వర్మ 'వంగవీటి' పాట్లు.!

సినిమాని ధైర్యంగా తెరకెక్కించేయడం.. అంతే ధైర్యంగా దాన్ని విడుదల చేయడం రామ్‌గోపాల్‌ వర్మకి మామూలే. కానీ, 'వంగవీటి' విషయంలో మాత్రం వర్మకి ఇదివరకటిలా పరిస్థితులు అనుకూలించడంలేదు. విడుదలకు ముందు వర్మకి వివాదాలు కొత్తేమీ కాదు. కాకపోతే, 'వంగవీటి' ఇంకాస్త పెద్ద వివాదమే అయ్యింది. నిజానికి, గత వివాదాలతో పోల్చితే 'వంగవీటి' వివాదం చిన్నదే. అయినాసరే, వర్మ 'వంగవీటి' విషయంలో ఎందుకో కాస్త మెట్టు దిగక తప్పడంలేదు. 

గతంలో ఎన్నడూ లేని విధంగా 'క్షమాపణ' చెప్పినంత పన్జేశాడు వర్మ. దానికి తోడు తాజాగా, 'వంగవీటి'పై నెలకొన్న అనుమానాల్ని నివృత్తి చేసేందుకు పడరాని పాట్లూ పడుతున్నాడు. 'వంగవీటి'లో ఏ కులాన్నీ తక్కువ చేసి చూపించలేదనీ, అసలు కులాలకు సంబంధించిన సినిమా కానే కాదని వర్మ చెప్పుకొచ్చాడు ఈ సినిమా గురించి. 

అయితే, 'వంగవీటి'కి సంబంధించిన ఓ పాటలోనే వర్మ, ఈ సినిమాలో ఏం చూపించబోతున్నాడో చెప్పేశాడు. 'కమ్మ, కాపు..' అంటూ ఆ పాట సాగింది. ఆ పాట మీద బేస్‌ అయి సినిమా తీశారా.? సినిమాలోని కథంతా ఆ పాటలోనే చెప్పేశారా.? లేదంటే సినిమా ప్రమోషన్‌కి ఆ పాట వాడుకున్నారా.? కారణాలేవైతేనేం, ఆ పాట వర్మని ఇబ్బందులపాల్జేసింది. పాటని తీసేశారు.. అయినా వర్మని, వివాదాలు వెంటాడుతూనే వున్నాయి. అందుకే, ఈ కలరింగ్‌. కులాలతో సంబంధం లేదని వర్మ చెప్పడం ఆశ్చర్యకరమే. 

బెజవాడలో ఎవర్ని కదిలించినా చెబుతారు వంగవీటి అంటే ఏంటో. ఆ వంగవీటికి దేవినేనితో వున్నదేంటో బెజవాడలో పుట్టి పెరిగిన ప్రతి ఒక్కరికీ తెలుసు. 'కులాల కుంపటి' కాదని వర్మ చెప్పచ్చుగాక, ఆ కుంపటిని చూపించకుండా వర్మ 'వంగవీటి' సినిమా చేయడానికేమీ వుండదు. సినిమా విడుదలకు ముందే వివాదాలు సబబు కాదని వర్మ చెబుతున్నా, సినిమా విడుదలయ్యాక చేయడానికేముంటుంది.? అందుకే వర్మకి, గతంలో కన్నా ఈసారి గట్టిగానే షాక్‌లు తగులుతున్నాయి.

Show comments