అది అబద్ధమని బాబు ఒప్పుకున్నట్టే!

కరువు మండలాల ప్రకటన జరిగింది. రాయలసీమలో ఎక్కువ మండలాలను కరువు ప్రభావిత ప్రాంతాలుగా గుర్తించారు. అయితే ఈ ప్రకటన పట్ల అదే ప్రాంతం నుంచి నిరసనా వ్యక్తం అవుతోంది. అనంతపురం జిల్లా ను మొత్తం కరువు ప్రభావిత ప్రాంతంగా ప్రకటించారు. బాగానే ఉంది. కానీ కడప, చిత్తూరు, కర్నూలు జిల్లాల్లో కొన్ని మండలాలను కరువు ప్రభావిత ప్రాంతాలుగా ప్రకటించి మరికొన్ని మండలాలను ఆ జాబితాలో చేర్చలేదు. పక్కపక్క మండలాల విషయంలో ఇలా జరిగినప్పుడు.. ఆ రెండు మండలాల్లో పంట పరిస్థితికి తేడా లేకపోవడంతో.. రైతుల నుంచి నిరసన వ్యక్తం అవుతోంది.

అలాగే గమనించాల్సిన మరో అంశం.. కరువు మండలాల ప్రకటన జాబితా ఇదే ఫైనల్ కాదు! ఇప్పుడు ఇన్ని మండలాలు కరువు ప్రభావితం అని ప్రకటించిన ప్రభుత్వం రేపు క్యాబినెట్ లో సమావేశం జరిపి.. అన్ని మండలాల్లో కరువు లేదు అంటూ ఆ జాబితా నుంచి కొన్ని మండలాలను తొలగించినా తొలగించగలదు. బాబు అధికారంలోకి వచ్చాకా.. గత రెండేళ్లలో ఇలాంటి లీలలు చూపించారు. దీంతో… కరువు మండలాల విషయంలో కథ అయిపోయిందని అనుకోవడానికి లేదు.

ఇంకో ఆసక్తికరమైన అంశం.. చంద్రబాబు ఇది వరకూ చేసిన ప్రకటనలు. అనంతపురం జిల్లా పర్యటనలో బాబు  ఏమన్నాడంటే.. ‘కరువును జయించేశా..’ అని. రెయిన్ గన్నులతో పంటలను కాపాడేశా అని.. లక్షల హెక్టార్లలో పంటకు రెయిన్ గన్నులతో నీళ్లు అందించిన తన మేధో తనాన్ని చెప్పుకుని తనే మురిసిపోయాడు చంద్రబాబు! అయ్యా.. నీళ్లు లేని చోట.. రెయిన్ గన్నులతో ఏం చేశారు? బావుల్లో, బోర్లలో నీళ్ల సదుపాయం లేని మెట్ట ప్రాంతాల్లో వాటితో.. ఏం చిమ్మి పంటను రక్షించారు? అని ప్రశ్నించినా.. ప్రభుత్వం నుంచి స్పందన లేదు!

కరువును జయించేశాం.. రెయిన్ గన్నులతో పంటను రక్షించేశాం.. అనే ప్రకటనలు మాత్రం వచ్చాయి. లక్షల ఎకరాలు అనే గణాంకాలు మాత్రం చెప్పారు. మరి కరువును అప్పుడే జయించేసి ఉంటే.. మళ్లీ ఇప్పుడు కరువు మండలాల ప్రకటన ఎలా చేశారు? రెయిన్ గన్నులతో పంటను రక్షించామని చెప్పిన ప్రభుత్వమే.. కరువు ప్రభావిత ప్రాంతం గురించి వివరాలు చెబుతోందే! ఇందులో ఏది అబద్ధం? ఏది నిజం?

కరువును జయించానని చెప్పిన ముఖ్యమంత్రి.. రేపటి నుంచి కరువు మండలాలను ప్రకటించానని.. గొప్ప గా చెప్పుకుంటాడా? రెయిన్ గన్నుల ఫార్ములాను తను కనుగొన్నాను అని.. దాంతో అద్భుతాలు జరిగిపోయాయని చెప్పుకున్న ఆయన.. లేదు రెయిన్ గన్నుల ఉపయోగం లేకపోయింది.. అని ఇప్పుడు ఒప్పుకుంటారా?

ఇంతకీ.. రెయిన్ గన్నుల కోసం పెట్టిన కోట్ల రూపాయల ఖర్చు మాటేంటి? వాటిని అందించే మిష మీద జరిగిన దోపిడీ కథేంటి? అలాంటి అర్థం లేని పనులు చేసేదే సొంత పార్టీ వాళ్లకు దోచుకునే అవకాశం ఇవ్వడానికి.. వాళ్ల జేబు నింపడానికే కదా!

ఈ అంశాల గురించి వివరణ ఇవ్వాల్సిన ప్రభుత్వం.. కరువు  మండలాల విషయంలో చేపట్టాల్సిన చర్యలు కూడా చాలా ఉన్నాయి. కనీసం తాము ఇచ్చిన రుణమాఫీ హామీని ఒకేసమయంలో.. అమలు పరిస్తే కరువు ప్రభావిత రైతులను అంతో ఇంతో ఆదుకున్నట్టు అవుతుంది. దీంతో పాటు.. క్రాప్ ఇన్సూరెన్సు, ఇన్ పుట్ సబ్సిడీల విషయంలో గత రెండేళ్లలో అనుసరించి మోసపూరిత వైఖరిని పక్కన పెట్టి.. రైతుల పరిస్థితిని అర్థం చేసుకుని వ్యవహరించాలి. అలాగాక.. ఏదో నామమాత్రంగా కరువు ప్రభావిత ప్రాంతాల జాబితాను వదిలినంత మాత్రాన రైతును ఉద్ధరించినట్టు కాదు.

Show comments