చంద్రబాబు నాయుడు 'తాను మారిన మనిషిని' అనే నినాదాన్ని ప్రస్తుత పాలన కాలానికి ప్రధాన నినాదంగా తీసుకున్నారు. గతంలో తొమ్మిదేళ్ల పాటు ఈ రాష్ట్రాన్ని పరిపాలించిన ఆయన అప్పట్లో కూడగట్టుకున్న ప్రజావ్యతిరేకత, అపప్రధ, ఉద్యోగ వర్గాల ఆగ్రహం అన్నిటినీ తోసిరాజనడానికి ఈ నినాదాన్ని ఎత్తుకున్నారు. అప్పట్లో తాను తీవ్రంగా వ్యతిరేకించిన కొన్ని విధానాలను ఈసారి అమల్లో పెట్టి ఓట్లు దండుకుని అధికారంలోకి వచ్చిన చంద్రబాబు... తాను మారడం అంటే కేవలం అదొక్కటే అనుకుంటున్నట్లుగా ఉంది.
ఈ రెండేళ్ల పదవీ కాలంలో ఆయన 'నేనిప్పుడు మారిన చంద్రబాబుని' అనే డైలాగును ఎన్ని సార్లు వల్లె వేసి ఉంటారో అందరికీ తెలుసు! అయితే చంద్రబాబు నాయుడు నిజంగానే మారారా? ఆయన తీసుకునే నిర్ణయాలు ఫైనలైజ్ అయిన తర్వాతనే బయటకు వస్తాయి గనుక.. వాటినిబట్టి ఆయన లోని మార్పును అంచనా వేయడం కష్టం. అందుకే నిర్ణయాల పరంగా కాకుండా బుద్ధి పరంగా ఆయన మారాడా లేదా అనేది ఇప్పుడు మిలియన్ డాలర్ ప్రశ్న. చంద్రబాబు నాయుడులో ఏమాత్రం మార్పు రాలేదని ఈ రెండేళ్లలోనే గతంలో అనేక దృష్టాంతాలు నిరూపించాయి.
తాజాగా రష్యా పర్యటన తర్వాత పెట్టిన ప్రెస్‌మీట్‌లో అది మరోసారి తెలిసి వచ్చింది. ఈ ప్రెస్‌మీట్‌లో మాట్లాడుతూ.. చంద్రబాబు.. రష్యాటూర్ సందర్భంగా తెలుగు మీడియాలో తన మీద వచ్చినకథనాల గురించి ఉడికిపోయారు. ఏ దేశంవెళ్తే అలాంటి రాజధాని కట్టిస్తానని మాటలు చెబుతున్నానంటూ వార్తలు రాశారని వాపోయారు. అంతర్జాతీయ స్థాయి రాజధాని కట్టడానికే ఇన్ని దేశాలు తిరిగి చూస్తున్నానని వెల్లడించారు. అదంతా సరే... ''మనదేశపు ఆర్కిటెక్టులతో కూర్చుంటే స్లమ్ సిటీ వస్తుంది. నేను ఆంధ్రప్రదేశ్‌కు రాజధానిగా ఒక స్లమ్ సిటీ ని అందించాలని అనుకోవడం లేదు.'' అని చంద్రబాబు అన్నారు.
అక్కడికేదో ఆయన అతిగొప్ప వ్యాఖ్య చేసినట్లుగా.. ప్రెస్‌మీట్ అనంతరం సీఎంఓ వారు విడుదలచేసిన ప్రకటనలో కూడా ఈ పాయింటును ప్రధానంగా పేర్కొన్నారు. అయితే ఇది చాలా దౌర్భాగ్యం కింద చెప్పుకోవాలి. ఒకవైపు మోడీ మేకిన్ ఇండియా అంటూ బీరాలు పోతోంటే... రాజధాని నిర్మాణానికి విదేశీ నిర్మాణసంస్థల కోసం దేబిరిస్తూ చంద్రబాబునాయుడు పరువు తీస్తుండడం ఒక ఎత్తు. స్వదేశీ నిపుణులు/ సంస్థలు అయితే తన ఆటలు సాగవని ఆయన ఆలోచన కావొచ్చు.
ఈ వక్ర ప్రయోజనాలకు ఆశపడి ఈ విదేశీదేవులాట సాగుతోందనేది పక్కన పెడదాం. కానీ స్వదేశీ నిపుణులను అవమానించేలా చంద్రబాబు మాట్లాడడం గర్హనీయం. అధికారం ఆయన్ది గనుక.. ఎవరితోనైనా కట్టించుకోవచ్చు. కానీ స్వదేశీ నిపుణులతో కట్టిస్తే స్లమ్ సిటీ మాత్రమే తయారవుతుందని వ్యాఖ్యానించడం .. చంద్రబాబులోని అలవిమాలిన దురహంకారానికి ప్రతీక. ఇందుకు ఆయన జాతికి క్షమాపణ చెప్పాలి. చంద్రబాబు లోని అహంకారం మారిందా లేదా అనడానికి ఇది మరో తార్కాణం మాత్రమే.
'ప్రపంచంలో ఎవరైనా ఎస్సీలుగా పుట్టాలని కోరుకుంటారా?' అనే వ్యాఖ్యలతో గతంలో చంద్రబాబు ఒక సామాజిక వర్గాన్ని ఎంతగా కించపరిచారో అందరికీ తెలుసు. అది అహంకారం కాక మరేమిటి? 'సేద్యం దండుగ' అన్న బుద్ధిలోని అహంకారంలో మీకు ఏమైనా మార్పు కనిపిస్తున్నదా? లేదు కదా!! ఆ అహంకారమే ఇప్పుడు స్వదేశీ ఇంజినీర్లను, నిపుణుల్ని అవమానించే మాట అనిపిస్తోంది. విదేశీ కంపెనీలకు మొత్తం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని తాకట్టు పెట్టినంత మాత్రాన.. మన స్వదేశీ ఇంజినీర్లు, నిపుణులు, నిర్మాణ సంస్థల మీద ఆధారపడకుండా... వారే పనులు చేస్తారని చెప్పగల దమ్ము అసలు చంద్రబాబునాయుడుకు ఉందా అనేది జనంలో మెదలుతున్న ప్రశ్న.
స్వదేశీ నిపుణులు ఆర్కిటెక్టులు ఒక బిల్డింగు కట్టగలరే తప్ప.. ఒక నగరాన్ని కట్టలేరుట. వారికి చేతకాదుట. వారి అసమర్థతలకు సంబంధించిన ఆ విషయాన్ని చంద్రబాబు గారే కనుగొన్నారు మరి! తాను ఏదేశానికి వెళ్లినా సరే.. అక్కడి వారి మోచేతి నీళ్లు తాగడానికి వచ్చానన్నట్లుగా దేబిరించే అలవాట్లను చంద్రబాబునాయుడు మానుకోవాలి. మన తెలుగుజాతికి కూడా ఒక ఆత్మగౌరవం ఉంటుందని, దాన్ని కాపాడడం రాష్ట్ర ముఖ్యమంత్రిగా తన బాధ్యత అని తెలుసుకోవాలి. మన స్వదేశీ నైపుణ్యాలు ఎంత ఉత్తమమైనవి అనే విషయంలో ఆయనకు అజ్ఞానం ఉండొచ్చు.. అంటే ఆయనకు తెలియకపోవచ్చు. అంతమాత్రాన వారు కడితే.. 'స్లమ్ సిటీ' ఏర్పడుతుందంటూ.. భావదారిద్య్రాన్ని ప్రకటించడం నాయకుడి లక్షణం కాదు.