భారతీయుడొకరు పాకిస్తాన్‌లో ఉరికంబమెక్కనున్న దరిమిలా, దేశమంతా ఇప్పుడాయన కోసం ఆందోళన చెందుతోంది. భారతదేశానికి చెందిన రీసెర్చ్ అండ్ అనాలసిస్ వింగ్ ('రా') తరఫున 'స్పై' (గూఢచర్యం) చేస్తున్నారనే ఆరోపణల నేపథ్యంలో భారత మాజీ నేవీ అధికారి కుల్ భూషణ్ జాదవ్‌కి పాకిస్తాన్ ఆర్మీ కోర్టు ఉరిశిక్ష విధించిన విషయం విదితమే.
కుల్ భూషణ్ వ్యవహారంపై పార్లమెంటు ఉభయ సభలు దద్దరిల్లిపోయాయి. గతంలో పాకిస్తాన్‌లో పర్యటించిన ప్రధాని నరేంద్రమోడీ, పాకిస్తాన్‌తో 'స్నేహహస్తం' మాత్రం అందుకోలేకపోయారనీ, పాకిస్తాన్‌ని ఉగ్రవాద దేశంగా ప్రకటించి, ఆ దేశంతో సంబంధాలు తెంచుకోవాలనీ, కుల్ భూషణ్‌ని రక్షించాలనీ కాంగ్రెస్ పార్టీ పార్లమెంటులో ఆందోళనలు చేపట్టింది. మరోపక్క, కుల్ భూషణ్ జాదవ్ విషయంలో రాజకీయాలు తగదనీ, దేశమంతా ఒక్కతాటిపై నిలవాల్సి వుందని అధికార బీజేపీ చెబుతోంది. కుల్ భూషణ్ జాదవ్‌ని క్షేమంగా తీసుకొచ్చేందుకు అన్ని ప్రయత్నాలూ చేస్తామన్నది మోడీ సర్కార్ వాదన.
అయితే, పాపాల పాకిస్తాన్ నుంచి కుల్ భూషణ్ జాదవ్‌ని విడిపించడం అంత తేలిక కాదు. పైగా, గూఢచర్యం ఆరోపణలతో ఉరిశిక్ష విధించిన వ్యక్తిని పాకిస్తాన్ ఎట్టి పరిస్థితుల్లోనూ భారత్‌కి అప్పగించకపోవచ్చు. ఇరాన్‌లో అక్రమంగా అరెస్ట్ చేసి, కుల్ భూషణ్‌పై లేనిపోని ఆరోపణలు చేస్తున్నారనే భారత వాదనకు అంతర్జాతీయ సమాజం నుంచి మద్దతు లభించాలిప్పుడు. అలా అంతర్జాతీయ సమాజం దృష్టికి తీసుకెళ్ళాల్సిన స్థాయిలో ఈ వ్యవహారాన్ని తీసుకెళ్ళకపోతే, కుల్ భూషణ్ ని క్షేమంగా తీసుకొచ్చేందుకు అవకాశాలు సన్నగిల్లిపోతాయి. అన్నిటికీ మించి, ఇప్పుడు ఈ సందర్భంలో దేశంలో ఈ విషయమై ఎలాంటి రాజకీయాలకూ తావుండకూడదు. ఈ సందర్భంలో మోడీని విమర్శించడం ద్వారా కాంగ్రెస్ ఏం బావుకోవాలనుకుంటోందో ఏమో.!
మురోపక్క, కుల్ భూషణ్ జాదవ్ 'గూఢచారి' అనడానికి తగ్గ ఆధారాలు చూపించాల్సిందేనని భారత్ డిమాండ్ చేయడంతో పాకిస్తాన్ కాస్త డిఫెన్స్‌లో పడినట్లే కన్పిస్తోంది. అయినాసరే, పాకిస్తాన్ తోక వంకర. కాబట్టి, కుల్ భూషణ్ విషయంలో భారత్ తరఫున ఏ స్థాయిలో ప్రయత్నాలు జరిగినా, సత్ఫలితాలనిస్తాయని ఆశించలేం. ఇక్కడ అద్భుతం జరగాల్సిందే. అది అంతర్జాతీయ సమాజం నుంచి పాకిస్తాన్‌పై తీవ్ర ఒత్తిడి రూపంలో కావొచ్చు. అది జరుగుతుందనే ఆశిద్దాం.