'గజినీ బాబు'ని ఎడ్యుకేట్‌ చెయ్యండహో.!

ఆంధ్రప్రదేశ్‌కి ప్రత్యేక హోదా కావాలా.? వద్దా.? కావాలంటే మాత్రం, ఖచ్చితంగా ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడుగారిని ఎడ్యుకేట్‌ చెయ్యాల్సిందే. ప్రత్యేక హోదాకీ, కేంద్రం ప్రకటించిన ప్రత్యేక ప్యాకేజీకీ మధ్య వ్యత్యాసమేంటో 'మేధావులు' ఎవరైనా వుంటే, తనను ఎడ్యుకేట్‌ చేయమంటున్నారాయన. 

అరెవో సాంబా.. రాస్కోరోయ్‌.! వయసు మీదపడ్డం వల్ల వచ్చిన మతిమరుపుతోనో, లేదంటే ఓటుకు నోటు కేసు దెబ్బకో చంద్రబాబు గతాన్ని మర్చిపోయి వుంటారు. లేకపోతే, ఆయనెందుకు ప్రత్యేక హోదాపై తనను ఎడ్యుకేట్‌ చేయమంటారు.? చంద్రబాబేమన్నా ఆషామాషీ వ్యక్తి కాదు కదా. సాక్షాత్తూ ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి. పైగా, హైటెక్‌ చంద్రబాబు. కోరుకుంటే క్షణాల్లో మొత్తం ఇన్ఫర్మేషన్‌ వచ్చేస్తుంది. 2014 ఎన్నికలకు ముందు ఏం మాట్లాడాను.? ఎన్నికల తర్వాత ఏం మాట్లాడాను.? ఈ మధ్యకాలంలో ఎలా మాట మార్చాను.? అనే అంశాలమీద ఆయనకే ఓ అవగాహన వచ్చేస్తుంది, ఆ ఇన్ఫర్మేషన్‌ని విశ్లేషిస్తే. 

ఆంధ్రప్రదేశ్‌ అసెంబ్లీలో ఏకంగా రెండుసార్లు ప్రత్యేక హోదా కోసం తీర్మానం చేసేశారు చంద్రబాబు. ఇప్పుడు ఈ విషయాన్నీ చంద్రబాబుకి గుర్తు చేయాలేమో. సిఐఐ భాగస్వామ్య సదస్సు విశాఖపట్నంలో జరుగుతుందట, దాన్ని దెబ్బతీయడానికి కుట్ర జరుగుతుందట. అరెవో సాంబా, ఇది ఇంకా పెద్ద జోక్‌. ఆ సీఐఐ సదస్సు గతంలో కూడా జరిగింది. నాలుగున్నర లక్షల కోట్ల ఒప్పందాలు కుదిరిపోయాయని చంద్రబాబు సర్కార్‌ చెప్పుకుంది. ఏదీ, ఎక్కడ.? ఒక్క రూపాయి అయినా దాని వల్ల వచ్చిందా.? ఖర్చు దండగ వ్యవహారం కాకపోతే.. అని జనం ప్రశ్నిస్తున్నారు. 

సోషల్‌ మీడియాకి వెళితే, చంద్రబాబు గతంలో ఏం చెప్పారు.. ఇప్పుడేం చెబుతున్నారు.. అసలు ప్రత్యేక హోదా అంటే ఏంటి.. ప్రత్యేక ప్యాకేజీతో వచ్చేదేంటి.. ఇవన్నీ నెటిజన్లే విడమరిచి చెప్పేస్తున్నారు. అవన్నీ ఆయన చదువుకోవచ్చు. 

కొసమెరుపు: చంద్రబాబు రాజధాని కూడా కట్టేశారటండోయ్‌.! ఇది చాలు, చంద్రబాబుకి మతిమరుపు ఏ రేంజ్‌లో పెరిగిపోయిందో చెప్పడానికి. అవును, ఆయనిప్పుడు అపర గజినీ.. ఆయనకి ఏదీ గుర్తుండదు. 

Show comments