హరికి రూట్ క్లియర్ అవుతుందా?

కంభంపాటి హరిబాబు. విశాఖ నుంచి లోక్ సభకు వెళ్లిన భాజపానేత. పాపం ఇన్నాళ్లు వెంకయ్య నీడన అలా వుండిపోయారు. ఆయన కూడా కమ్మ సామాజిక వర్గానికి చెందిన నేత కావడంతో మంత్రి పదవి వరించలేదు. అదే వర్గానికి చెందిన వెంకయ్య మంత్రిగా వున్నారు కాబట్టి. అప్పటికీ భాజపా పగ్గాలు మాత్రం అదే ఈక్వేషన్ లో ఆయననే వరించాయి. ఎలాగైనా మంత్రి కావాలన్నది హరిబాబు ఆశ. అది ఇప్పుడైనా నెరవేరుతుందా? అన్నది ప్రశ్న.

మామూలు పరిస్థితుల్లో అయితే నెరవేరిపోవాలి. కానీ అమిత్ షా, మోడీ ద్వయం మదిలో ఏ వ్యూహం వుందో? ఏ వ్యూహంతో వెంకయ్యను ఉపరాష్ట్రపతి చేసారో ఇంకా క్లియర్ గా బయటకు రాలేదు. రాష్ట్ర భాజపాలో జరిగే మార్పులు అసలు విషయం తెలియచేస్తాయి.

రాష్ట్ర భాజపాను ఇంక బలోపేతం చేస్తారని, పార్టీలోకి వస్తామంటున్న పలువురు ప్రముఖులను తీసుకుంటారని టాక్ వినిపిస్తోంది. కిరణ్ కుమార్ రెడ్డి లాంటి వాళ్లు ఎప్పటి నుంచో వెయింటింగ్ లిస్ట్ లో వున్నారు. హరిబాబును మంత్రిని చేసి, కాపులకు రాష్ట్ర భాజపా పగ్గాలు అందించి, అన్ని వర్గాలను పార్టీలోకి ఆహ్వానించి, దానిని బలోపేతం చేసే ఆలోచనలో అమిత్ షా వున్నారని రాజకీయ వర్గాల బోగట్టా.

అలా కాకుండా పార్టీ సారథ్యాన్ని కమ్మ సామాజిక వర్గం చేతిలోనే వుంచాలనుకుంటే మాత్రం హరిబాబు కోరిక నెరవేరకపోవచ్చు. మరోపక్క భాజపాకే చెందిన గోకరాజు గంగరాజు పేరు కూడా వినిపిస్తోంది. ఆయనకు కూడా కేంద్ర రాజకీయ వర్గాల్లో గట్టి పట్టే వుంది. మరి ఆయనకు ఇస్తే మళ్లీ హరిబాబుకు ఆశాభంగమే మిగుల్తుంది.

Show comments