అవినీతిని బయటపెట్టినందుకు అరెస్టా?

జ్యూడిష్ రాజు అనే వ్యక్తిని పోలీసులు అరెస్టు చేసినట్లుగా వార్తలు వస్తున్నాయి. ఇంతకూ ఎవరీ జ్యూడిష్ రాజు? ‘ఆ అధికారిణి అంటే మీడియాకు భయమా’ అంటూ గ్రేటాంధ్ర శుక్రవారం నాడు ఒ:క ప్రత్యేక కథనాన్ని అందించిది. ఏపీలో వైద్య ఆరోగ్య శాఖలో జరిగిన అరాచకాల్ని అక్రమాల్ని అవినీతి బాగోతాల్ని ఆధారాలతో సహా ఒక వ్యక్తి ప్రెస్ మీట్ పెట్టి మరీ చెప్పారని, కాకపోతే ఆ వార్తలు ప్రముఖంగా రాకుండా మీడియాను మేనేజి చేశారని వచ్చిన పుకార్లకు సంబంధించిన వార్త అది.

సదరు జూడిష్ రాజు.. పత్రికల్లో  కవరేజీ రాకపోయే సరికి ముఖ్యమంత్రికి కూడా ఫిర్యాదు చేశాడు. చీఫ్ సెక్రటరీకి కూడా ఫిర్యాదు చేయడం జరిగింది. అయితే తాజా ట్విస్టు ఏంటంటే.. ఆయన తమ సంస్థలో ఉద్యోగిగా ఉంటూ.. సంస్థ వ్యవహారాలను డాక్యుమెంట్లను బయట పెట్టాడంటూ జూడిష్ రాజు మీద విశాఖలోని మెడ్ టెక్ సంస్థ ప్రతినిధులు కేసు పెట్టారు. దీనిని పురస్కరించుకుని ఆయనను అరెస్టు చేసినట్లుగా వార్తలు  వస్తున్నాయి. 

వివరాలను ఓ సారి గుర్తు చేసుకుంటే.. వైద్య ఆరోగ్య శాఖలో విపరీతమైన అవినీతి అక్రమాలు జరుగుతున్నాయనేది ఆరోపణ. విశాఖలో ఏర్పాటు చేయదలచుకున్న మెడ్ టెక్ పార్కుకు సంబంధించి 500 కోట్ల రూపాయలుగా ఉన్న అంచనాలను దాదాపు 2000 కోట్ల రూపాయలకు పెంచేశారని దీని వెనుక ఆ శాఖకు చెందిన రాజకీయ, అధికార ప్రముఖులు ఉన్నారని జూడిష్ రాజు ఆరోపించారు. ఆయన నేరుగా మంత్రి కామినేని శ్రీనివాస్, ఉన్నతాధికారి పూనం మాలకొండయ్య  మీదే విమర్శలు చేశారు. 

అయితే ఇప్పుడు.. చేసిన అవినీతి ఆరోపణలు, అందులో నిజానిజాలను నిగ్గు తేల్చే పని.. ఇదంతా ఎవరూ పట్టించుకోవడం  లేదు. జూడిష్ రాజు గతంలో మెడ్ టెక్ లో ఉంటూ పక్కకు తప్పుకున్నాడు గనుక.. సంస్థ డాక్యుమెంట్లను బయటపెట్టారంటూ కేసు పెట్టారు. ఆయన ఎంచక్కా భారీ స్థాయి అవినీతి బాగోతాన్ని బయటపెడితే.. దానికి సమాధానం చెప్పి చంద్రబాబు సర్కారు తమ చిత్తశుద్ధిని నిరూపించుకోవాల్సింది బదులుగా ఆయన మీదనే కేసులు నమోదు చేసి.. జైలు పాల్జేయడం చిత్రంగా కనిపిస్తోంది.

అయితే జూడిష్ రాజు విచారణ సందర్భంగానైనా.. ఆయన వైద్య ఆరోగ్య శాఖ అరాచకాల మీద చేసిన అన్ని ఆరోపణలు న్యాయపీఠం దృష్టికి వచ్చే అవకాశం ఉంది. చంద్రబాబు ప్రభుత్వం ఇప్పుడు పట్టించుకోకపోయినా.. అప్పుడైనా సరే.. ఆ  అరాచకాల మీద విచారణ తప్పదని, అవినీతికి పాల్పడిన వారు బయటకు రాక తప్పదని పలువురు అనుకుంటున్నారు.

Show comments