ఈ బాధ వెంకయ్యదా? ఆయనపై ఆదారపడ్డవారిదా?

కొన్ని పత్రికలను, కొంతమంది వ్యక్తులను వేరుగా చూడలేం. దానికి సహేతుకమైన కారణాలు వున్నాయి. ఆంధ్రజ్యోతి పత్రికతో వెంకయ్యనాయుడుకి, తెలుగుదేశం మంత్రులకు కాస్త గట్టి బంధమే వుంది. అది కాదనలేని సత్యం. ఎందుకంటే వెంకయ్యనాయుడు కావచ్చు, మంత్రి దేవినేని కావచ్చు తరచూ ఆంధ్రజ్యోతి ఎడిటోరియల్ పేజీలో వ్యాసాలు రాస్తారు. ఎడిటోరియల్ పేజీ అంటే పత్రిక పాలసీకి  నిలువుటద్దం అన్నది జర్నలిస్టు పాఠాలు చెప్పే విషయం.

మరి అలాంటి ఎడిటోరియల్ పేజీలో మంత్రులైనా సరై, రాజకీయ పార్టీల నాయకులు వారి వారి రాజకీయ పార్టీల సిద్దాంతాలకు అనుగుణంగా వ్యాసాలు రాస్తే, ప్రచురించడం అంటే ఏమనుకోవాలి? ఆ పత్రిక ఎడిటోరియల్ పాలసీలో ఆ మంత్రులు లేదా రాజకీయ నాయకులు పాలు పంచుకుంటున్నారు అనుకోవాల్సిందే. అలాంటి ఆంధ్రజ్యోతి పత్రికలో ఈరోజు ఎడిటర్ కమ్ పబ్లిషర్ తన కాలమ్ అందించారు. ఆ కాలమ్ ఆద్యంత వెంకయ్య నాయుడు-ఉపరాష్ట్రపతి పదవి గురించే సాగింది. 

''..ఉపరాష్ట్రపతి పదవికి బీజేపీ తనను ఎంపిక చేసిన వార్త వెలువడిన నాటి నుంచి నామినేషన్‌ వేసే వరకు కూడా ఆయన ముఖంలో సంతోషం కనబడలేదు. ఉపరాష్ట్రపతి పదవికి వెంకయ్యనాయుడిని మించిన వ్యక్తి దొరకలేదనీ, దేశ హితం కోసమే ఆయనను ఈ పదవికి ఎంపిక చేశామనీ బీజేపీ అధ్యక్షుడు అమిత్‌ షా, ప్రధాని నరేంద్రమోదీ గొప్పగా అభివర్ణించినప్పటికీ వెంకయ్య ముఖంలో నవ్వులు పూయలేదు..''

అంటే వెంకయ్య నాయుడుకి ఉపరాష్ట్రపతి కావడం సుతరామూ ఇష్టంలేదని క్లియర్ అవుతోంది. పోనీ మంచిపదవే ఇచ్చారు ఇష్టం లేకపోయినా అనుకోవచ్చు కదా? కానీ అలా అనుకోవడం లేదు ఇక్కడ. ఇదంతా చంద్రబాబుకు చెక్ చెప్పడానికి, జగన్ ను దగ్గరకు తీసుకోవడానికి జరుగుతున్న వ్యవహారంలా చూస్తున్నారు. ఈ వాక్యాలు చూడండి.

''..ప్రజలు మాత్రం మోదీ–షాలు చెబుతున్న మాటలను నమ్మడంలేదు. తెరవెనుక ఏదో జరిగింది. వెంకయ్యను క్రియాశీల రాజకీయాలకు ఉద్దేశపూర్వకంగానే దూరం చేశారు అని మెజారిటీ ప్రజలు అభిప్రాయపడుతున్నారు. ..''

ఇలా దూరం చేయడం ఎందుకు? అంటే తెలుగు రాష్ట్రాల్లో భాజపాను బలోపేతం చేయడానికే అన్నది మెజార్టీ భాజపా జనాల అభిప్రాయం. అది కూడా నిజమే అనిపిస్తుంది. ఎందుకంటే కేంద్రంలో అధికారంలో వున్నా కూడా, గడచిన మూడేళ్లలో ఆంధ్రలో ఎంతమంది నాయకులు ఇతర పార్టీల నుంచి వచ్చి భాజపాలో చేరారు? ఎవ్వరు ఎందుకు రాలేదు? చిరంజీవి, కిరణ్ కుమార్ రెడ్డిల పేర్లు వినిపించినా ఎందుకు ఆచరణలోకి రాలేదు.

కామినేని శ్రీనివాస్ మంత్రి, వెంకయ్య కేంద్రమంత్రి, కంభంపాటి హరిబాబు రాష్ట్ర పార్టీ అధ్యక్షుడు, ఎంపీ. నందమూరి పురంధ్రీశ్వరి పార్టీ నాయకురాలు. ఇలా ఒకే సామాజిక వర్గానికి చెందిన వారే రాష్ట్ర భాజపాలో ఎందుకు కీలకంగా వున్నారు? మిగిలిన వారికి ఎందుకు అవకాశాలు రావడంలేదు? 

