మూడో 'సింగం' ఏం చేస్తుందో.!

సూర్య హీరోగా రూపొందిన 'సింగం' సిరీస్‌లో మూడో చిత్రం రాబోతోంది. డిసెంబర్‌లో ఈ చిత్రాన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తారు. 'సింగం' సినిమాలో అనుష్క హీరోయిన్‌గా నటిస్తే, 'సింగం-2'లో అనుష్కతోపాటు హన్సిక జాయిన్‌ అయ్యింది. 'సింగం-3' సినిమాలో శృతిహాసన్‌ నటిస్తోంది. దేవిశ్రీప్రసాద్‌ స్థానంలోకి మ్యూజిక్‌ డైరెక్టర్‌ హరీష్‌ జేరాజ్‌ చేరాడు. 

తొలి రెండు సినిమాల విషయానికొస్తే, 'సింగం' సంచలన విజయాన్ని అందుకుంది. 'సింగం-2' మాత్రం ఓ మోస్తరుగానే విజయాన్ని దక్కించుకుంది. 'సింగం'తో పోల్చి చూస్తే, 'సింగం-2' కాస్త నిరాశపరిచినట్లే లెక్క. అందుకే, 'సింగం-3' సినిమాకి వచ్చేసరికి, చాలా జాగ్రత్తలు తీసుకున్నాడు దర్శకుడు హరి. సూర్య సైతం, ఇంకా కొత్తగా కనిపించేందుకు పలు జాగ్రత్తలు తీసుకున్నాడట. 

డిసెంబర్‌లో ప్రేక్షకుల ముందుకు రానున్న 'సింగం-3'ని తమిళంతోపాటు, తెలుగులోనూ విడుదల చేస్తారని ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు కదా.! ఈ మధ్యకాలంలో సూర్య నుంచి వస్తున్న సినిమాల్లో ఏదీ అతని స్టామినాకి తగ్గ విజయాన్ని ఇవ్వలేకపోయాయన్నది నిర్వివాదాంశం. వెరైటీ సినిమాలు చేసి, నటుడిగా గుర్తింపు పొందుతున్నా, కమర్షియల్‌ బ్లాక్‌ బస్టర్‌ కోసం చాన్నాళ్ళుగా సూర్య ఎదురుచూస్తున్నాడు. ఆ బ్లాక్‌ బస్టర్‌ మళ్ళీ తనకు 'సింగం'తోనే దక్కుతుందని ఎదురుచూస్తున్న సూర్య ఆశ నెరవేరుతుందో లేదో వేచి చూడాల్సిందే.

Show comments