చంద్రబాబు కొత్త సినిమా.!

రాజధాని అమరావతికి సంబంధించి నార్మన్‌ ఫోస్టర్స్‌ సంస్థ కొత్త డిజైన్లను ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వానికి అందించింది. రొటీన్‌కి భిన్నంగా ఈ డిజైన్లను అధికార పక్షం, విపక్షాలకు కూడా చూపించే ప్రయత్నం చేసిందండోయ్‌. ఎటూ అసెంబ్లీ సమావేశాలు జరుగుతున్నాయి గనుక, అసెంబ్లీలో ప్రతిపక్షం నిలదీస్తుందనే కోణంలో.. మొత్తంగా ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలకు నార్మన్‌ ఫోస్టర్స్‌ సంస్థ ద్వారా పవర్‌ పాయింట్‌ ప్రెజెంటేషన్‌తో డిజైన్లను చూపించేశారు. 

షరా మామూలుగానే, ప్రతిపక్ష నేత వైఎస్‌ జగన్‌ ఈ కార్యక్రమానికి డుమ్మా కొట్టారు. మూడేళ్ళుగా రాజధాని అమరావతికి సంబంధించి ఒక్క ఇటుక కూడా పెట్టలేదన్నది వైఎస్‌ జగన్‌ విమర్శ. ఇప్పుడు కొత్తగా డిజైన్లంటూ ఎవర్ని మభ్యపెట్టబోతున్నారని జగన్‌ ప్రశ్నించారు. ఇలాంటి పబ్లిసిటీ స్టంట్స్‌కి తానెందుకు హాజరు కావాలని ఆయన ఎదురు ప్రశ్నలు సంధించేయడం గమనార్హం. 

ఇక, ప్రెజెంటేషన్‌ కార్యక్రమానికి హాజరైన ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు.. పలు ప్రశ్నల్ని నార్మన్‌ ఫోస్టర్స్‌ సంస్థ ప్రతినిథుల ముందుంచారు. రోడ్లు ఇంత చిన్నగా వుంటే ఎలా.? అని కొందరు ప్రశ్నిస్తే, అసలు ఏ భవనం ఎక్కడొస్తుంది.? నీటి నిర్వహణ ఎలా.? డిజైన్లలో చూపిస్తున్న జల మార్గాల కోసం నీటిని ఎలా తీసుకొస్తారు.? పచ్చదనం సంగతేంటి.? ప్రభుత్వ భవనాలెలా వుంటాయి.? అంటూ పలువురు ప్రశ్నలతో హోరెత్తించారు. ఈ ప్రశ్నలకు సమాధానం చెప్పలేక నార్మన్‌ పోస్టర్స్‌ ప్రతినిథులు చేతులెత్తేశారు. పరిస్థితిని అర్థం చేసుకున్న ముఖ్యమంత్రి చంద్రబాబు, తనదైన స్టయిల్లో పరిస్థితిని చక్కదిద్దే ప్రయత్నం చేశారు. ఆసక్తికరమైన విషయమేంటంటే, అధికార పార్టీకి చెందిన నేతలు, మిత్రపక్షం బీజేపీకి చెందిన నేతలూ నార్మన్‌ ఫోస్టర్స్‌ సంస్థపై ప్రశ్నలు గుప్పించడంతో, ఇటు నార్మన్ ఫోస్టర్స్ సంస్థ ప్రతినిథులూ, ముఖ్యమంత్రి కంగారు పడిపోయారు.

కాస్త తేరుకుని, 'ఇది ఇంకా ఫస్ట్‌ కాపీ మాత్రమే.. ఇంకా చాలా చాలా మార్పులుంటాయి.. ఎవరైనా సూచనలు చేయొచ్చు, వాటికనుగుణంగా మార్పులు చేర్పులు చేస్తాం..' అంటూ చావు కబురు చంద్రబాబు, చల్లగా చెప్పేశారు. తాత్కాలిక సచివాలయం విషయంలో విపక్షాల సలహాల్ని తీసుకోని చంద్రబాబు, ఇప్పుడిలా డిజైన్ల విషయంలో పవర్‌ పాయింట్‌ ప్రెజెంటేషన్‌ పేరుతో హైడ్రామాకి తెరలేపడం అందర్నీ విస్మయానికి గురిచేస్తోంది. 

ఆల్రెడీ చంద్రబాబు తెలివితేటలకు బెదిరి 'మాకీ' సంస్థ పారిపోయింది.. కేంద్రానికి ఫిర్యాదు చేసింది కూడా. నార్మన్‌ ఫోస్టర్స్‌ అయినా, కడదాకా ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వంతో కలిసి పనిచేస్తుందా.? ఏమోగానీ, చంద్రబాబు కొత్త సినిమా మాత్రం షరామామూలుగానే సూపర్‌ ఫ్లాప్‌ అయ్యింది.. అదీ ఒక్క షో తోనే.!

Show comments