హృదయ విదారక విషాద చరితలు...!

పాత తెలుగు సినిమాలోని ఓ పాటలో 'ఉదాహరిస్తే ఎన్నో గాథలు హృదయ విదారక విషాద చరితలు' అని పాడతారు. ప్రేమ కథలకు సంబంధించిన పాటలోని వాక్యమది. పెద్దల పట్టుదలల కారణంగా పిల్లల ప్రేమ గాథలు విషాదంగా మారుతున్నాయని చెప్పడం ఇందులోని భావం. ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడి  నిర్వాకం కారణంగా ఆ రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు అనేక ఇబ్బందులు పడుతున్నారు. ఎక్కడ? రాజధాని అమరావతి ప్రాంతంలోని వెలగపూడిలో ఆగమేఘాల మీద నిర్మించిన తాత్కాలిక సచివాలయంలో. 

ఈ సెక్రటేరియట్‌లోని దాదాపు రెండు వేలమంది ఉద్యోగులు పడుతున్న కష్టాలను మీడియా వివరిస్తుంటే 'హృదయ విదారక విషాద చరితలు' అని చెప్పుకోక తప్పదు. వెలగపూడి కష్టాలను టీడీపీ శత్రువు 'సాక్షి' కంటే  'పచ్చ' పార్టీ అనుకూల పత్రిక ఎక్కువగా ఏకరువు పెడుతోంది. ఈమధ్య కాలంలో రెండు మూడు కథనాలు ప్రచురించిన బాబు అనుకూల పత్రికలో ఈరోజు మరో కథనం ప్రచురితమైంది. ఈ కథనాలు చదివిన వారెవరైనా  హడావుడిగా హైదరాబాదు నుంచి సచివాలయాన్ని వెలగపూడి తరలించి చంద్రబాబు ఏం సాధించారు? అనే ప్రశ్న వేసుకుంటారు. 

కథనాలు చదివినవారికే ఇలాంటి సందేహం వస్తే అక్కడ ప్రత్యక్షంగా పనిచేస్తున్న ఉద్యోగులకు రాదా? ఉద్యోగులు ఎలాంటి ఇబ్బందులు పడకుండా సలక సౌకర్యాలతో సచివాలయాన్ని తీర్చిదిద్దిన తరువాతే వారిని తరలించాల్సిన చంద్రబాబు ఇప్పుడు కాకపోతే మరెప్పుడూ కాదు అనే తరహాలో వస్తారా? చస్తారా? అంటూ ఉద్యోగులను తరలించారు. తీరా వచ్చాక చూస్తే ఏముంది? కష్టాల ఊబిలో చిక్కుకున్నామని అర్థమైంది. కాని బాబు మీడియా మాత్రం సచివాలయం బ్రహ్మాండం అంటూ బ్రహ్మరథం పట్టింది. సచివాలయం అదరహో అంటూ కొందరు ఉద్యోగుల చేత చెప్పించింది. 

అవాస్తవాలు ప్రచారం చేస్తే ప్రజలు అసహ్యించుకుంటారనే ఉద్దేశంతో కావొచ్చు వెలగపూడి కష్టాలపై వరుసగా కథనాలు ప్రచురిస్తోంది. సచివాలయంలో ఉద్యోగులకు, సందర్శకులకు నిలువ నీడ లేదంటూ ఈ రోజు కథనం ప్రచురితమైంది. రోడ్డు మీదగాని, సచివాలయం ఆవరణలోగాని ఒక్క షెల్టర్‌ కూడా లేకపోవడంతో ఉద్యోగులు, ప్రజలు ఎండకు ఎండుతున్నారని, నిలువ నీడ లేక అల్లాడిపోతున్నారనేది కథనం సారాంశం. సామాన్య ఉద్యోగులు, ప్రజలు సచివాలయం బయటనే వాహనాలు దిగి అర కిలోమీటరు లోపలికి నడిచిరావాలి. 

అలసటొచ్చి కాసేపు సేదతీరుదామన్నా నీడ లేదు. గుక్కెడు మంచినీళ్లు లేవు. కూర్చునేందుకు కుర్చీలో, చప్టాలో, అరుగులో...ఇలాంటివి ఏమీ లేవు.  అధికారుల కార్యాలయాలన్నీ ఇరుకుగా ఉన్నాయట...! ఇంకా నిర్మాణ పనులు జరుగుతూనే ఉన్నాయట....! దీంతో ఎంతసేపైనా నిలబడి ఉండాల్సిందే. విజయవాడ, గుంటూరు ప్రాంతాల్లో అసలే ఎండలెక్కువ. దీంతో అంతా అల్లాడిపోతున్నారు. ఈ బాధలు చంద్రబాబుకు లేవు కదా. ఆయన కళ్లకు 'ఆల్‌ ఈజ్‌ వెల్‌' అన్నట్లుగానే కనబడుతుంది. ల్యాండ్‌లైన్‌ టెలిఫోన్లు, ఇంటర్‌కమ్‌ సౌకర్యం లేదని కథనాలొచ్చాయి. 

విద్యుత్‌ సరఫరాలో అంతరాయం కలిగితే జనరేటర్లు, ఇన్వెర్టర్లు లేవు.  సచివాలయం ఉద్యోగులను హైదరాబాద్‌ నుంచి తరలివచ్చేంతవరకు చంద్రబాబు నాయుడు వారి వెంట పడ్డారు. డెడ్‌లైన్ల మీద డెడ్‌లైన్లు పెట్టి వారికి నిద్ర పట్టకుండా చేశారు. కుటుంబం హైదరాబాదులో ఉండి, ఆయన ఆంధ్రాలో ఉంటున్నారు కాబట్టి ఆయనకు ఎలాగూ నిద్ర పట్టదు. దాంతో వెలగపూడికి తరలివచేంతవరకు ఊరుకోలేదు. అమరావతికి తరలివెళ్లాలనే ఆదేశాలు వచ్చినప్పటినుంచే హైదరాబాద్‌ సచివాలయంలో పనులు కుంటుపడ్డాయి. డెడ్‌లైన్లు, షిఫ్టింగు, కుటుంబ సమస్యల కారణంగా ఉద్యోగులు దాదాపు పని చేయడం మానేశారు. 

తీరా వెలగపూడికి వచ్చాక కూడా అనేక కష్టాలు వెంటాడుతున్నాయి. 'మన రాష్ట్రం...మన పాలన' అంటూ గొప్పగా చెప్పుకున్నా అసలు పాలన అనేది జరగడంలేదని మీడియా కథనాల వల్ల తెలుస్తోంది. అసలే వారానికి ఐదు రోజుల పని. పైగా పనులు సరిగా కాకుండా ఈ సమస్యలు. అధికారుల కార్యాయాలు ఇరుకుగా ఉండటమేమిటి? కొన్ని నిర్మాణాలను వాస్తు పేరుతోనో, మరో కారణంతోనో కూలగొట్టి మళ్లీ నిర్మిస్తుండటమేమిటి? వేలాదిమంది ఉద్యోగులు తరలివచ్చాక కూడా ఇంకా నిర్మాణాలు సాగిస్తుండటమేమిటి? ఇలాంటి తుగ్లక్‌ పనులు చేస్తుంటే బెస్ట్‌ సీఎంగా మొదటి ర్యాంకు ఎలా వస్తుంది? చంద్రబాబుకు హడావిడి చేయడం తప్ప ప్లానింగ్‌ లేదని అర్థమవుతోంది. 

Show comments