వెంకయ్యా అలాగనేశావేంటయ్యా

ఉపరాష్ట్రపతి పదవికి బీజేపీ సీనియర్‌ నేత, కేంద్ర మంత్రి వెంకయ్యనాయుడు పేరుని భారతీయ జనతా పార్టీ ఖరారు చేసిందన్న ప్రచారం జరుగుతున్న విషయం విదితమే. ఈ ప్రచారాన్ని స్వయంగా వెంకయ్యనాయుడు ఖండించేశారు. 'ఉపరాష్ట్రపతి వంటి అత్యున్నత పదవుల విషయంలో ఊహాగానాలు సరికాదు..' అంటూ వెంకయ్య వ్యాఖ్యానించారు. ఆ పదవికి సంబంధించి బీజేపీలో చర్చ జరుగుతోందనీ, చర్చ అనంతరం అభ్యర్థి ఎవరన్నది తేలుతుందని వెంకయ్య చెప్పుకొచ్చారు. 

బీజేపీ కోర్‌ కమిటీ సమావేశం, పార్లమెంటరీ పార్టీ సమావేశం.. ఇలా చాలా తతంగం వుందన్నది వెంకయ్య వాదన. రాష్ట్రపతి ఎన్నికల అనంతరం మాత్రమే ఉప రాష్ట్రపతి అభ్యర్థి విషయమై బీజేపీ నుంచి స్పష్ట వస్తుందని వెంకయ్య చెబుతున్నారు. అయితే, వెంకయ్య పేరుని ఉప రాష్ట్రపతి అభ్యర్థి కింద గాసిప్స్‌ కాలమ్స్‌లోకి ఎక్కించింది ఎవరు.? అన్నదిప్పుడు మిలియన్‌ డాలర్ల ప్రశ్న. బీజేపీ అధిష్టానమే వ్యూహాత్మకంగా ఈ లీకేజీలు అందించి వుండొచ్చన్నది సర్వత్రా వ్యక్తమవుతోన్న అభిప్రాయం. 

వెంకయ్యనాయుడు సీనియర్‌ పొలిటీషియన్‌. పైగా, బీజేపీ జాతీయ అధ్యక్షుడిగానూ గతంలో పనిచేశారు. పలుమార్లు కేంద్ర మంత్రిగా పనిచేసిన అనుభవం ఆయన సొంతం. ఈ లెక్కన, ఉపరాష్ట్రపతి పదవికి ఇంతకన్నా అర్హతలు ఇంకేం కావాలి.? అయినా, ఈ రోజుల్లో పదవులకు అర్హతలతో పనేముంది.? ఏ పార్టీ అధికారంలో వుంటే, ఆ పార్టీ తనకు నచ్చిన వ్యక్తికి నచ్చిన పదవుల్ని కట్టబెట్టేయొచ్చు.! 

అన్నట్టు, వెంకయ్యనాయుడుగారికి ఉపరాష్ట్రపతి పదవిపై పెద్దగా ఆసక్తి లేదట. దాంతో, ఆయనే ఈ పదవి వద్దనుకుంటున్నారంటూ గాసిప్స్‌ తెరపైకొస్తున్నాయి లెండి.. అది వేరే విషయం.

Show comments