జగన్‌ దీక్షలు తేడా కొట్టేస్తున్నాయ్‌.!

రాజకీయాల్లో ఆందోళనలు, దీక్షలు సర్వసాధారణం. అయితే, ప్రతిపక్ష నేత చేసే దీక్షకి ఏ స్థాయి హంగామా వుండాలి.? దీక్షా ప్రాంగణంలోనో, దీక్ష జరుగుతున్న జిల్లాలోనో బీభత్సమైన హడావిడి వుంటే సరిపోదు. దీక్ష అంటే అంతకు మించి.. అనే స్థాయిలో వుండాల్సిందే. లేదంటే, ఈ రోజుల్లో దీక్షలకు విలువ వుండదు. 

వైఎస్సార్సీపీ అధినేత వైఎస్‌ జగన్‌, రాజకీయ దీక్షల్లో తనదైన ప్రత్యేకతను చాటుకుంటున్నారు. ఒకరోజు దీక్ష, రెండ్రోజుల దీక్ష.. ఇలా దీక్షల్లో కొత్త ట్రెండ్‌కి తెరలేపారు. మామూలుగా అయితే ఓ రోజు ఆందోళనా కార్యక్రమం చేపట్టడం.. లేదంటే, నిరవధిక నిరాహార దీక్ష చేయడం.. ఇలాంటివి రాజకీయాల్లో చూస్తుంటాం. దానికి భిన్నంగా వుంటుంది, జగన్‌ దీక్షల వ్యవహారం. 

గుంటూరు జిల్లాలో తాజాగా నిర్వహించిన జగన్‌ దీక్ష రెండ్రోజులపాటు సాగింది. రెండ్రోజులు.. అంటే అది కౌంట్‌ మాత్రమే. ముందు రోజు ఉదయం ప్రారంభమయ్యే దీక్ష, మరుసటిరోజు సాయంత్రానికి ముగిసిపోతుంది. అఫ్‌కోర్స్‌, ఆమరణ నిరాహార దీక్ష.. అంటూ ఆ మధ్య ఇదే గుంటూరు జిల్లాలో వైఎస్‌ జగన్‌ దీక్ష చేసినా, చంద్రబాబు సర్కార్‌ కాస్తంత అప్రమత్తమై, జగన్‌ దీక్షను వ్యూహాత్మకంగా భగ్నం చేసిందనుకోండి.. అది వేరే విషయం. 

అయినాసరే, రాజకీయ దీక్షలంటే.. వాటికి పక్కా ప్లానింగ్‌ వుండాలి. ఫలానా చోట దీక్ష చేయాలనుకున్నప్పుడు, ముందస్తుగా రాష్ట్రమంతా ఆ దీక్షకు సంఘీభావం వచ్చేలా ఏర్పాట్లు చేసుకోవాల్సి వుంటుంది. కానీ, ఈ విషయంలో జగన్‌ వ్యూహాలు ఏమంత పక్కాగా వున్నట్లు అన్పించదు. జగన్‌ దీక్ష చేయాలనుకుంటారు, చేస్తారంతే. ఈ అభిప్రాయం వైఎస్సార్సీపీ శ్రేణుల్లోనే బలంగా విన్పిస్తుంటుంది. అలాంటప్పుడు, అధికార పార్టీ జగన్‌ దీక్షల్ని ఇంకెంత లైట్‌ తీసుకుంటుంది.? అదే జరుగుతోందిప్పుడు. జగన్‌ దీక్ష చేస్తున్నాడనగానే, కాసిన్ని రాజకీయ విమర్శలతో అధికార పార్టీ సరిపెట్టేస్తుంటుంది. 

ఈ మొత్తం 'తతంగం' ఓ ప్రసహనంగా మారిపోతుండడంతో.. అసలు సమస్య, అవ్వాల్సిన స్థాయిలో ఎలివేట్‌ అవకపోవడం విచారకరం. నిజానికి, జగన్‌ చేపట్టిన రైతు దీక్షతో రాష్ట్రమంతా కదిలి వచ్చి వుండాలి. కానీ, అది జరగలేదాయె. ఒక దీక్ష తర్వాత ఇంకో దీక్ష, ఆ తర్వాత మరో దీక్ష.. ఇలా చేసుకుంటూ పోతోన్న జగన్‌, ఖచ్చితమైన వ్యూహాలతో ఆ దీక్షల్ని చేపడితే, పార్టీకి తద్వారా రాష్ట్రానికీ మేలు జరుగుతుంది. కానీ, ఆ దిశగా జగన్‌ వ్యూహాలకు పదును లేకపోవడం ఆశ్చర్యకరం.

Show comments