శశికళ ఆక్రమణ.. చాలా వేగంగా!

అంత్యక్రియలు ముగిసిన తర్వాత శశికళ నేరుగా పోస్ గార్డెన్ కే వెళ్లింది…. ఈ మాట చాలు, జయ స్థానాన్ని ఆక్రమించడానికి శశికళ ఎంత వేగంగా అడుగులు వేస్తోందో అర్థం చేసుకోవడానికి. ఇప్పుడు శశికళను ఆపే శక్తి ఏదీలేదు. జయ అధికారిక నివాసాన్ని ఆక్రమించిన ఈమెను ఆపేవారు ఎవ్వరూ లేరు! 

కేవలం అధికారిక నివాసాన్నే కాదు.. జయలలిత ప్రాతినిధ్యం వహించిన నియోజకవర్గాన్ని కూడా ఆక్రమించడానికి చాలా వేగంగా పావులు కదుపుతోందట శశి. జయలలిత ఆర్కే నగర్ నుంచి ప్రాతినిధ్యం వహించిన సంగతి తెలిసిందే. ఒక దశలో ఎమ్మెల్యే పదవిని కూడా కోల్పోయిన జయ, ఆర్కే నగర్ నుంచి ఉప ఎన్నికల్లో పోటీ చేసి విజయం సాధించింది.

ఇప్పుడు ఆమె మరణంతో ఆ నియోజకవర్గానికి ఉప ఎన్నిక అనివార్యం అయ్యింది. అయితే.. అది ఇప్పుడప్పుడే కాదు.. ఆరు నెలల్లో ఎప్పుడైనా జరగొచ్చు. కానీ, శశిమాత్రం అప్పుడే దాని మీద దృష్టి నిలిపిందట. అక్కడ నుంచి తనే పోటీ చేయాలని భావిస్తోందట.

శశి ఈ విధంగా ప్రత్యక్ష రాజకీయం మొదలుపెడితే.. అన్నాడీఎంకే లో ఆధిపత్య పోరు తీవ్ర స్థాయికి చేరినట్టే. ఇప్పుడు కాదు.. జయ ఆసుపత్రి పాలైన తర్వాత జరిగిన మూడు అసెంబ్లీ నియోజకవర్గాల ఉప ఎన్నికల్లోనే ఏదో ఒక దాని నుంచి పోటీ చేయాలని శశి ప్రయత్నాలు సాగించింది. తను ఎమ్మెల్యే అయిపోతే.. జయ ఆసుపత్రి నుంచి తిరిగి రాకపోతే.. అన్నట్టుగా శశి ఆలోచనలు సాగాయని అంటారు.

అయితే అప్పట్లో అది సాధ్యం కాలేదు. ఇప్పుడు మాత్రం శశికి తిరుగులేకపోవచ్చు. జయ ప్రాతినిధ్యం వహించిన నియోజకవర్గం నుంచి పోటీ చేయవచ్చు. అయితే అన్నాడీఎంకేలో చీలికకు శశికళ బీజాలు ఇప్పటికే వేసింది. ఇక  ఆమె ప్రత్యక్ష ఎన్నికల పోరాటానికి వస్తాను.. ఎమ్మెల్యే హోదాతో ముఖ్యమంత్రి అయ్యే ప్రయత్నం చేస్తాను అంటే మాత్రం… రెండాకుల గుర్తు పార్టీ రెండు గా చీలడం ఖాయం. 

అన్నాడీఎంకేలో శశి ఆధిపత్యాన్ని వ్యతిరేకిస్తున్న ఎమ్మెల్యేల సంఖ్య యాభై వరకూ ఉంటుందని తమిళ రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు. 136 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు ఈ పార్టీకి. వీరిలో యాభై మంది శశిపై పూర్తి విముఖతతో ఉన్నారట. అలాగని వీళ్లంతా పూర్తిగా పన్నీరు సెల్వం పక్షం కూడా కాదు. మిగిలిన 86 మంది ఎమ్మెల్యేల్లో కూడా భిన్నాభిప్రాయాలు, పలు గ్రూపులు ఏర్పాడే అవకాశం ఉంది.

ఇన్ని రోజులూ జయలలిత ముందు సాష్టాంగ పడుతూ.. చాలా పరిమితుల మేరకు, కనీసం తమ అభిప్రాయాలను గట్టిగా వినిపించడానికి వెనుకాడిన వారికి ఇప్పుడు ఒక రకంగా స్వతంత్రం కూడా వచ్చింది. ఇదే ఇప్పుడు రాజకీయాన్ని రసవత్తరంగా మారుస్తోంది. 

Show comments