క్రిష్ అబౌట్ టర్న్

చిన్న సినిమాతో తన సినిమా గమ్యం చేరుకోవడానికి ప్రయత్నం ప్రారంభించాడు దర్శకుడు క్రిష్. అక్కడ ప్రారంభమైన జర్నీ బాలకృష్ణ వందో సినిమా దాకా చేరుకుంది. మరి తరువాత ఏంటీ? అని ప్రశ్నించుకుంటే మళ్లీ చిన్న సినిమా అనే సమాధానం వస్తోందట. హీరో వెంకీకి సబ్జెక్ట్ చెప్పడం ఓకె చేయడం అయిపోయింది. దానికి గ్రాఫిక్స్ వర్క్ కాస్త చెప్పుకోతగ్గ సైజ్ లో వుండడంతో  ముందుగా ఆ సీన్లు తీయాలని కూడా అనుకున్నారు. కానీ ఇప్పుడు మధ్యలో మళ్లీ ఏమయిందో కానీ ఇప్పుడు చిన్న సినిమా ఆలోచనలు చేస్తున్నాడట క్రిష్.

అంటే మళ్లీ మొదటికి వచ్చేసాడనే అనుకోవాలా? అంటే అది కాదట. డైరక్టర్ సుకుమార్ మాదిరిగానే తన దగ్గర వున్న అసిస్టెంట్ ల్లో సమర్థులైన వారితో చిన్న సినిమాలు తమ బ్యానర్ పై చేయాలనే ఆలోచనలో వున్నారట. అంటే క్రిష్ నే అన్నీ ప్లాన్ చేసి, సెట్ చేసి, వాళ్లకి అప్పగిస్తారన్నమాట. నిర్మాణం ఎలాగూ ఆయన స్నేహితులు, పార్టనర్ లు వున్నారు. ఆపై క్రిష్ దర్శకత్వ పర్యవేక్షణ ఎలాగూ వుంటుంది. అయితే ఇంత పెద్ద సినిమా చేసిన తరువాత చిన్న సినిమా చేస్తే బాగుండదు కనుక, అసిస్టెంట్ ల పేరుతో సినిమా చేసే ప్రయత్నమా అన్న గుసగుసలు కూడా వినిపిస్తున్నాయి.

Show comments