దీని భావమేమి చంద్రబాబూ!

''చేపలు చెరువును వదలి వెళుతున్నాయంటే.. దాని అర్థం త్వరలోనే ఆ చెరువు ఎండిపోబోతున్నదని'' అని అర్థం వచ్చే భర్తృహరి శ్లోకం ఒకటుంది. ఇప్పుడు ఎందుకోగానీ ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర పరిపాలన, రాజకీయ వ్యవహారాలను గమనిస్తే.. ఈ శ్లోకంలోని నీతి గుర్తుకు వస్తోంది. తాజాగా మీడియాలో వస్తున్న కథనాల ప్రకారం.. ఆంధ్రప్రదేశ్‌లో పనిచేస్తున్న అనేకమంది ఐఏఎస్‌ అధికారులు కేంద్రసర్వీసుల్లోకి వెళ్లిపోవడానికి ఆసక్తి చూపిస్తున్నారట. ఏపీ సర్వీసు వద్దనుకుని.. కేంద్ర సర్వీసుల్లోకి వెళ్లి పనిచేయడానికి కేంద్రానికి దరఖాస్తు చేసుకున్నారట. వారిలో దాదాపు పదిమంది దరఖాస్తులు దాదాపుగా ఆమోదం కూడా పొందినట్లుగా తెలుస్తున్నది. 

రాష్ట్రంలో విపత్తు నిర్వహణ చూస్తున్న లవ్‌ అగర్వాల్‌, ఏపీపీపీఎస్‌సీ కార్యదర్శి ఎ.గిరిధర్‌, కీలక ఐఏఎస్‌లు జవహర్‌ రెడ్డి, అనంతరాము, జయలక్ష్మి, వీణాఈష్‌, ఇంకా ఆదిత్యనాధ్‌ దాస్‌, రాంగోపాల్‌ తదితరులు కేంద్ర సర్వీసులకు వెళ్లిపోబోతున్నట్లు సమాచారం. 

రాష్ట్రంలో కీలక విధుల్లో ఉన్న ఐఏఎస్‌లు రాష్ట్రాన్ని వదలిపోదలచుకుంటున్నారంటే.. దాని అర్థం ఏమిటి? ఆ విషయం చంద్రబాబునాయుడు విడమర్చి చెబితేనే బాగుంటుంది. దీనికి సహజంగా కొన్ని రకాల కారణాలుంటాయి. ప్రభుత్వంలో రాజకీయ నాయకుల ఒత్తిడిని వీరు భరించలేని పరిస్థితి ఉండాలి. రాష్ట్ర ప్రభుత్వంలో ఇమడలేని వాతావరణం వారికి ఉండాలి. లేదా.. ఈ అధికారులను పొమ్మనకుండా రాజకీయ నాయకులే పొగపెడుతూ ఉండాలి. ఇలాంటివి అనేకం స్ఫురిస్తాయి. 

దానికి తగ్గట్లుగా.. అసలే పరిపాలనలో అవినీతి విషయంలో ఏపీ రాష్ట్రం అగ్రశ్రేణిలో ఉన్నట్లుగా అధ్యయనాలు చెబుతున్న నేపథ్యంలో రాష్ట్రంలోని కీలక ఐఏఎస్‌ అధికారులు ఈ సర్వీసులను వదలి వెళ్లిపోవాలని అనుకోవడం రకరకాల అనుమానాలకు దారితీస్తుంది. చంద్రబాబునాయుడు ప్రభుత్వంలో రాజకీయ జోక్యం మితిమీరి ఉంటున్నదని, రాజకీయ ఒత్తిళ్లు ఐఏఎస్‌ అధికార్ల మీద ఎక్కువగా ఉన్నాయని తొలినుంచి వార్తలున్నాయి. మంత్రులు కాదు కదా, వారి భార్యలు కూడా జిల్లా కలెక్టర్లకు ఫోను చేసి.. బండబూతులతో వారిని కోప్పడుతూ.. తమ ఆబ్లిగేషన్లు చేసిపెట్టాల్సిందిగా బెదిరిస్తున్న సంఘటనలు కూడా గతంలో వెలుగులోకి వచ్చాయి. 

ఒక రకంగా చెప్పాలంటే.. రాష్ట్రంలో ఉన్న ఐఏఎస్‌లు చాలా దయనీయమైన బతుకు లో ఉన్నట్లే లెక్క. అసలే రాష్ట్రంలో ఐఎఎస్‌ అధికార్ల కొరత ఉన్నదని, దాని వలన పాలన కుంటుపడుతున్నదని భావిస్తున్న తరుణంలో ఉన్న వారు కూడా.. ఇలా దీనిని వదిలించుకుని పారిపోవాలనే ఆరాటంలో ఉండడం.. చంద్రబాబు నాయుడు ప్రభుత్వ వైఫల్యం కిందికి వస్తుందా రాదా అనే చర్చ ప్రజల్లో నడుస్తున్నది. 

Show comments