ఏపీ పోలీసు బాస్, డీజీపీని ‘చంద్రబాబుకు బానిస’ అంటూ ఎమ్మెల్యే రోజా కాస్త దుడుకు గానే తిట్టినమాట నిజమే గానీ.... అంత ఘాటు తిట్లు పడేసరికి.. పాపం.. పోలీసులు ‘ఓపెన్ అప్’ అవుతున్నారు. ‘‘డీజీపీని తిట్టిన వ్యాఖ్యలు వెనక్కు తీసుకోవాలి... పోలీసు ఉద్యోగం అంటూ చేస్తున్నప్పుడు మా మీద కూడా కొన్ని ఒత్తిళ్లు ఉంటాయి కదా’’ అంటూ ఏపీ పోలీస్ ఆఫీసర్స్ అసోసియేషన్ వారు ఏకంగా ప్రెస్ మీట్ పెట్టి మరీ ఆవేదన వ్యక్తం చేశారు. మొత్తానికి ఈ పోలీసు అధికారుల మాటలను బట్టి.. రాజకీయ ఒత్తిళ్ల కారణంగానే... ఎమ్మెల్యే రోజా అరెస్టు జరిగినదని చాలా విపులంగా అర్థమైపోతున్నది. ఆమె సదస్సును భంగపరుస్తుందని స్పష్టమైన సమాచారం ఉన్నందునే అదుపులోకి తీసుకున్నారంటూ.. ఇన్నాళ్లూ చంద్రబాబు వందిమాగధులు పలికిన పలుకులు ఉత్తుత్తివే అని తేలిపోయింది.
మహిళా పార్లమెంటేరియన్ సదస్సు అంటూ ఓ మొక్కుబడి సదస్సును నిర్వహించి.. ఏపీ ప్రభుత్వం మూటగట్టుకున్న అప్రతిష్ట అంతా ఇంతా కాదు. అసలే మహిళా నాయకురాళ్లకు అగ్రపీఠం వేసిన సదస్సుగా డప్పు కొట్టుకుంటూ కనీసం సోనియాగాంధీ, ప్రతిభా పాటిల్, మీరాకు మార్ వంటి వారిని కూడా ఆహ్వానించకపోవడం ఒక సిగ్గుపడాల్సిన విషయం కాగా.. ఆహ్వానాలు ఉన్న ఎమ్మెల్యే రోజాను అరెస్టు చేసి.. సభకు వెళ్లనివ్వకుండా నిరోధించి.. పోలీసులు నానా యాగీ చేశారు.
అసలే వైసీపీలో ఫైర్ బ్రాండ్ అనదగిన రోజా ఈ అంశంపై సహజంగానే నిప్పులు చెరిగారు. డీజీపీ మీద కూడా విమర్శలు గుప్పించారు. అయితే పచ్చగణాలన్నీ ఆమె విమర్శలకు కౌంటర్లు ఇవ్వడానికి రకరకాల కారణాలు వెతుక్కున్నాయి. ఆమె రచ్చ చేయడానికే సదస్సుకు వచ్చారని, అందుకు ఆధారాలు కూడా ఉన్నాయని ప్రత్యారోపణలు చేశాయి.
అయితే డీజీపీ మీద రోజా విరుచుకుపడిన నేపథ్యంలో గురువారం నాడు ఏపీ పోలీసాఫీసర్స్ అసోసియేషన్ వారు అమరావతిలో ప్రెస్ మీట్ పెట్టి మరీ ఆవేదన వ్యక్తం చేశారు. పోలీసు ఉద్యోగంలో ఉన్నప్పుడు తమ మీద కొన్ని ఒత్తిళ్లు ఉంటాయని వారు చెప్పుకొచ్చారు. తాము చేసిన పని తప్పు అనిపిస్తే న్యాయస్థానానికి వెళ్లాలే తప్ప.. డీజీపీని మాటలు అనరాదని బాధపడ్డారు. అయితే, వారి మాటల్లో కేవలం ఒత్తిళ్ల కారణంగానే రోజాను అరెస్టు చేశారనే సంగతి మాత్రం స్పష్టమైపోయింది. మరి ఇప్పుడు పచ్చగణాలన్నీ ఏం చెప్పి తమ దాష్టీకాలను సమర్థించుకుంటాయో చూడాలి. సదరు ‘ఒత్తిళ్లు’ అనే పదం చెప్పడం ద్వారా పోలీసు అధికార్ల సంఘం వారు ఎవరిని ఉద్దేశించారో ప్రజలే అర్థం చేసుకోవచ్చు.