రాజకీయ నాయకులు బేఫికర్.. వ్యాపార వర్గాలకీ టెన్షన్ లేదు. రియల్ ఎస్టేట్ రంగం కాస్త షాక్‌కి గురయ్యింది. వున్నపళంగా నోట్ల కొరత ఏర్పడటంతో, అన్ని వ్యాపారాలతోపాటు, సినిమా వ్యాపారకమూ కొంత ఇబ్బంది పడిందంతే. చాలా చోట్ల థియేటర్లు ఖాళీగా కన్పించాయి. అంతకు మించి, సినీ పరిశ్రమకు నోట్ల మార్పిడితే పెద్దగా దెబ్బ తగిలినట్లు కన్పించడంలేదు.
టాలీవుడ్‌లో ఓ సూపర్ స్టార్ రెమ్యునరేషన్ ఏకంగా పాతిక కోట్లు.. అనే ప్రచారం జరుగుతోంది. నిజంగానే అంత సీనుందా.? అనడక్కండి.. అదంతే. పాతిక కాకపోతే, పదిహేను అయినా వుంటుంది కదా. కానీ, అదంతా నిర్మాత ఆయనగారికి 'వైట్ మనీ' రూపంలోనే ఇస్తున్నారా.? అభిమానులు తమ హీరో గొప్ప.. అని చెప్పుకోడానికి 'అంత తీసుకుంటున్నాడట' అని చర్చించుకోవడం.. మీడియా పోటీ పడి, రెమ్యునరేషన్ల వ్యవహారంపై కథనలు తెరపైకి తీసుకురావడం మామూలే. వాస్తవాలు వేరేలా వుంటాయి.
మరీ ఆ స్థాయిలో కాకపోయినా, పెద్ద హీరోల రెమ్యునరేషన్లు కోట్లలోనే పలుకుతున్నాయి. యంగ్ హీరోలు తక్కువేమీ తినడంలేదు. ఒక్క హిట్టు కొడితే చాలు కోటి.. అంటున్నారు. కానీ అదంతా 'వైట్ మనీ రూపంలో అందుతోందా.?' అంటే, 'నో ఆన్సర్'. నోట్ల మార్పిడి, నోట్ల సంక్షోభంతో సినీ పరిశ్రమలో రెమ్యునరేషన్లు తగ్గిపోతాయనే వాదన విన్పిస్తోంది. అదెలా సాధ్యమట.!
మార్కెట్‌లోకి కొత్తగా ముందుగా వచ్చింది 2 వేల రూపాయల నోట్లు. ఏం చేసుకోవాలి వాటిని.? ప్రస్తుతానికి అయితే అవి మార్చడానికీ చిల్లర కొరత వుంది. రేపు 500 నోట్లు వస్తాయట. 100 నోట్లు ఎప్పుడొస్తాయో ఏమో.! అంటే, ఈలోగా పాత 500 నోట్లు, 1000 నోట్లు.. నల్ల కుబేరుల దగ్గరకి చేరిపోతాయి. మళ్ళీ అది బ్లాక్ అయిపోవడం ఖాయం.. అన్నది చాలామంది అభిప్రాయం.
సినీ పరిశ్రమలో రెమ్యునరేషన్లు తగ్గిపోవడం, నల్ల ధనం అరికట్టబడటం.. ఇవన్నీ 'మిధ్య' మాత్రమే. శతకోటి దరిద్రాలకు అనంతకోటి ఉపాయాలు ఎప్పుడూ వుంటాయి. అది సినిమా రంగంలో అయినా, వ్యాపార రంగంలో అయినా, రాజకీయ రంగంలో అయినాసరే.! అందుకేనేమో, సినీ ప్రముఖులు నోట్ల మార్పిడి వ్యవహారంపై అత్యుత్సాహంతో సానుకూలంగా స్పందించేస్తున్నారు.?