ఆపద్ధర్మ సీఎం వస్తే.. జయను బతకనిస్తాడా?

తమిళనాడు రాజకీయాలు ఇంకా ఒక కొలిక్కి రాలేదు. జయకు ఏమీ కాలేదు.. ఆమె బాగున్నారు.. అనే మాట ఒకవైపు, సీఎం ఆసుపత్రికే అంకితం అయిపోతే.. పాలన పరిస్థితి ఏమిటి? అంటూ మరోవైపు.. ప్రతిపక్ష పార్టీనేమో ఆపద్ధర్మ సీఎంను నియమించాలని డిమాండ్ చేస్తోంది. అన్నాడీఎంకేనేమో ఆ అవసరం లేదంటోంది. కానీ.. జయ చికిత్స విషయంలో గోప్యత ఎందుకు? ఆమె పరిస్థితి ఏమిటో స్పష్టంగా ఎందుకు చెప్పడం లేదు.. అంటే ఈ పార్టీ నుంచి సూటిగా సమాధానం లేదు.

ఇక బీజేపీ, కాంగ్రెస్ ల విషయానికి వస్తే ఈ పార్టీలు పైకి జయపై సానుకూల ధోరణినే వ్యక్తం చేస్తున్నాయి. జయ కోలుకుంటోంది.. ఆమె తిరిగి పాలన వ్యవహారాలను సమీక్షిస్తుంది.. అనే మాటనే వీరు మాట్లాడుతున్నారు.

ఇక పై పై రాజకీయాల సంగతిలా ఉంటే.. అన్నాడీఎంకేలో ఇప్పటికే జయలలిత వారసత్వం విషయంలో అంతర్గత కలహాలు తీవ్ర స్థాయిలో ఉన్నాయని తెలుస్తోంది. జయకు వారసుడు సహజంగా తనే అవుతానన్నట్టుగా పన్నీరు సెల్వం వ్యవహరిస్తుంటే… ఆయనకు ఆ ఛాన్సు దక్కనీయకూడదని ఈ పార్టీలోని కొంతమంది ఎమ్మెల్యేలు కృత నిశ్చయంతో ఉన్నారు.

ఇక జయ వారసత్వం గురించి ఉన్న పుకార్లు అన్నీ ఇన్నీ కావు. ఈ నేపథ్యంలో ఎవరో ఒకరు గనుక ఆపద్ధర్మం అంటూ ముఖ్యమంత్రి పీఠాన్ని చేపడితే.. ఆ తర్వాత జరిగేది అల్లకల్లోలమే అని వేరే చెప్పనక్కర్లేదు.

అన్నాడీఎంకే తరపున ఎవరైనా ఆపద్ధర్మంగా పీఠం ఎక్కితే వారి నుంచి మొదటి ముప్పు జయలలితకే అనాలి. ఆసుపత్రిలో ఉన్న ఆమెను  అటు నుంచి అటే పంపించడానికి సీఎం సీటు ఎక్కిన వారు ప్రయత్నిస్తారు అనడానికి ఏ మాత్రం సందేహించనక్కర్లేదు. అవకాశం వచ్చి సీటులో కూర్చుంటే చాలు.. ఆ తర్వాత వాళ్ల కథలు వేరే రకంగా ఉంటాయి.

ఇప్పటి వరకూ ఓకే.. ఇకపై  రోజులు గడిచే సరికీ.. ఆపద్ధర్మం, ప్రత్యామ్నాయం అనే మాట పెద్దది అవుతుంది. ఒక్కసారి ఆపద్ధర్మ సీఎం అంటూ ఎవరైనా ఎన్నిక అయితే.. ప్రతిపక్షం కూడా ఆ అవకాశాన్ని తనకు అనుకూలంగా మలుచుకోవాలని చూడవచ్చు. జయ అదుపాజ్ఞలు ఏమీ ఉండవు కాబట్టి.. అన్నాడీఎంకేలోనూ అంతర్గత కలహాలు తీవ్రం అవుతాయి. జయకు రక్షణా లేకుండా పోతుంది.. ఇదంతా జరిగే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. కాబట్టి.. జయకు సన్నిహితులైన అధికారులైనా ఆమె ఆరోగ్యం గురించి స్పష్టమైన వివరాలు ప్రకటించి.. ఈ వ్యవహారంలో ప్రజలకు కొంత క్లారిటీ ఇవ్వడం మంచిదేమో! 

Show comments