సూది కోసం సోదికెళ్తున్న రేవంత్ రెడ్డి!

సూది కోసం సోదికెళ్తే పాత రంకు అంతా బయట పడిందట.. ఈ జాగ్రత్త చెప్పాలి రేవంత్ రెడ్డికి. ఎంత కోర్టుల్లో తెలుగుదేశం పార్టీకి అనుకూలమైన తీర్పులు, చంద్రబాబును ఆదుకునే తీర్పులూ రావడం ఆనవాయితీ అయినా.. కొంత జాగ్రత్తగా ఉండటం మంచిది! అటు తిరిగి ఇటు తిరిగి.. ఈ వ్యవహారం తెలుగుదేశం అధినేత చంద్రబాబు ను ఇబ్బంది పెట్టే అవకాశాలున్నాయి మరి!

ఇంతకీ విషయం ఏమిటంటే.. తమ పార్టీ లెజిస్ట్లేటివ్ విభాగాన్ని తెలంగాణ రాష్ట్ర సమితిలోకి విలీనం చేస్తూ తెలంగాణ శానస వ్యవస్థ ఇచ్చిన ఆదేశాలపై ఈయన న్యాయస్థానాన్ని ఆశ్రయిస్తున్నాడట. ఇది అన్యాయం అని.. తమ పార్టీని  లెజిస్ట్లేటివ్ విభాగాన్ని తెరాసలోకి విలీనం చేయడం ఏమిటి? ఇలాంటి నిర్ణయాన్ని ఎలా వెలువరిస్తారు? ఫిరాయింపు దారుల విషయంలో తాము ముందే ఇచ్చిన ఫిర్యాదులను పట్టించుకోకుండా.. అదే ఫిరాయింపు దారులు ఇచ్చిన విలీన లేఖలను మాత్రం ఎలా యాక్సెప్ట్ చేస్తారు? అని రేవంత్ రెడ్డి ప్రశ్నిస్తున్నాడు. ఈ విషయంపై తేల్చమని న్యాయస్థానాన్ని రేవంత్ రెడ్డి గట్టిగా అడుగుతున్నాడు!

మరి ఇదంతా బాగానే ఉంది. పార్టీ ఫిరాయించిన వారిపై తెలుగుదేశం పార్టీ ఇచ్చిన ఫిర్యాదును పరిష్కరించకుండా.. సదరు ఫిరాయింపుదారులపై అనర్హత వేటు వేయకుండా.. ఆ పిటిషన్ల ను పెండింగ్ లో పెట్టి.. ఆ తర్వాత మరికొన్ని ఫిరాయింపులు జరిగిన తర్వాత లెజిస్ట్లేటివ్ విభాగాన్ని మొత్తం తెరాసలో విలీనం చేయడం అనైతికమే.  ఈ విషయంలో తెలంగాణ శాసన వ్యవస్థ వైఖరి ప్రజాస్వామ్యాన్ని వెక్కిరిస్తున్నట్టుగానే ఉంది.

అసలే.. తెలంగాణ ప్రభుత్వ నిర్ణయాలకు కోర్టుల వద్ద వరసగా ఎదురుదెబ్బలు తగులుతున్నాయి. ఇలాంటి నేపథ్యంలో ఈ వ్యవహారంలో కూడా తెరాసకు షాక్ తగిలినా తగలొచ్చు! ఈ విషయంలో తెలంగాణ ప్రభుత్వాన్ని, శాసనసభ, శాసనమండలిని.. న్యాయస్థానం కడిగేయవచ్చు! అది జరిగితే మంచిదే కానీ.. అది జరిగినా అది తెలంగాణ వరకూ మాత్రమే తెలుగుదేశానికి ఊరటనిస్తుంది. 

ఒకవేళ తెలంగాణ ఫిరాయింపుల పట్ల కోర్టు అభ్యంతరాలు చెప్పి.. కేసీఆర్ ను అదరొట్టేసిందనే అనుకుందాం! అదే జరిగితే.. ఏపీలోని ప్రతిపక్షం కూడా అదే కోర్టును సంప్రదించవచ్చు. పక్క రాష్టంలో ఫిరాయింపుల విషయంలో స్పీకర్, శాసనమండలి చైర్మన్ ల వైఖరిని కోర్టు కడిగేస్తే.. కోడెల వారి వైపు కూడా ఒక సారి చూడాలని వైకాపా కోర్టును అడిగే అవకాశం ఉంది. తప్పని సరి పరిస్థితుల్లో.. ఏపీ వ్యవహారం పట్ల కోర్టు స్పందించాల్సి వస్తుందప్పుడు. మరి అదే జరిగితే..  టీడీపీ వెంటిలేటర్ మీద ఉన్న తెలంగాణలో దక్కే ఆనందం కంటే.. ఏపీలో ఫిరాయింపుదారుల తరపున ఎన్నికలను ఎదుర్కొనాల్సి వస్తే కలిగే బాధ ఎక్కువగా ఉంటుంది.

కోర్టుల వద్ద బాబుగారికి ఇబ్బంది కలిగే అవకాశాలు తక్కువే ఉన్నా.. తెలంగాణ వ్యవహారంపై న్యాయస్థానం ఆగ్రహం వ్యక్తం చేస్తేమాత్రం ఏపీ వ్యవహారం కూడా చర్చకు రాకుండా పోదు. అప్పుడు సూది కోసం సోది కెళితే పాత రంకంతా బయటపడినట్టుగా అవుతుంది తెలుగుదేశం పార్టీ పరిస్థితి. ఏపీ ఫిరాయింపుల విషయంలో సేఫ్ జోన్లో ఉండాలంటే.. తెలంగాణలో పార్టీని పణంగా పెట్టడమే పరిష్కారం! 

Show comments