బాబు మోనార్క్ వైఖరి ఎటు దారి తీస్తుందో?

‘నేను మోనార్క్ ని! నేను ఎవ్వరి మాటా వినను!!’ అని వైఖరి ప్రతిసారీ వర్కవుట్ అవుతుందనుకుంటే అది భ్రమే. ఎంత కొమ్ములు తిరిగిన వారికి అయినా కొన్ని సందర్భాల్లో  అది బెడిసి కొడుతుంది. ఇప్పుడు చంద్రబాబునాయుడు కు కూడా ఆ అనుభవం ఎదురయ్యే పరిస్థితి కనిపిస్తోంది. చంద్రబాబునాయుడు ఈసారి అధికారంలోకి వచ్చిన తరువాత.. ఇప్పటిదాకా ఆయన మోనార్క్ వైఖరినే అవలంబిస్తున్నారు. అయితే వైఎస్సార్ కాంగ్రెస్ తప్ప రాష్ట్రంలో మరో పార్టీ అస్తిత్వం అంటూ కీలకంగా లేకపోవడంతో.. చంద్రబాబు ఆటలు చెల్లుబాటు అవుతూ వచ్చాయి. ఆయన నిర్ణయాలు తమకు కిట్టకపోయినప్పటికీ.. వైకాపాలోకి వెళ్లే పరిస్థితి లేని తెదేపా నేతలు.. నోరుమూసుకుని ఉండే పరిస్థితి ఇన్నాళ్లూ ఉండేది. అయితే ఇప్పుడు మారుతున్న సినేరియోలో.. చంద్రబాబు ఇంకా మోనార్క్ లాగా వ్యవహరిస్తే పార్టీకి దెబ్బపడుతుందేమో అని పలువురు సందేహిస్తున్నారు. 

ప్రధానంగా ఎమ్మెల్సీ ఎన్నికల పర్వం, మంత్రి వర్గ విస్తరణ పర్వం వచ్చేసరికి తెలుగుదేశం పార్టీకి పొంచి ఉన్న ప్రమాదాలు కూడా తేటతెల్లంగా కనిపిస్తున్నాయి. సహజంగానే ఉన్న అవకాశాలకంటె ఆశించే నాయకుల సంఖ్య ప్రతిసారీ జాస్తిగానే ఉంటుంది. అయితే నాయకుడుగా ఉన్న వ్యక్తి.. ఎవరినీ నొప్పించకుండా అనునయించి, బుజ్జగించి పరిస్థితులు చక్కబెట్టుకుంటూ పోవాలి. కానీ.. చంద్రబాబు వైఖరి అందుకు విరుద్ధంగా కనిపిస్తోంది. తమకు ఎమ్మెల్సీలుగా అవకాశ కల్పించమంటూ వస్తున్న నాయకులతో ఆయన వ్యవహరిస్తున్న తీరు, పెడసరంగా స్పందించడం, వారి సీనియారిటీని కనీసంగా కూడా పట్టించుకోకుండా చులకనగా మాట్లాడడం ఇలాంటి మోనార్క్ ధోరణులు పార్టీకి చేటు చేస్తాయేమోనని పలువురు అనుకుంటున్నారు.

ఇటీవల నెల్లూరుకు చెందిన ఆనం వివేకానందరెడ్డి ఎమ్మెల్సీ టిక్కెట్ కోసం అమరావతికి వచ్చి చంద్రబాబునాయుడును పర్సనల్ గా కలిసి, మొహం గంటు పెట్టుకుని వెళ్లారు. తనకు టిక్కెట్ అడిగితే.. ఎవరికి ఏమివ్వాలో నాకు తెలుసు అంటూ చంద్రబాబు పెడసరంగా సమాధానం చెప్పినట్లు వార్తలు బయటకు వచ్చాయి. కాంగ్రెస్‌లో ఓ వెలుగు వెలిగిన ఆనం సోదరుడు, ఇక్కడి ట్రీట్‌మెంట్ పరాభవానికి ఖంగుతిన్నారు. ఇప్పుడు అదే పరిస్థితి ప్రకాశం జిల్లాలోని తెలుగుదేశం సీనియర్ నాయకుడు కరణం బలరాంకు కూడా అదే పరిస్థితి ఎదురైంది. ఆయనకు ఎమ్మెల్సీ టిక్కెట్ ఇవ్వాలని అనుచరులు కోరినప్పుడు ఎవరికి ఏం ఇవ్వాలో నాకు తెలుసు అంటూ చంద్రబాబు రంకెలేసినట్లు వార్తలు వస్తున్నాయి. తమకు టిక్కెట్ కావాలంటూ పార్టీ అధినేతకు విన్నవించుకోవడం కూడా తప్పేనా.. ఆ మాత్రం దానికి ఇలా రంకెలేయాలా అంటూ పార్టీ శ్రేణులు నాయకులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. బహిరంగంగా ఈ రెండు దృష్టాంతాలు తెలిశాయి గానీ.. వాస్తవానికి మంత్రిపదవులకోసం, ప్రధానంగా ఎమ్మెల్సీ టిక్కెట్ల కోసం పైరవీలు చేసుకుంటున్న పలువురికి ఇలాంటి పెడసరపు సమాధానాలే ఎదురవుతున్నాయిట. చంద్రబాబు అనుసరిస్తున్న ఇలాంటి మోనార్క్ ధోరణులు పార్టీ శ్రేణుల్లో అసంతృప్తిని ఏ అంచులకు తీసుకువెళతాయోనని, పార్టీకి ఎలాంటి చేటు జరుగుతుందోనని గుసగుసలు వినిపిస్తున్నాయి. 

Show comments