మోడీ సాబ్‌.. భలే ఛాన్సులే.!

ప్రధాని నరేంద్రమోడీ తీసుకొచ్చిన కరెన్సీ సంక్షోభం అనంతరం, దేశంలో ఆర్థిక వ్యవస్థ అస్తవ్యస్తంగా తయారయ్యిందన్నది నిర్వివాదాంశం. దేశ ఆర్థిక ప్రగతి అగమ్యగోచరంగా తయారయ్యిందంటూ ఆర్థిక నిపుణులు విశ్లేషిస్తున్న వేళ, అనూహ్యంగా తమిళనాడులో జల్లికట్టు వివాదం దేశవ్యాప్త దుమారానికి కారణమయ్యింది. దేశంలో ఇంకే సమస్యా లేదు, ఒక్క జల్లికట్టు తప్ప.. అన్న స్థాయిలో ఈ దుమారం చెలరేగుతుండడం గమనార్హం. 

అతి త్వరలో పార్లమెంటు బడ్జెట్‌ సమావేశాలు జరగనున్నాయి. ఇంకోపక్క ఐదు రాష్ట్రాల ఎన్నికలు. ఈ పరిస్థితుల్లో అనూహ్యంగానే జల్లికట్టు వివాదం ముదిరి పాకాన పడింది. నిజానికి జల్లికట్టుపై నిషేధం ఇప్పటి విషయం కాదు. కానీ, ఇప్పుడే ఇది ఎందుకంత సీరియస్‌ అయ్యింది.? అన్న ప్రశ్నకు 'తెరవెనుక శక్తులు' అన్న సమాధానం రాకుండా వుండదు. ఆ శక్తులు ఏంటి.? అన్నది ప్రస్తుతాకైతే సస్పెన్సే. 

చిత్రంగా విద్యార్థులు ఈసారి రోడ్డెక్కి ఆందోళనలకు దిగారు జల్లికట్టు కోసం. సోషల్‌ మీడియాలో నెమ్మదిగా ప్రారంభమైన జల్లికట్టు పోరాటం, చినికి చినికి గాలివానలా తయారైంది. సినీ, రాజకీయ ప్రముఖులు ఇప్పుడు ఈ జల్లికట్టు వివాదంలో 'క్రెడిట్‌' వెతుక్కోవడానికి నానా తంటాలూ పడుతున్నారు. పెద్ద పాత నోట్ల రద్దు తర్వాత దేశంలో తీవ్ర ఇబ్బందికర పరిస్థితులు నెలకొన్నా, ఈ స్థాయిలో ఆందోళనలు చోటుచేసుకోలేదు. అది ఆశ్చర్యకరమైన విషయమే. దేశ ప్రజల్లో సంయమనం ఓ రేంజ్‌లో వుందని అంతా మురిసిపోయాం. నోట్ల కష్టాల్ని అనుభవించాం, అనుభవిస్తూనే వున్నాం. 

ఇప్పుడేమో, ఓ ఆట కోసం.. ఓ రాష్ట్రం భగ్గుమంటోంది. సెంటిమెంట్‌ తప్ప ఇంకో మాట లేదు ఆందోళనకారుల నుంచి. ఇంకేముంది, సుప్రీంకోర్టు తీర్పుని తోసిపుచ్చి, కేంద్రం ఆర్డినెన్స్‌ తీసుకురావాలనుకుంటోంది. ఇప్పటికిప్పుడు కాకపోయినా, భవిష్యత్తులో బీజేపీకి తమిళనాడులో రాజకీయ లబ్ది చేకూరడానికి ఈ జల్లికట్టు ఎపిసోడ్‌ బీభత్సంగా ఉపయోగపడే అవకాశాలున్నాయి. మరోపక్క, జల్లికట్టు వివాదం పుణ్యమా అని కరెన్సీ సంక్షోభం నుంచి దేశం దృష్టి పక్కకు మళ్ళడమూ బీజేపీకి కలిసొచ్చే అంశమే. ఇది బీజేపీ సృష్టించిన వివాదమనే ఆరోపణల సంగతెలా వున్నా, ఐదు రాష్ట్రాల ఎన్నికలకు ముందు దేశంలో ఈ గందరగోళాన్ని బీజేపీ నేతలు ఓ రేంజ్‌లో ఎంజాయ్‌ చేస్తున్నారన్నది నిర్వివాదాంశం.

Readmore!

Show comments