వెంకయ్య మేస్టారి ప్రత్యేక పాఠాలు


'నేను ఈ రాష్ట్రం నుంచి ప్రాతినిథ్యం వహించడంలేదు.. భవిష్యత్తులోనూ ఈ రాష్ట్రం నుంచి పోటీ చేయను, ప్రాతినిథ్యం వహించను..' అంటూ కేంద్ర మంత్రి, బీజేపీ సీనియర్‌ నేత వెంకయ్యనాయుడు, తన ఆత్మగౌరవాన్ని తానే దిగజార్చుకుంటున్నారు. ఆంధ్రప్రదేశ్‌లో పుట్టి, జన్మభూమితో తనకు సంబంధం లేదన్నట్లుగా ఆయన వ్యవహరిస్తుండడాన్ని ఏమనుకోవాలి.? 'అయినాసరే.. ఆంధ్రప్రదేశ్‌ కోసం పరితపిస్తున్నాను..' అని వెంకయ్య కలరింగ్‌ ఇస్తూనే వున్నారనుకోండి.. అది వేరే విషయం. 

సంబంధం లేనప్పుడు, ఆంధ్రప్రదేశ్‌ ప్రజల్ని ఒప్పించడమెందుకు.? ప్రత్యేక ప్యాకేజీపై రాష్ట్ర ప్రజానీకానికి క్లాసులు పీకడమెందుకు. వెంకయ్య చెబుతున్నారు తప్ప, ప్యాకేజీ పేరుతో డబ్బులు ఇవ్వాల్సిన కేంద్ర ఆర్థిక అరుణ్‌ జైట్లీ, ఎక్కడా 'ప్యాకేజీ' అన్న పదాన్ని ప్రస్తావించడంలేదు. 'ప్రత్యేక సహాయం..' అని మాత్రమే కేంద్రం ఇప్పటిదాకా చెబుతూ వస్తోంది. దీనికి చట్టబద్ధత ఏంటి.? అన్న ప్రశ్నకు వెంకయ్యదగ్గరే సమాధానం లేని పరిస్థితి. 

చట్టబద్ధత కల్పించాక, 'ఇదిగో ఇది చేస్తున్నాం..' అని కేంద్రం చెప్పుకోడానికి వీలుంటుంది. ప్రత్యేక హోదా పేరుతో రాష్ట్ర ప్రజానీకాన్ని మోసం చేసిందెవరయ్యా.? అంటే, నూటికి నూరుపాళ్ళూ వెంకయ్యనాయుడి పేరే చెప్పాలి. కానీ, ఆయనే ఇప్పుడు ప్రత్యేక హోదా లేదు, ప్యాకేజీతో సరిపెట్టుకోమంటున్నారు. కొన్నాళ్ళు పోయాక, ప్యాకేజీ కాదు.. సహాయం మాత్రమే అని వెంకయ్య తెలుసుకుని, మళ్ళీ అప్పుడు ఇంకోలా మాట్లాడతారు. ఆ తర్వాత అదేమీ లేదని చేతులెత్తేసినా ఆశ్చర్యపోనక్కర్లేదు. 

ఇంతకీ, వెంకయ్య ఎందుకు ఇంతలా తాపత్రయపడ్తున్నట్లు.? హోదా లేదు, ప్యాకేజీ లేదు, ప్రత్యేక సాయం పేరుతో వెంకయ్య, రాష్ట్ర ప్రజల్ని ఎడ్యుకేట్‌ చేయడానికి కాళ్ళకు చక్రాలు కట్టుకుని ఎందుకు తిరుగుతున్నట్లు.? అంటే, దీనికీ ఓ లాజిక్‌ వుంది. ప్రత్యేక హోదా జపం చేసిన వెంకయ్యను పట్టుకునే, నరేంద్రమోడీ ఆంధ్రప్రదేశ్‌లో ఎన్నికల ప్రచారం చేశారు. ఎన్నికల్లో అంచనాల్ని మించి, సీట్లు రాబట్టుకున్నారు. ఇప్పుడూ అదే వెంకయ్యని ముందుపెట్టి ప్యాకేజీ పేరుతో నరేంద్రమోడీ ఇంకోసారి రాష్ట్ర ప్రజల్ని వంచించనున్నారన్నమాట. అందుకే, ముందుగా వెంకయ్యని రంగంలోకి దించారు. 

'ఇదిగో ప్యాకేజీ..' అని వెంకయ్య ధీమాగా చెబుతోంటే, ఒకప్పటి వెంకయ్యనాయుడు ప్రత్యేక హోదా మాటలే గుర్తుకొస్తున్నాయి తప్ప.. ఆయన చెబుతున్న ప్యాకేజీని జనం విశ్వసించే పరిస్థితుల్లేవు. వెంకయ్యకు అర్థమవుతోందో లేదో, నరేంద్రమోడీ తన తుపాకీని వెంకయ్య భుజాలమీద పెట్టి, ఆంధ్రప్రదేశ్‌ ప్రయోజనాలకి తూట్లు పొడుస్తున్నారు.

Show comments