శశి ఆధిపత్యంపై కేంద్రం మరో దెబ్బ?

ఒకవైపు దివంగత ముఖ్యమంత్రి జయలలితకు బాగా దగ్గరి వాళ్లు అనిపించుకున్నవారిపై ఐటీ రైడ్స్, మరోవైపు పన్నీరు సెల్వానికి అంతర్గతంగా బీజేపీ వారి భరోసా.. అయినప్పటికీ శశికళ ఏమీ తగ్గట్లేదు. ఆమె అన్నాడీఎంకే అధినేత్రిగా పగ్గాలందుకోవాలని బహిరంగంగానే కొంతమంది నేతలు డిమాండ్ చేస్తుండగా, మరికొందరు ఆమె సీఎం పదవిని కూడా చేపట్టాలని డిమాండ్ చేస్తున్నారు.

అన్నాడీఎంకేలో శశికళ సమ్మోహనాస్త్రం బాగానే పని చేస్తోంది. ఈ నేపథ్యంలో ఆమె పార్టీ పగ్గాలు చేపట్టడం దాదాపు ఖాయమే అయ్యింది. ఇక ముఖ్యమంత్రిగా పన్నీరును ఎంత సేపు ప్రశాంతంగా ఉండనిస్తుంది? అనేది ఆసక్తిదాయకమైన అంశం.

ఇదిలా ఉంటే.. తాజాగా శశికళ ఆధిపత్యంపై మరో దెబ్బనే వేశారు గవర్నర్. ఇటీవల తమిళనాడులోని వర్సిటీల వీసీలందరూ శశికళతో సమావేశం అయిన సంగతి తెలిసిందే. దీనిపై ప్రతిపక్ష డీఎంకే అభ్యంతరం చెప్పింది. శశికళ ఒక రాజ్యాంగేతర శక్తి.. ఆమె ఏ హోదాలో ఉంది? ఆమె ఏహోదాలో ఉందని వీసీలంతా వెళ్లి ఆమె దర్శనం చేసుకున్నారు? అని డీఎంకే నేత స్టాలిన్ ప్రశ్నించాడు.

దీనిపై గవర్నర్ కు ఫిర్యాదు కూడా చేశాడు. మామూలుగా అయితే గవర్నర్ ఈ అంశాన్ని లైట్ తీసుకునే వాళ్లేనేమో! ఇప్పుడు వీసీలకు గవర్నర్ నోటీసులు జారీ చేయడం ఆసక్తికరంగా మారింది. శశికళను ఎందుకు కలిశారో వివరణ ఇచ్చుకోవాలని గవర్నర్ వీసీలను అడుగుతున్నారు. మరి ఇది చిన్న విషయమే అయినా.. నోటీసుల వరకూ వెళ్లడం రాజకీయ పరిస్థితికి దర్పణంగా మారింది.

Readmore!

శశికళ ఏమీ రాష్ట్రానికి సుప్రిమో కాదు, ఆమెను అతిగా గౌరవిస్తే సహించేది లేదు.. అని ప్రభుత్వాధికారులకు సూఛాయగా చెప్పడానికి, ఆమెపై భక్తి కనబరిస్తే వివరణలు ఇచ్చుకోవాల్సి ఉంటుందని అందరికీ స్పష్టం చేయడానికే వీసీలకు గవర్నర్ నుంచి నోటీసులు జారీ అయ్యాయనే మాట వినిపిస్తోంది. ఈ విధంగా శశికళ ఆధిపత్యానికి చెక్ చెప్పే యత్నాలు మొదలయ్యాయని విశ్లేషకులు అంటున్నారు.

Show comments