'అరెస్టులు' ఇక్కడ వర్తిస్తాయా బాబూ.!

ఓ సామాన్యుడు, కడుపు మండి ప్రభుత్వ వ్యతిరేక విధానాలపై సోషల్‌ మీడియా వేదికగా సెటైర్లు వేస్తే.. అరెస్టులతో విరుచుకుపడుతోంది ఆంధ్రప్రదేశ్‌ సర్కార్‌. ఇప్పటికే ఈ తరహాలో ఇద్దర్ని అరెస్టు చేసేశారు ఆంధ్రప్రదేశ్‌ పోలీసులు.

అరెస్టయినవాళ్ళంతా ప్రతిపక్షం వైఎస్సార్సీపీకి సానుభూతిపరులే. అద్గదీ అసలు విషయం. వైఎస్సార్సీపీని ఎదుర్కోలేక, ఆ పార్టీ సానుభూతిపరులపైన అధికారాస్త్రం ప్రయోగిస్తున్నారన్నమాట. 

ఇక, సీనియర్‌ ఐఏఎస్‌ అధికారి, మాజీ చీఫ్‌ సెక్రెటరీ, ప్రస్తుత బ్రాహ్మణ కార్పొరేషన్‌ ఛైర్మన్‌ ఐవైఎఆర్‌ కృష్ణారావు ఏపీ రాజకీయాల్లో హాట్‌ టాపిక్‌ అయ్యారు. కారణం ఆయన, చంద్రబాబు దయాదాక్షిణ్యాలతో (టీడీపీ నేతలు అలాగే అంటున్నారు..) బ్రాహ్మణ కార్పొరేషన్‌ ఛైర్మన్‌ పదవి పొందిన ఐవైఆర్‌, చంద్రబాబు సర్కార్‌కి వ్యతిరేకంగా సోషల్‌ మీడియాలో 'యుద్ధం' షురూ చేశారు.

వైఎస్సార్సీపీ సానుభూతిపరులు సోషల్‌ మీడియాలో చేస్తున్న పోస్టింగ్‌లను ఐవైఆర్‌ షేర్‌ చేస్తుండడంతో టీడీపీ సానుభూతిపరులకు ఒళ్ళు మండేలా చేస్తోంది. 

'చంద్రబాబు దయా దాక్షిణ్యాలతో నామినేటెడ్‌ పదవి పొంది, చంద్రబాబు సర్కార్‌కే వెన్నుపోటు పొడుస్తారా.?' అంటూ విరుచుకుపడిపోతున్నారు టీడీపీ సానుభూతిపరులు. కొందరు టీడీపీ నేతలు, డైరెక్ట్‌గా ఐవైఆర్‌తో అమీ తుమీ తేల్చుకోవడానికి సిద్ధమయ్యారు.

వారిలో కొందరు ఆయనతో ఇప్పటికే మాట్లాడగా, ఆయన నిర్లక్ష్యంగా సమాధానం చెప్పారట. వ్యవహారం చంద్రబాబుదాకా వెళ్ళిందనీ, త్వరలోనే ఐవైఆర్‌ పదవి ఊడిపోనుందనీ ప్రచారం జరుగుతోంది. 

మామూలుగా అయితే, కక్ష సాధింపు చర్యల్లో భాగంగా ఐవైఆర్‌పైనా 'అరెస్టు' అస్త్రం ప్రయోగించొచ్చు.. కానీ, ఆయన సాదా సీదా వ్యక్తి కాదు కదా. రాష్ట్రానికి చీఫ్‌ సెక్రెటరీగా గతంలో సేవలందించిన వ్యక్తి. దాంతో, ప్రస్తుతానికి చంద్రబాబు అండ్‌ టీమ్‌ ఆచి తూచి వ్యవహరిస్తోంది.

అధికార పార్టీ నేతలు అవినీతిలో కూరుకుపోవచ్చు.. ప్రభుత్వాలపై అవినీతి ఆరోపణలు రావొచ్చు.. కానీ, ప్రజలు ప్రశ్నించకూడదు. అధికారమంటే ప్రజలకు సేవ చేయడం కాదు.. తమకిష్టమొచ్చినట్లు పాలకులు వ్యవహరించడం.. వ్యవస్థల్ని నిర్వీర్యం చెయ్యడం.. అదే రాజకీయ పరమార్థం.. ఇదే ఇప్పుడు పాలకులు వ్యవహరిస్తున్న తీరు. కాబట్టి, ప్రశ్నించారో ఖబడ్దార్.!

Show comments