బాబోయ్‌ 'దంగల్‌'.. ఈ వసూళ్ళు నిజమేనా.?

చైనాలో మన భారతీయ సినిమా ఒకటి విడుదలైతే, అక్కడ దాన్ని చూసేవారెందరు.? ఇండియాలో సూపర్‌ హిట్‌ అయ్యే సినిమాలూ అక్కడ బోల్తా కొట్టేసిన సందర్భాలున్నాయి. ఎక్కడిదాకానో ఎందుకు, దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన 'బాహుబలి ది బిగినింగ్‌', చైనాలో బోల్తా కొట్టేసింది. అలాంటిది, 'దంగల్‌' సినిమా చైనాలో వసూళ్ళ పరంగా అద్భుతాలు సృష్టించేస్తోంది. 

అలా ఇలా కాదు, శుక్రవారం నాటి వసూళ్ళను పరిశీలిస్తే మైండ్‌ బ్లాంక్‌ అవకమానదు. నేటి లెక్కలు ఇంకా తెలియాల్సి వుంది. నిన్నటికి.. అంటే, శుక్రవారం రాత్రి వరకు చైనాలో 'దంగల్‌' 544.91 కోట్లు వసూలు చేసింది. ఇదేమీ ఆషామాషీ విషయం కాదు. డాలర్లలో లెక్కేస్తే 84.5 మిలియన్‌ డాలర్లకు లెక్క తేలింది. నిన్న ఒక్కరోజే 5.97 మిలియన్‌ డాలర్లు వసూలు చేసింది 'దంగల్‌' చైనాలో. ఈ ఊపు చూస్తోంటే, చైనా మినహాయించి ఇండియా, విదేశాలు కలుపుకుంటే ఎంత మొత్తం వచ్చిందో, ఆ మొత్తాన్ని అతి త్వరలోనే 'దంగల్‌' చైనాలో దాటేసినా ఆశ్చర్యపోనక్కర్లేదేమో.! 

చైనాలో 'సుమో ఫైటింగ్‌' గురించి అందరికీ తెల్సిందే. అచ్చం మన కుస్తీ పోటీల తరహాలోనే వుంటాయవి. 'దంగల్‌' కుస్తీ పోటీల నేపథ్యంలో తెరకెక్కిన సినిమా. ఆ కారణంగానే బహుశా చైనా సినీ ప్రేక్షకులు 'దంగల్‌'కి ఈ స్థాయిలో కనెక్ట్‌ అయి వుంటారని సినీ పండితులు అంచనా వేస్తున్నారు. అసలు ఈ వసూళ్ళు నిజమేనా.? అని అంతా ఆశ్చర్యపోయేలా 'దంగల్‌' చైనాలో దుమ్ము రేపుతుండడం విశేషమే మరి.

Show comments