ఎన్టీఆర్‌కి భారతరత్న: బాబు పాప ప్రక్షాళన

విశ్వ విఖ్యాత నట సార్వభమౌముడు.. తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకుడు.. స్వర్గీయ నందమూరి తారకరామారావు, తెలుగు ప్రేక్షకుల్ని అలరించడంలోనే కాదు, తెలుగు ప్రజల్ని పరిపాలించడంలోనూ తనదైన ముద్ర వేశారు. అప్పట్లో తెలుగు సినీ ప్రేక్షకుల ఆరాధ్య దైవం ఆయన. కేవలం సినీ నటుడిగానే ఆయన్ని చూడలేదు తెలుగు ప్రజలు. రాజకీయాల్లోనూ ఆయన్ని ఆశీర్వదించారు. రాజకీయ పార్టీ పెడుతూనే, ముఖ్యమంత్రి అయిన ఎన్టీఆర్‌, అప్పటికీ ఇప్పటికీ ఎప్పటికీ ఓ సంచలనం. 

దేశ రాజకీయాల్లో చక్రం తిప్పిన ఎన్టీఆర్‌, ప్రధాని అయ్యే అవకాశం వచ్చినా కాదనుకున్నారు. ఎంత పేరు ప్రఖ్యాతులు సాధిస్తేనేం.? అల్లుడి రాజకీయ వ్యూహాలకు దెబ్బయిపోయారు. చంద్రబాబు కారణంగా, రాజకీయంగా చావు దెబ్బ తిన్నారు. ఆ మానసిక వ్యధతోనే ప్రాణాలు కోల్పోయారు. ఇది చరిత్ర. దీన్ని చెరిపేయడం కుదరదు. చంద్రబాబు తనను ఏ స్థాయిలో వెన్నుపోటు పొడిచారో చెబుతూ, ఎన్టీఆర్‌ కంటతడిపెట్టుకున్న వీడియో సాక్ష్యాలు ఇప్పటికీ అలాగే వున్నాయి. 

దురదృష్టవశాత్తూ, అప్పుడు వెన్నుపోటు పొడిచిన అల్లుడే ఇప్పుడు ఎన్టీఆర్‌కి భారతరత్న ఇవ్వాలంటున్నారు. ఇదిప్పటి మాట కాదు. ఎప్పటినుంచో చంద్రబాబు చెబుతున్నదే. చంద్రబాబు తలచుకుంటే పది పదిహేనేళ్ళ క్రితమే ఎన్టీఆర్‌కి భారతరత్న వచ్చేది. రాజకీయాల్లో చక్రం తిప్పే సమయంలో చంద్రబాబు నోరు మెదపలేదు. ఆ తర్వాత మాత్రం పబ్లిసిటీ స్టంట్లు షురూ చేసేశారు. ఈసారి స్వర్గీయ ఎన్టీఆర్‌కి భారతరత్న 'పక్కా' అంటూ సంకేతాలు పంపుతోంది తెలుగుదేశం పార్టీ. 

నిజమే అయితే మాత్రం, టీడీపీ ప్రస్తుత అధినేత నారా చంద్రబాబునాయుడు 'పాప ప్రక్షాళన' చేసుకునేందుకు గట్టిగానే ప్రయత్నిస్తున్నారనుకోవాలి. ప్రధాని దృష్టికి వెళ్ళింది, అతి త్వరలో ఎన్టీఆర్‌కి భారతరత్న ఖాయమని కేంద్ర మంత్రి సుజనా చౌదరి 'మహానాడు'లో చెప్పుకొచ్చారు. అతి త్వరలో ఆంధ్రప్రదేశ్‌కి ప్రత్యేక హోదా వచ్చేస్తుందని 'పండగల' పేర్లు చెప్పి జనాన్ని మభ్యపెట్టింది ఇదే సుజనా చౌదరి కావడం గమనార్హం. 

ఇంతకీ, స్వర్గీయ ఎన్టీఆర్‌కి భారతరత్న వస్తుందా.? చంద్రబాబు పాప ప్రక్షాళన జరుగుతుందా.? వేచి చూడాల్సిందే. 

Show comments