ఎమ్మెస్‌ ధోనీ వారసుడెవరు.?

ఆల్రెడీ టెస్టుల నుంచి రిటైర్‌ అయిపోయిన మహేంద్రసింగ్‌ ధోనీ, అతి త్వరలో వన్డేలు, టీ20ల నుంచీ తప్పుకోనున్నాడు. వయసు మీద పడ్తోంది కదా.. ఇంకో ఆర్నెళ్ళ తర్వాతో, ఏడాది తర్వాతో ఖచ్చితంగా ఈ రెండు ఫార్మాట్లకూ గుడ్‌ బై చెప్పక తప్పదు. కెప్టెన్సీ విషయంలో పెద్దగా సమస్యల్లేవు. ధోనీ స్థానాన్ని కోహ్లీ భర్తీ చేసేయగలడు, చేసేస్తున్నాడు కూడా. టెస్టు పగ్గాలు ధోనీ నుంచి అందుకుని, అద్భుతమైన విజయాల్ని సొంతం చేసుకుంటున్న కోహ్లీ, వన్డేలు - టీ20ల్లోనూ అదే తరహా నాయకత్వ లక్షణాల్ని ప్రదర్శించే అవకాశాలు సుస్పష్టం. 

కానీ, వికెట్‌ కీపర్‌గా ఎంఎస్‌ ధోనీ ప్లేస్‌లోకి వచ్చేదెవరు.? అన్నదే ఇప్పుడు మిలియన్‌ డాలర్ల ప్రశ్న. ధోనీ ఓ వెలుగు వెలుగుతున్న సమయంలో, వికెట్‌ కీపర్లుగా జట్టులో చోటు కోసం చాలామంది ఎదురుచూశారు. ధోనీ రెస్ట్‌ తీసుకున్న ప్రతిసారీ ఎవరో ఒకరు రావడం, వెళ్ళిపోవడం చూశాం. కానీ, ధోనీలా వారెవరూ జట్టుకి 'వెన్నెముక' కాలేకపోయారు. పార్తీవ్‌ పటేల్‌, దినేష్‌ కార్తీక్‌, వృద్ధిమాన్‌ సాహా.. ఇంకొందరి పేర్లు ఈ లిస్ట్‌లో వున్నాయి. 

అయితే, టెస్టుల్లో ధోనీ తర్వాత సాహా, పార్తీవ్‌ తమ సత్తా చాటుకున్నారుగానీ.. ధోనీ స్థాయిలో మాత్రం కాదన్నది నిర్వివాదాంశం. అందుకే, ఇప్పుడుఏ టీ20, వన్డేలకొచ్చేసరికి.. టెన్షన్‌ పెరిగిపోతోంది. వన్డేలు, టీ20 ఫార్మాట్ల నుంచి ఇంకా ఆటగాడిగా రిటైర్‌మెంట్‌ ప్రకటించలేదుగానీ, అతి త్వరలో ఆ 'కబురు' కూడా ధోనీ చెప్పేయనున్నాడన్నది నిర్వివాదాంశం. దాంతో, ఇప్పటికిప్పుడు 'మెరికలాంటి వికెట్‌ కీపర్‌'ని సెలక్టర్లు వెతికి పట్టుకోవాల్సిందే. 

ఎంత టాలెంట్‌ వున్నాసరే, జట్టు మీద కమాండ్‌ వున్న వికెట్‌ కీపర్‌ టీమిండియాకి దొరకడం చాలా కష్టం. ఎందుకంటే, బౌలర్‌ని తన కనుసైగలతో శాసించి, సూచనలిచ్చి.. బంతిని తనక్కావాల్సిన చోట వేయించి.. బ్యాట్స్‌మెన్‌ని ఔట్‌ చేయించడం అనేది ధోనీకి మాత్రమే తెలిసిన విద్య. కెప్టెన్‌ కావడమే అతనికి ఆ విషయంలో అంత పేరు తెచ్చుకువచ్చింది.. ఆ అవకాశాన్నీ ఇచ్చింది. సో, ధోనీ తరహా వికెట్‌ కీపర్‌ని ఇప్పట్లో చూడలేం.

Show comments