రెడ్డిగారి పాట్లు.. టీడీపీని గట్టెక్కిస్తాయా.?

'ఓటుకు నోటు' కేసులో ప్రధాన నిందితుడు రేవంత్‌రెడ్డి, తెలుగుదేశం పార్టీకి వర్కింగ్‌ ప్రెసిడెంట్‌.. పేరుకి తెలంగాణ టీడీపీ అధ్యక్షుడు ఎల్‌.రమణే అయినా, మొత్తంగా పార్టీ బాధ్యతల్ని తెలంగాణలో తన భుజాన వేసుకున్నది మాత్రం రేవంత్‌రెడ్డేనని ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు కదా. రేవంత్‌రెడ్డి, ఎంత గింజుకుంటున్నా తెలంగాణలో టీడీపీ పరిస్థితి ఏమాత్రం మెరుగుపడ్డంలేదాయె.! 

'ఏం, సోనియాగాంధీ తెలంగాణలో వుండి కాంగ్రెస్‌ పార్టీని నడిపిస్తున్నారా.? నరేంద్రమోడీ తెలంగాణకు వచ్చి బీజేపీని నడిపిస్తున్నారా.? చంద్రబాబే ఎందుకు తెలంగాణలో వుండి పార్టీని నడిపించాలి.? ఆయన ఆంధ్రప్రదేశ్‌లో వున్నా, ఇంకెక్కడున్నా తెలంగాణలో పార్టీని బలోపేతం చేయొచ్చు.. చేస్తున్నారు కూడా..' అని రేవంత్‌రెడ్డి చెబుతున్నారుగానీ, జాతీయ పార్టీలతో పోల్చితే టీడీపీకి వున్న ఇబ్బందులు చాలానే. మరీ ముఖ్యంగా తెలంగాణలో టీడీపీకి, కొన్ని ప్రత్యేకమైన సమస్యలున్నాయి.. అదీ చంద్రబాబు కారణంగా. 

ఉమ్మడి తెలుగు రాష్ట్రంలో చంద్రబాబుని 'తెలంగాణ వ్యతిరేకి'గా చిత్రీకరించేసింది టీఆర్‌ఎస్‌. ఆ ప్రింట్‌ అలా వుండిపోయిందంతే. అది ఇప్పట్లో చెరిగిపోయే అవకాశమే కన్పించడంలేదు. పైగా, చంద్రబాబు ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి అయ్యాక, నీటి పంపకాలు, విద్యుత్‌ పంపకాలు వంటి విషయాల్లో వ్యవహరించిన తీరు తెలంగాణలో ఆయనపై వ్యతిరేకతను మరింత పెంచేశాయి. అలాగని, ఆంధ్రప్రదేశ్‌ ప్రయోజనాల్ని చంద్రబాబు కాపాడుతున్నారా.? అంటే అదీ లేదు. రెంటికీ చెడ్డ రేవడిలా తయారైంది చంద్రబాబు పరిస్థితి. 

ఆంధ్రప్రదేశ్‌లో అదృష్టవశాత్తూ బీజేపీ, జనసేన మద్దతుతో టీడీపీ అధికారంలోకి వచ్చింది కాబట్టి సరిపోయిందిగానీ, లేదంటే తెలంగాణలోకన్నా దారుణంగా ఆంధ్రప్రదేశ్‌లో వుండేది టీడీపీ పరిస్థితి. ఇక, తెలంగాణలో రైతులకు మద్దతుగా యాత్రలు చేపడ్తున్న తెలంగాణ టీడీపీ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ రేవంత్‌రెడ్డి, 'ఏం, రైతుల రుణమాఫీని ఒకేసారి చేయలేరా.?' అంటూ తెలంగాణ ప్రభుత్వాన్ని ప్రశ్నించేస్తున్నారు. మీ చంద్రబాబు ఏం చేస్తున్నాడయ్యా.? అంటే, రేవంత్‌రెడ్డి నుంచి నో ఆన్సర్‌. ఇది మచ్చుకి ఓ ఉదాహరణ మాత్రమే. ఇలాంటి చిన్న చిన్న లాజిక్కులకి రేవంత్‌రెడ్డితోపాటు తెలంగాణ టీడీపీ నేతలంతా అడ్డంగా దొరికేస్తున్నారు. 

చంద్రబాబు, ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి గనుక.. తెలంగాణలో పార్టీని పూర్తిగా పట్టించుకోలేకపోవచ్చుగాక. మరి, చంద్రబాబు తనయుడు లోకేష్‌ ఏం చేస్తున్నట్టు.? ఆయనెందుకు తెలంగాణ టీడీపీ నేతలతో కలిసి తెలంగాణలో పర్యటనలు చేయడం, ప్రభుత్వ వ్యతిరేక ఆందోళనలో పాల్గొనడం వంటివి చేయడంలేదట.? మేటర్‌ క్లియర్‌.. చంద్రబాబునైనా, లోకేష్‌నైనా తెలంగాణలో ఎవరూ లెక్క చేయని పరిస్థితి. పైగా, వారి ప్రెజెన్స్‌ టీడీపీకి మరింత చేటు తెచ్చిపడ్తుంది. అద్గదీ అసలు విషయం. 

పోనీ, రేవంత్‌రెడ్డి పడ్తున్న పాట్లు అయినా తెలంగాణలో టీడీపీని గట్టెక్కిస్తాయా.? అంటే, ఆ పరిస్థితులే కన్పించడంలేదాయె.! 

Show comments