ఐ సపోర్ట్‌: లీడర్స్‌ బీ కేర్‌ఫుల్‌

ఐ సపోర్ట్‌.. ఆంధ్రప్రదేశ్‌ డిమాండ్స్‌ స్పెషల్‌ స్టేటస్‌.. సైలెంట్‌ ప్రొటెస్ట్‌.. ఆంద్రప్రదేశ్‌ యువత నినాదమిది. విశాఖ కేంద్రంగా ఆంధ్రప్రదేశ్‌ యువత మౌన నిరసన చేపడ్తోంది. రామకృష్ణ బీచ్‌ (ఆర్‌కే బీచ్‌) ప్రాంతంలో ఈ నిరసన కార్యక్రమానికి పిలుపునిచ్చినా, పోలీసులు మొత్తంగా ఈ ప్రాంతాన్ని 'రౌండప్‌' చేసేయడంతో, అటువైపుగా సామాన్య మానవుడెవడూ వెళ్ళే పరిస్థితి లేదక్కడ. అయితే, యువతను ఆపడం వందల సంఖ్యలో వున్న పోలీసుల తరం కాదన్నది నిర్వివాదాంశం. 

కానీ, యువత తొందరపడ్డంలేదు. మొండిగా అసలే వ్యవహరించడంలేదు. 'ఆంధ్రప్రదేశ్‌ యువత' పేరుతో విశాఖకు ఇప్పటికే చేరుకున్నవారెవరూ పోలీసులతో ఘర్షణ పడటంలేదు. పోలీసులు, ముందస్తు అరెస్టులతో ఆంధ్రప్రదేశ్‌ యువతను భయాందోళనలకు గురిచేస్తున్నా, పరిస్థితి కాస్త ఉద్రిక్తింగా మారినా.. ప్రభుత్వం ఆశించిన స్థాయిలో ఆందోళనలు అక్కడ జరగకపోవడం నూటికి నూరుపాళ్ళూ అభినందనీయం. ఇంత అద్భుతంగా, యువత తమ నిరసన కార్యక్రమాన్ని కొనసాగించడాన్ని అభినందించి తీరాల్సిందే ఎవరైనా. 

ఎప్పటికప్పుడు సోషల్‌ మీడియాలో, ఆంధ్రప్రదేశ్‌ యువతను ఉద్దేశించి, పలు సూచనలు చేస్తున్నారు. వీరంతా, 'ఆంధ్రప్రదేశ్‌ యువత'కి మద్దతిస్తున్నవారే. 'పోలీసులు మీ దగ్గరకు వస్తే, మీ నోటికి నల్లగుడ్డ కట్టుకోండి.. మీ చేతులు వెనక్కి మడిచేసుకోండి.. మోకాళ్ళ మీద నిల్చోండి.. ఎట్టిపరిస్థితుల్లోనూ ఎదురుతిరగొద్దు..' అంటూ ఆంధ్రప్రదేశ్‌ యువత, వారికి మద్దతిస్తోన్నవారు సోషల్‌ మీడియాలో సూచిస్తున్నారంటే, ఇదేదో ఆషామాషీ ఉద్యమం అనుకుంటే పొరపాటే. 

మరోపక్క, రాజకీయ నాయకులు చేస్తోన్న ప్రతి కామెంట్‌కీ 'ఆంధ్రప్రదేశ్‌ యువత' సోషల్‌ మీడియాలో స్పందిస్తోంది. 'పందుల పోటీలు' అని కేంద్ర మంత్రి సుజనా చౌదరి చెప్పినా, అరాచకం సృష్టిస్తున్నారని మంత్రి అచ్చెన్నాయుడు చెప్పినా, రిపబ్లిక్‌ డే రోజున ఇదేం నిరసన.? అని బీజేపీ నేత ఒకరు ఆగ్రహం వ్యక్తం చేసినా.. 'ఆంధ్రప్రదేశ్‌ యువత' వద్ద అన్నిటికీ ఖచ్చితమైన సమాధానాలున్నాయి. ఆ సమాధానాలు కూడా రాజకీయ నాయకులకు సూటిగానే తగులుతున్నాయనుకోంండి.. అది వేరే విషయం. 

జల్లికట్టు తరహాలో హింసాత్మక కార్యక్రమాలకు దిగుతారా.? అని అధికార పార్టీకి చెందిన ఓ నేత మీడియా ముఖంగా ప్రశ్నిస్తే, అసలు జల్లికట్టు ఉద్యమంలో హింసకు కారణమెవరు, పోలీసులే కదా.. అంటూ ఓ వీడియోని సాక్ష్యంగా చూపుతోంది ఆంధ్రప్రదేశ్‌ యువత. విశాఖ వీధుల్లో పోలీసులు పరుగులు పెడ్తుండడం, అక్కడెవరూ నిరసనకారులు లేకపోయినా పోలీసులు హడావిడి చేయడం, కొన్ని విద్యాసంస్థల్లో పోలీసులు బసచేసి, అక్కడి విద్యార్థుల్ని బయటకు రానీయకుండా చేయడం.. అధికార పార్టీ నేతల కార్లలో పోలీసులు తిరుగుతుండడం.. ఇవన్నీ క్షణాల్లో సోషల్‌ మీడియాలోకి ఎక్కేశాయి ఆధారాలతో సహా. స్వాతంత్య్ర దినోత్సవానికీ, గణతంత్ర దినోత్సవానికీ తేడా తెలియని పోలీస్‌ ఉన్నతాధికారి తీరుని సైతం ఆంధ్రప్రదేశ్‌ యువత ప్రశ్నిస్తోంది. 

'మౌన నిరసన' కార్యక్రమంలో ప్రత్యక్షంగా కొందరు పాల్గొంటోంటే, వారిని సోషల్‌ మీడియా ద్వారా ఇంకొందరు కంట్రోల్‌ చేస్తున్నారు. ఓవరాల్‌గా, ఆంధ్రప్రదేశ్‌ చరిత్రలోనే కాదు.. దేశ చరిత్రలోనే ఇదొక అద్భుత ఘట్టం. దురదృష్టవశాత్తూ నేషనల్‌ మీడియా ఇటువైపు కన్నెత్తి కూడా చూడటంలేదు.

Show comments