అది వారి హక్కు. మరి, ప్రజా ప్రతినిథుల హక్కుల్ని హరించేయడమేంటట.? సమాధానం సింపుల్‌.. చంద్రబాబు భయం. ఈ భయానికీ హద్దూ అదుపూ లేకుండా పోతోంది. విపక్షం చేస్తున్న ఆరోపణల్ని, విపక్ష నేతల ముందే ఖండించే ధైర్యం లేకపోవడంతోనే, అధికారమదంతో గొంతు నొక్కేస్తుండడం ఏ విలువలకు నిదర్శనమో నిప్పు నారా చంద్రబాబునాయుడే చెప్పాలి.

Show comments