రెడ్డి గారు.. రెడ్ల పరువు తీస్తున్నాడు..!

అనంతపురం ఎంపీ జేసీ దివాకర్‌ రెడ్డిపై మండిపడ్డాడు వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ తాడిపత్రి నియోజకవర్గ ఇన్‌చార్జి కేతిరెడ్డి పెద్దారెడ్డి. మరి జేసీ ఫ్యామిలీతో ఆది నుంచి రాజకీయ వైరాన్ని కలిగిన కేతిరెడ్డి ఫ్యామిలీ తరపున ప్రత్యక్ష రాజకీయాల్లోకి వచ్చిన పెద్దారెడ్డి జేసీపై ఇలా ధ్వజమెత్తడం వరకూ రొటీనే కానీ ఇప్పుడు జేసీకి కొత్త ట్యాగ్‌ను తగిలించడానికి ప్రయత్నించడమే ఆసక్తికరంగా ఉంది.

అదేమనగా.. జేసీ దివాకర్‌ రెడ్డి తమ సామాజికవర్గానికి ద్రోహిగా మారాడనేది పెద్దారెడ్డి ఆరోపణ. రెడ్ల పరువును జేసీ తీస్తున్నాడని, రెడ్ల ఆత్మగౌరవాన్ని చంద్రబాబు వద్ద తాకట్టు పెడుతున్నాడని పెద్దారెడ్డి అంటున్నారు.

జేసీని రెడ్డి సామాజికవర్గ ద్రోహిగా అభివర్ణిస్తున్నాడు పెద్దారెడ్డి. గత కొంతకాలంలో దివాకర్‌ రెడ్డి తరచూ తనకులం పేరును ఉపయోగించుకున్న సంగతి తెలిసిందే. చంద్రబాబుకు రెడ్లంతా రుణపడి ఉండాలని దివాకర్‌ రెడ్డి చెప్పుకొచ్చాడు.

మరి జేసీకి ఎంపీ టికెట్టు, ఆయన తమ్ముడికి ఎమ్మెల్యే టికెట్‌ ఇచ్చినందుకే రెడ్లంతా చంద్రబాబుకు రుణపడి ఉండాలో ఏమోకానీ, ఒకసారి కాదు దివాకర్‌ రెడ్డి పైమాటనే రిపీట్‌ చేశాడు. 

సాధారణంగా రెడ్లు తెలుగుదేశం పార్టీకి ఓటు వేయరని.. అయితే వారు ఆ ధోరణిని మార్చుకోవాలని కూడా జేసీ ఉద్బోధించాడు. రెడ్లంతా చంద్రబాబును అభిమానించేస్తారని కూడా కొన్ని సభల్లో జేసీ అన్నాడు. ఆ మాటలకు చంద్రబాబు ముసిముసి నవ్వులు నవ్వాడు.

ఈ విధంగా తన రాజకీయం కోసం కులం పేరును దివాకర్‌ రెడ్డి ఉపయోగించుకోవడాన్ని ప్రభాకర్‌ రెడ్డి ఆక్షేపిస్తున్నాడు. దివాకర్‌ రెడ్డి తీరు మార్చుకోవాలని.. రెడ్డి సామాజికవర్గం ఆత్మగౌరవాన్ని చంద్రబాబుకు తాకట్టు పెట్టి తన రాజకీయ ప్రయోజనాలను కాపాడుకోవడాన్ని జేసీ ఆపాలని పెద్దారెడ్డి హెచ్చరించాడు.

మరి తాడిపత్రిలో దివాకర్‌ రెడ్డి వర్గంతో ఢీ కొట్టడానికి రంగంలోకి దిగిన పెద్దారెడ్డి జేసీపై అన్ని రకాలుగానూ పోరాటం మొదలుపెట్టినట్టున్నాడు. దివాకర్‌ రెడ్డి టీడీపీలోకి వెళ్లినా తాడిపత్రి నియోజకవర్గం, అనంత పార్లమెంటరీ నియోజకవర్గం పరిధిలో కొంత వరకూ రెడ్లు ఆయనను ఆదరించబట్టే విజయం సాధించగలిగారు.

ఒకవేళ రెడ్ల ఓట్లు దివాకర్‌ రెడ్డికి పడకపోయి ఉంటే కథ మరోరకంగా ఉండేది. కానీ గమనించాల్సిన విషయం ఏమిటంటే 2014కి ఇప్పటికీ పరిస్థితుల్లో చాలామార్పు వచ్చింది. ఇలాంటి సమయంలో.. జేసీని 'రెడ్ల ద్రోహి' అని పెద్దారెడ్డి అంటున్నాడు. మరి ఈ ప్రచారాన్ని జేసీలు ఎలా ఎదుర్కొంటారో!

Show comments