ఆ త్రిమూర్తులు ఎక్కడున్నారో?

సమైక్య ఆంధ్ర ఉద్యమం అన్నా, సమైక్యాంధ్ర ప్రదేశ్ కోసం పోరాటం అన్నా, అసలు ఆంధ్రకు అన్యాయం జరుగుతోందన్నా, వెంటనే మీడియాలో కొన్ని పేర్లు కనిపించేవి. ఇదంతా విభజనకు ముందు మచ్చట. వారిలో ముందుండే పేరు ఉద్యోగ సంఘాల నాయకుడయిన పరుచూరి అశోక్ బాబు. రెండో పేరు లెక్కలు, తారీఖ్ లు దస్తావేజులతో మాట్లాడే పరకాల ప్రభాకర్. మూడో పేరు ఆఖరి బంతి వుంది..జేబులో దాచా..అవసరం అయినపుడు తీసి బౌల్ చేస్తా అంటూ ఏవో కబుర్లు చెప్పే లగడపాటి రాజగోపాల్.

ఇప్పుడు రాష్ట్రంలో హోదా ఉద్యమం అంటూ నానా గలాభా జరుగుతుంటే, ఈ ముగ్గురు ఎక్కడున్నారో అన్నది మాత్రం తెలియడం లేదు. సరే, లగడపాటి రాజగోపాల్ అంటే రాజకీయ నాయకుడు. ఏ ఎండ కు ఆ గొడుగు పట్టడం వాళ్లకు అలవాటు. అందుకే ఆయన ఇప్పుడు సదా ఢిల్లీలో గౌరవ కేంద్ర మంత్రి వర్యులు వెంకయ్య నాయుడుతో ఎక్కువగా సాయంత్రాలు గడుపుతున్నారని గుసగుసలు వినిపిస్తున్నా..మనం పట్టించుకోనక్కరలేదు.

కానీ ఈ అశోక్ బాబు సంగతేమిటి? కిరణ్ కుమార్ రెడ్డి ముఖ్యమంత్రిగా వుండగా ఎలా చెలరేగారు? మరి ఇప్పుడు ఏమీ మాట్లాడరేమి? డిఎ ఇవ్వకుండా చంద్రబాబు ఉద్యోగుల మూతులు ఎండగడుతున్నా, అశోక్ బాబుకు పట్టలేదు. ఇప్పుడు హోదా కోసం ఇంత జరుగుతున్నా ఆయన పెదవి విప్పడం లేదు. మరి ఇదే పెద్ద మనిషి అప్పుడు అన్ని మాటలు మాట్లాడి, అన్ని సభలు జరిపి, రాజకీయ నాయకుడికి తక్కువ, ఉద్యోగ సంఘాల నాయకుడికి ఎక్కువ అన్నట్లు చెలరేగిపోయారు. అలాంటిది ఇప్పుడు ఆ స్టామినా, ఆ సత్తా, ఆ మాటలు ఏమైపోయాయి? కిరణ్ అంటే మెత్తన? బాబు అంటే భయమా?

ఇక పరకాల ప్రభాకర్ మహాశయుడు. ఏ టీవీ డిస్కషన్ లో చూసినా ఆయనే కనిపించేవారు. ఆయనకు నచ్చని విభజన జరిగి, ఆయనకు మంచేచేసింది. క్యాబినెట్  ర్యాంక్ పదవి దొరకింది. అంతే సైలెంట్ అయిపోయారు. ఆయనకు సంబంధించినంత వరకు సమైక్యాంధ్ర ప్రయోజనాలు నెరవేరిపోయినట్లే. ఇన్నాళ్లు సరే, మరి ఇప్పుడు మరోసారి ఆంధ్ర ప్రయోజనాల సమస్య తెరపైకి వచ్చినా మాట్లాడరేమి? 

ఇంకా ఇలాంటి గొప్పోళ్లు చాలా మందే వున్నారు. వారిలో కొంతమందికి తమవర్గ ప్రభుత్వానికి ఇబ్బందులు కలిగించకూడదని భావించేవారు కొందరు.  కేంద్ర భాజపాతో సంబంధాలు వున్నవారు మరి కొందరు. ఇలాంటి వాళ్లంతా తెరవెనుక దాగున్నారు. తెర ముందు జరుగుతున్నదాన్ని చోద్యం చూసినట్లు చూస్తున్నారు.

Show comments