నంద్యాల్లో పవన్ కల్యాణ్ ను వాడేస్తున్న టీడీపీ!

వచ్చే ఎన్నికల్లో జనసేన ఏపీలో విజయదుందుభి మోగించి.. అధికారాన్ని హస్తగతం చేసుకుంటుందని.. ఆ మధ్య పవన్ కల్యాణ్ అభిమానులు సోషల్ మీడియాకు ఎక్కి చెప్పారు. మరి అలాంటి పార్టీ నంద్యాల ఉప ఎన్నికల విషయంలో మాత్రం ఇంతవరకూ నోరు విప్పలేదు. ఎన్నికల నోటిఫికేషన్ కు సమయం దగ్గర పడుతున్న నేపథ్యంలో.. ఆఖరికి ఊపిరిలేని కాంగ్రెస్ పార్టీ కూడా అభ్యర్థిని నిలుపుతానని అంటుంటే.. జనసేన మాత్రం ఒక ఎన్నిక జరుగుతోందని తెలియనట్టుగానే ఉంది. 

మరి పవన్ కు సినిమాల నుంచి విరామం ఏమైనా దొరికితే గాని పోటీ గురించి ప్రకటన రాకపోవచ్చు. అది ఆ పార్టీ స్పెషాలిటీ. మరి ఆ పార్టీ స్పెషాలిటీ అలా ఉంటే.. తెలుగుదేశం మాత్రం తనదైన స్పెషాలిటీతో వెళుతోంది. నంద్యాల ఉపఎన్నికల్లో పవన్ కల్యాన్ ఫొటోను అడ్డంగా, నిలువుగా, వీలైనట్టుగా వాడేస్తోంది టీడీపీ. పవన్ కల్యాణ్ మద్దతు కూడా టీడీపీకే ఉందని.. టీడీపీ నేతలు చెప్పుకొంటున్నారు. తెలుగుదేశం పార్టీ తరపున తిరుగుతున్న వాళ్లు ఇదే మాటే చెబుతున్నారు.

జనసేన జెండాలను తయారు చేయించుకుని వాడుకుంటున్నారు. నంద్యాల్లో పవన్ కల్యాణ్ కు పడే ఓట్లు ఎన్ని అనేది తర్వాతి లెక్క. వాడుకునేస్తే తర్వాత సంగతి తర్వాత అన్నట్టుగా ఉంది తెలుగుదేశం వ్యూహం. ఎలాగూ పవన్ కల్యాణ్ క్రితంసారి ఎన్నికల్లో తెలుగుదేశం తరపునే ప్రచారం చేశాడు కాబట్టి.. ఇప్పుడు కూడా తమ వాడే అని తెలుగుదేశం చెప్పేసుకోవడానికి అవకాశం ఏర్పడింది. మరి క్షేత్ర స్థాయిలో ఇలా జరుగుతున్నా పీకే పార్టీ నుంచి మాత్రం ఇంకా ప్రకటనలు ఏమీరాలేదు. అవతల పవన్ కల్యాణ్ తో కలిసి మహాకూటమిని ఏర్పాటు చేస్తామని అంటున్న కమ్యూనిస్టు పార్టీలు కూడా నంద్యాల ఉపపోరుపై మారు మాట్లాడటం లేదు. 

2019 ఎన్నికలకు ట్రయల్స్ లాంటి ఉపఎన్నికలో తమ వంతుగా పవన్ తో కలిసి బరిలోకి దిగాలని ఎర్రన్నలు ఉబలాటపడుతున్నారు. అయితే పవన్ మాత్రం కిమ్మనడంలేదు. పవన్ ను తెలుగుదేశం వాళ్లు వాడేసుకుంటున్నారు. దీంతో కమ్యూనిస్టులకు ఏమీ పాలుపోవడం లేదని తెలుస్తోంది. Readmore!

Show comments