నల్లధనం.. సామాన్యులకిచ్చేస్తారా.?

'ఎవరైనా మీ అక్కౌంట్‌లో వారి నల్లధనాన్ని వేశారనుకోండి.. దాన్ని మీరు టచ్‌ చేయొద్దు.. దాని గురించి అడిగితే, స్పందించొద్దు.. నా పేరు చెప్పండి ఆ నల్ల కుబేరులకి.. వాళ్ళని జైలుకు పంపి, ఆ డబ్బు మీకు వచ్చే మార్గాన్ని నేను ఆలోచిస్తాను..' అంటూ ప్రధాని నరేంద్రమోడీ సంచలన వ్యాఖ్యలు చేశారు. 

ఉత్తరప్రదేశ్‌లోని మొరాదాబాద్‌లో నరేంద్రమోడీ చేసిన ఈ వ్యాఖ్యలు దేశవ్యాప్తంగా కలకలం రేపుతున్నాయి. ఓ పక్క, జన్‌ధన్‌ ఖాతాల్లోకి పెద్దయెత్తున నల్లధనం తరలి వెళ్ళిందంటూ ప్రభుత్వమే అధికారిక లెక్కలు వెల్లడిస్తోన్న వేళ, ప్రధాని వ్యాఖ్యలు కలకలం రేపకుండా వుంటాయి.? 

గతంలో బీజేపీ, నల్లధనాన్ని వెలికి తీసి, 15 లక్షలు ప్రతి భారతీయుడి బ్యాంక్‌ అకౌంట్‌లో వేస్తామని ప్రకటించింది. 'నల్లధనాన్ని వెలికి తీస్తాం.. దేశాన్ని ఉద్ధరిస్తాం..' అంటూ బీజేపీ గతంలో చేసిన ఎన్నికల హామీని నిజం చేయడానికే, ఇప్పుడిలా పెద్ద నోట్ల రద్దు నిర్ణయమని ఆ పార్టీ నేతలు చెబుతున్నా, 15 లక్షలు - ప్రతి అకౌంట్‌లో అనే విషయాన్ని మాత్రం పక్కన పెట్టేశారు. కానీ, ఇప్పుడు నరేంద్రమోడీ వ్యాఖ్యలతో బీజేపీ నేతలు కూడా అవాక్కవ్వాల్సి వస్తోంది. 

నిజమేనా.? నల్లధనాన్ని ప్రజలకు పంచే వీలుంటుందా.? అన్నది ప్రస్తుతానికి మిలియన్‌ డాలర్ల ప్రశ్నే. పెద్దోళ్ళ డబ్బు కాజెయ్యాలని ఏ పేదోడూ అనుకోడు.. అలా అనుకుంటే, అసలు భారతదేశంలో 'పేద' అనేవాడే కన్పించడు. పెద్దోళ్ళ డబ్బు సంగతి దేవుడెరుగు, ముందు తమ కష్టార్జితం తమ చేతుల్లోకి వస్తే చాలని, దేశ ప్రజానీకం కోరుకుంటోంది. పెద్ద నోట్ల రద్దు తర్వాత కష్టాలు సామాన్యుడ్ని పీల్చి పిప్పి చేసేస్తున్నాయి. 25 రోజులవుతున్నా, చేతికి తమ కష్టార్జితం దక్కని దుస్థితి. 

మొత్తమ్మీద, నరేంద్రమోడీ ఎన్నికల స్టంట్‌ మొదలుపెట్టారనుకోవచ్చు.. నల్లధనాన్ని పేదల ఖాతాల్లోకి వెళ్ళేలా చేస్తానని చెప్పడం ద్వారా.

Show comments