''...ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ఎంత తగ్గిఉన్నా ప్రధాని మోదీ గానీ, అమిత్‌ షా గానీ ఆయనను విశ్వాసంలోకి తీసుకోవడంలేదు. వాజ్ పేయి టైమ్ లో చంద్రబాబును ఢిల్లీలో కలవడానికి మోదీ ఎంత ప్రయత్నించినా ఏపీ భవన్‌లో ఉండి కూడా చంద్రబాబు అపాయింట్‌మెంట్‌ ఇవ్వలేదనీ, ఆనాటి చేదు అనుభవాన్ని మనసులో పెట్టుకునే బాబు పట్ల మోదీ గుర్రుగా ఉంటున్నారనీ విస్తృతంగా ప్రచారం జరుగుతోంది. 

''..తనపట్ల ఏమైనా అపోహలు ఉంటే వాటిని తొలగించుకోవడానికై చంద్రబాబు మూడేళ్లుగా ప్రయత్నిస్తూనే ఉన్నారని చెబుతున్నారు. మోదీని సత్కరించడం కోసం శాలువాను కప్పే ప్రయత్నం చేశారు. ఈ క్రమంలో మడతపెట్టి ఉన్న శాలువా నుంచి ఒక కాగితం కిందపడింది. వెంటనే చంద్రబాబు కిందకు వంగి ఆ కాగితాన్ని ఏరివేశారు. ఈ దృశ్యం చూసేవాళ్లకు మోదీ కాళ్లకు చంద్రబాబు మొక్కినట్టుగా కనిపిస్తుంది. ఈ స్థాయిలో చంద్రబాబు తన వినయాన్ని ప్రదర్శిస్తున్నారు. అధికారంలోకి వచ్చిన కొత్తలోనే తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌ ఇంటికి సీబీఐ అధికారులను పంపడం ద్వారా ఆయనకు కూడా హెచ్చరిక పంపారని ఆ నాయకుడు చెప్పుకొచ్చారు. 

ప్రధానికి శాలువా కప్పే టైమ్ లో కిందపడ్డ చిత్తుకాగితం ముఖ్యం అనుకుంటారా? ఎవరైనా? అంటే దీన్నిబట్టి చిత్తుకాగితం వంకతో నిజంగానే వంగారని అనుకోవాల్సి వస్తుంది కిట్టనివాళ్లు. చంద్రబాబు లాంటి సీనియర్ రాజకీయ నాయకుడు, ఓ రాష్ట్రానికి ముఖ్యమంత్రి ఇంతలా దిగజారడం అవసరమా? మరి ఆంధ్రుల ఆత్మగౌరవం ఏమవుతుంది? మోడీని కాదంటే ఏమవుతుంది. మహా అయితే పొత్తువుండదు? పోత్తు లేకపోతే చంద్రబాబు గెలవలేరా? చంద్రబాబు అందుకోసమే అంత వినయంగా వుంటున్నారా?

''..అమిత్‌ షా, రామ్‌మాధవ్‌ సమయం కోసం వేచిచూసి, వెంకయ్యనాయుడుని క్రియాశీల రాజకీయాల నుంచి తప్పించడానికి స్కెచ్‌ వేశారని చెబుతున్నారు వెంకయ్యనాయుడు లేకపోతే ఏపీలో పార్టీని విస్తరించుకోవచ్చుననీ, అదే సమయంలో తెలుగుదేశం పార్టీ అధినేత, ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడిని అదుపులో పెట్టుకోవచ్చుననీ వ్యూహరచన చేసి ఉంటారని తెలుగు ప్రజలు భావిస్తున్నారు...''

వెంకయ్యనాయుడు వున్నా కూడా, రాష్ట్రంలో అధికారంలోకి రాగానే చంద్రబాబు ఏరికోరి పరకాల ప్రభాకర్ ను ఎందుకు పదవిలో కూర్చోపెట్టారు. ఆయన సతీమణి కేంద్రంలో మంత్రికాకపోయి వుంటే, పరకాలను చంద్రబాబు చేరదీస్తారా?  మరి చంద్రబాబు తన ప్రయత్నాలు తానుచేయడం అన్నది మోడీ గమనించకుండా వుంటారా? అలా అని మోడీని కాదని భాజపా జనాలు చంద్రబాబుకు ఏమైనా చేయగలరా?

జగన్ అయితే ఎక్కువ సీట్లు ఇస్తారని, అందుకే వైకాపాకు భాజపా దగ్గరవుతోందని అంటున్నారు. అదేమైనా తప్పా? 2014 ఎన్నికల ముందు భాజపాతో పొత్తుకోసం బాబు ఎంత కిందామీదా పడి చాణక్యం నడిపారో అందరికీ తెలిసిందే కదా? మరి ఇప్పుడు జగన్ తన చాణక్యం తాను చేసుకోవడం ఏమన్నా తప్పా?

ఆఖరికి ఇంతకీ ఆంధ్రజ్యోతి చెప్పేది ఏమిటి?

''.. ఏది ఏమైనా ఏదో సినిమా పాటలో అన్నట్టుగా ‘నా ఖర్మ ఇలా కాలిందేమిటా’ అని వెంకయ్యనాయుడు వాపోతుండవచ్చు. పాపం వెంకయ్య!..''

ఎంత ఇష్టం లేకపోయినా ఈ దేశపు ఉపరాష్ట్ర పదవి అంటే అంత చిన్న విషయంకాదు. కానీ నా ఖర్మ కాలిందేమిటా? అనే రేంజ్ లో వాపోవడం అంటే చాలాతప్పు అనుకోవాలి. ఖర్మ కాలంది వెంకయ్యనాయుడిది కాదు. ఆయన అండతో పనులు చక్క బెట్టుకోవాలనుకున్నవారిది. అధికారం నిలబెట్టుకోవాలనుకున్నవారిది.

-ఆర్వీ

Show comments