ఈ దేశంలో ఇప్పటికే బుల్లెట్ రైలు కామెడీ అయిపోయిందని.. మోడీ సర్కారు ఆ తమాషా చేసేసిందని బహుశా ఏపీ ప్రభుత్వానికి గుర్తుకు లేదు కాబోలు! లేకపోతే మళ్లీ బుల్లెట్ రైలు కామెడీ ఎందుకు చేస్తున్నట్టు? ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు చైనా పర్యటనలో అక్కడ బుల్లెట్ రైలులో ప్రయాణించారట! ఇంకేముంది.. దాన్ని అమరావతికి ఎలా తీసుకురావాలో ఆయన ప్లాన్ వేసేశారట! అమరావతి నుంచి హైదరాబాద్, అమరావతి నుంచి విశాఖ మార్గాల్లో బుల్లెట్ రైలు నడపడం గురించి చంద్రబాబు పరిశీలించారట!
వినేవాళ్లు వెర్రివాళ్లు అయితే.. బాబుగారి గవర్నమెంటు, పచ్చ మీడియా ఇలాంటి కబుర్లను ఎన్నింటిని అయినా చెప్పగలదని వేరే చెప్పనక్కర్లేదు. ఇప్పుడు కాదు.. రెండేళ్ల కిందటే బుల్లెట్ రైలు ప్రతిపాదన చేసింది మోడీ సర్కారు! తాము అధికారంలోకి రాగానే ప్రతిపాదించిన రైల్వే బడ్జెట్ లో మోడీ సర్కారు బుల్లెట్ రైళ్లను నడుపుతామని ప్రకటించింది. తొలిసారి బడ్జెట్ లో కొంత నిధుల కేటాయింపు కూడా జరిగింది. అయితే.. రెండో బడ్జెట్ లో బుల్లెట్ రైల్ ప్రాజెక్టుకు నిధులు సున్నా! బహుశా.. బుల్లెట్ రైల్ ప్రాజెక్టు అంతటితో ఆటకకు ఎక్కింది!
మరి ఆ కామెడీ అలా ముగిసింది అనుకుంటే.. ఇప్పుడు బాబుగారు స్టార్ట్ చేశారు. భ్రమరావతి నుంచి విశాఖకు, హైదరాబాద్ కు బుల్లెట్ రైట్ నడిపే ఆలోచన ఉందట. ఆలోచన మాత్రమే అయితే.. మిగతా ఊర్లన్నీ ఏం పాపం చేశాయి? అమరావతి నుంచి అనంతపురానికి, అమరావతి నుంచి పులివెందులకు కూడా బుల్లెట్ రైల్ అనేయొచ్చు కదా! అది మరీ కామెడీ అవుతుందని ఊరుకుండిపోయారా?
అసలుకు.. రాయలసీమ ప్రాంతం నుంచి గుంటూరుకు, విజయవాడకు ప్రస్తుతానికి ఉన్న రైలు సౌకర్యం అంతంతమాత్రం. రోజుకొక రైలు..అందులో జనరల్ బోగీలు రెండు… ఇదీ వాస్తవ పరిస్థితి. రెండేళ్ల నుంచి ఆ పరిస్థితిని మెరుగు పర్చింది ఏమీ లేదు. కానీ బుల్లెట్ రైల్ తెస్తారట!
అయినా.. రైల్వే వ్యవహారాలు అనేవి కేంద్ర ప్రభుత్వ పరిధిలోనివికదా.. ఈ విషయంలో రాష్ట్ర ప్రభుత్వం జోక్యం ఏంది? అనే కామన్ డౌట్ రాకమానదు. రైల్వే శాఖ నుంచి ఏపీ ముఖ్యమంత్రి రెండేళ్లలో సాధించింది ఏమిటో కూడా ఎరిగిన వ్యవహారమే. రైల్వే జోన్ విషయంలో.. ఇప్పటి వరకూ సాధించింది శూన్యం. ప్రతియేటా రైల్వే బడ్జెట్ లో ఏపీకి పాత అనుభవాలే రిపీటవుతున్నాయి. మరి ఇలాంటి ధీనస్థితిలో కూడా బుల్లెట్ రైలు మాట మాట్లాడటం మాత్రం బాబుగారికే సాధ్యం అవుతోంది. త్వరలోనే చైనా ప్రతినిధులు వస్తారట.. పరిశీలిస్తారట.. ఆ తర్వాత బుల్లెట్ రైలేనట! ఇంత ఈజీనా! మరి బుల్లెట్ రైలు వ్యవహారంలో భారతీయ రైల్వే శాఖకు సంబంధం ఉండదా? బాబు.. చైనాల మధ్య నే డీల్ కుదిరిపోతుందా? మరి ఈ కిటుకు ఏందో మోడీ సర్కారుకు కూడా చెబితే, ఇది వరకూ ప్రతిపాదించిన బుల్లెట్ రైలు పట్టాలెక్కుతుందేమో!