చంద్రబాబు అలా.. కేసీఆర్‌ ఇలా..

వాళ్ళిద్దరూ ఒకప్పుడు ఒకే పార్టీలో వున్నారు.. అప్పట్లో అత్యంత సన్నిహితులు కూడా. ఎక్కడో తేడా కొట్టింది, ఇద్దరూ విడిపోయారు. అనేకానేక రాజకీయ పరిణామాల తర్వాత, ఇద్దరూ ఇప్పుడు ముఖ్యమంత్రులయ్యారు. ఉమ్మడి తెలుగు రాష్ట్రం విభజనతో ఆంధ్రప్రదేశ్‌కి ఒకరు, తెలంగాణకి ఇంకొకరు ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించారు. అప్పుడప్పుడూ 'పాత స్నేహం' చిగురిస్తుంటుంది.. వీలైనప్పుడల్లా 'రాజకీయ వైరం' ఇద్దరి మధ్యా భగ్గుమంటుంది. 

'నీ ప్రభుత్వం అంతు చూస్తా..' అంటూ ఆ మధ్య ఓటుకు నోటు కేసు సమయంలో, కేసీఆర్‌పై చంద్రబాబు విరుచుకుపడిపోయారు. 'నిన్ను బ్రహ్మదేవుడు కూడా కాపాడలేడు..' అంటూ చంద్రబాబుకి అల్టిమేటం ఇచ్చారు కేసీఆర్‌. అవన్నీ ఉత్తుత్తి మాటలే. మధ్యలో జనమే వెర్రి వెంగళప్పలు. ఓటుకు నోటు కేసు ఏమయ్యిందో ఏమో.. ఆ పైవాడికే ఎరుక.! 

ఇదిగో, ఇప్పుడు మళ్ళీ కేసీఆర్‌ - చంద్రబాబుపై దుమ్మెత్తి పోసేశారు. 'ముందు నీ రాష్ట్రంలో పరిపాలన చక్కబెట్టుకో.. అక్కడి ప్రజల్ని మోసం చేసిన నువ్వు.. తెలంగాణలో ఏం చేయగలవ్‌.?' అని మండిపడిపోయారు కేసీఆర్‌. దానికి, ఏపీ టీడీపీ నేతల నుంచి ఘాటుగా కౌంటర్‌ వస్తుందనుకోండి.. అది వేరే విషయం.

మరి, చంద్రబాబు మాటేమిటి.? కేసీఆర్‌కి కౌంటర్‌ ఇచ్చేందుకు చంద్రబాబు సాహసిస్తారా.? ఏమో మరి, మొన్నీమధ్యన తెలంగాణలో జరిగిన టీడీపీ మహానాడులో చంద్రబాబు ఆచి తూచి వ్యవహరించారు. కేసీఆర్‌ని విమర్శించేందుకు ఆయన ఆసక్తి చూపలేదు. దాంతో తెలంగాణ టీడీపీ శ్రేణులు డీలాపడిపోయాయి. 

ఒక్కటి మాత్రం నిజం. తెలంగాణలో టీడీపీ పరిస్థితి అత్యంత అధ్వాన్నంగా తయారైంది. రాజకీయాల్లో పరిస్థితులు ఎప్పుడూ ఒకేలా వుంటాయని అనుకోలేం. కానీ, ఏ దశలోనూ తెలంగాణలో పార్టీకి ఊతమిచ్చేందుకు చంద్రబాబు ప్రయత్నించడంలేదు. ఒక్క మాటలో చెప్పాలంటే, తెలంగాణలో పార్టీని గాలికొదిలేశారాయన. అయినాసరే, ఎక్కడో ఏదో మూల చిన్న ఆశ.. అద్భుతం జరగాలని ఆయన ఆశిస్తున్నారు. ఆశిస్తే సరిపోద్దా.? పనిచెయ్యాలి కదా.! 

ఏది ఏమైనా, తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రుల మధ్య 'గిల్లికజ్జాలు' అందర్నీ విస్మయానికి గురిచేస్తున్నాయి. తెలంగాణలో టీడీపీని మటుమాయం చేయాలనే కేసీఆర్‌ వ్యూహాలు వర్కవుట్‌ అయ్యాయి. సెంటిమెంట్‌ రగల్చాలంటే చంద్రబాబుని విమర్శించాల్సిందేనన్న సెంటిమెంట్‌ బాణాన్ని కేసీఆర్‌ ఇంకెన్నాళ్ళు ఇలాగే ప్రయోగిస్తుంటారో వేచి చూడాల్సిందే.

Show comments