మినిస్టర్‌ అఖిలప్రియకి అంత నమ్మకమేంటి.?

తల్లి మరణంతో ఎమ్మెల్యే పదవి దక్కితే, తండ్రి మరణంతో మంత్రి పదవి దక్కింది అఖిల ప్రియకి. ఆళ్ళగడ్డ ఎమ్మెల్యే అయ్యాక తండ్రి చాటు బిడ్డగానే కన్పించిన అఖిలప్రియ, తండ్రి భూమా నాగిరెడ్డి మరణం తర్వాత.. అందునా మంత్రి పదవి దక్కాక, నిఖార్సయిన పొలిటికల్‌ లీడర్‌లా కన్పిస్తున్నారు. ఆమె వ్యవహారశైలి, మాట తీరు.. అంతా మారిపోయిందిప్పుడు. 

భూమా నాగిరెడ్డి మరణం కారణంగా నంద్యాల నియోజకవర్గానికి ఉప ఎన్నిక అనివార్యమయ్యింది. అయితే, ఇక్కడినుంచి టీడీపీ తరఫున ఎవర్ని నిలబెట్టాలన్నదానిపై కర్నూలు జిల్లా టీడీపీ వర్గాల్లో భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఫరూఖ్‌, శిల్పా మోహన్‌రెడ్డి రేసులో తామే ముందున్నామంటున్నారు. అయితే, ఇక్కడో చిన్న ట్విస్ట్‌ తనకు రాకపోయినా ఫర్లేదు, శిల్పా మోహన్‌రెడ్డికి మాత్రం ఛాన్స్‌ ఇవ్వొద్దన్నది ఫరూక్‌ వాదన. మరోపక్క, సీటు దక్కకపోతే టీడీపీకి గుడ్‌ బై చెబుతానని బెదిరిస్తున్నారు శిల్పా మోహన్‌రెడ్డి. 

ఈ పరిస్థితుల్లో అఖిలప్రియ చక్రం తిప్పేశారు (అలాగని ఆమె అనుకుంటున్నారు). ఎట్టి పరిస్థితుల్లోనూ తమ కుటుంబానికే నంద్యాల టీడీపీ టిక్కెట్‌ దక్కుతుందని కాన్ఫిడెంట్‌గా చెబుతున్నారామె. ముఖ్యమంత్రి చంద్రబాబు నుంచి ఈ విషయమై తమకు స్పష్టమైన హామీ వచ్చిందనీ, తమ కుటుంబం నుంచి ఎవరు నంద్యాల ఉప ఎన్నికల బరిలో నిలుస్తారనేదానిపై కుటుంబంలో చర్చించుకుని, అభిమానులతో మాట్లాడుకుని చెబుతామని అఖిలప్రియ చెప్పుకొచ్చారు. 

భూమా కుటుంబం నుంచి అంటే, అఖిల ప్రియ చెల్లెలు, సోదరుడు మాత్రమే పోటీ చేయాలి. అఖిల ప్రియ ఈ విషయమై చాలా కాన్ఫిడెంట్‌గా వున్నా, చంద్రబాబు రాజకీయాలు అంత తేలిగ్గా ఎవరికీ అంతుబట్టవు. చంద్రబాబు తనకు హామీ ఇచ్చారని, మంత్రి హోదాలో అఖిల ప్రియ ఎంత గట్టిగా చెబుతున్నప్పటికీ, చంద్రబాబు చక్రం తిప్పితే ఆమె సంగతి అంతే.!

Show comments