మహేష్‌ ఎప్పుడొస్తాడట.?

మహేష్‌ హీరోగా మురుగదాస్‌ దర్శకత్వంలో తెరకెక్కుతోన్న సినిమాకి సంబంధించి సస్పెన్స్‌ ఇంకా కొనసాగుతూనే వుంది. ఇందులో ప్రముఖ దర్శకుడు ఎస్‌జె సూర్య విలన్‌గా నటిస్తోంటే, రకుల్‌ ప్రీత్‌ సింగ్‌ హీరోయిన్‌గా నటిస్తోన్న విషయం విదితమే. మొన్నెప్పుడో సంక్రాంతికి ఈ సినిమా ఫస్ట్‌ లుక్‌ వస్తుందన్నారు.. ఆ తర్వాత జనవరి 26న వస్తుందనే ప్రచారం జరిగింది.. అలా అలా ఉగాది వరకూ వ్యవహారం నడిచింది. ఉగాది కూడా దాటేసిందిగానీ, ఇంతవరకు ఈ సినిమాకి సంబంధించి అధికారికంగా ఎలాంటి లుక్‌ విడుదల కాలేదు. 

అయితే, సినిమాటోగ్రాఫర్‌ సంతోష్‌ శివన్‌ మాత్రం, సెట్స్‌లో మహేష్‌ ఫొటోల్ని ఒక్కొక్కటీ రిలీజ్‌ చేస్తూ, మహేష్‌ అభిమానుల్లో జోష్‌ పెంచుతుండడం గమనార్హమిక్కడ. మొన్నామధ్య మహేష్‌ స్టిల్‌ని సంతోష్‌ శివన్‌ విడుదల చేయడం, అది అప్పట్లో హాట్‌ టాపిక్‌ అవడం తెల్సిన విషయాలే. తాజాగా మరో స్టిల్‌ వెలుగు చూసింది. మొదటి స్టిల్‌ విడుదలయ్యాక, 'కమింగ్‌ సూన్‌..' అంటూ ఉగాదికి ఫస్ట్‌ లుక్‌ వస్తుందన్న సంకేతాలు పంపాడు దర్శకుడు మురుగదాస్‌. కానీ, ఉగాదికి లుక్‌ ఏదీ రాలేదు. 

నిన్ననే రెండో స్టిల్‌ని విడుదల చేయడం ద్వారా మహేష్‌ అభిమానులకి సంతోష్‌ శివన్‌, ఉగాది కానుక ఇచ్చేశాడనే అనుకోవాలి. అయినాసరే, అభిమానులు కోరుతున్నది టైటిల్‌తో కూడిన లుక్‌. అదెప్పుడొస్తుందో ఏమో.!

Show comments