సెహ్వాగ్‌ బ్యాటింగ్‌.. కొనసాగుతూనే.!

వీరేందర్‌ సెహ్వాగ్‌.. మైదానంలో బంతిని బలంగా స్టాండ్స్‌లోకి తరలించడంలో దిట్ట. క్రికెట్‌కి ఇటీవలే గుడ్‌ బై చెప్పేసిన సెహ్వాగ్‌, ప్రత్యర్థులపై పదునైన మాటలతో ఇంకా బ్యాటింగ్‌ కొనసాగిస్తూనే వున్నాడు. ఒలింపిక్‌ గేమ్స్‌ విషయంలో విదేశీ మీడియాకి చెందిన జర్నలిస్ట్‌ ఒకరు విరుచుకుపడితే, సోషల్‌ మీడియాలో దుమ్ము రేపేశాడు సెహ్వాగ్‌. అప్పట్లో అదో పెద్ద సంచలనం. 

తాజాగా, ఇంగ్లాండ్‌ జట్టు టీమీండియా చేతిలో పరాజయం పాలవడంతో బ్రిటిష్‌ మీడియా, టీమిండియా కెప్తెన్‌ విరాట్‌ కోహ్లీపై బాల్‌ ట్యాంపరింగ్‌ ఆరోపణలు చేయడాన్ని సెహ్వాగ్‌ తీవ్రంగా తప్పుపట్టాడు. 'ఆటలో గెలుపోటములు సహజం.. ఇంగ్లాండ్‌ జట్టు బంగ్లాదేశ్‌ జట్టుపై ఓడిపోయింది.. టీమిండియాపై చెప్పుకోదగ్గ రీతిలోనే ఆడుతోంది.. గెలుపోటముల్ని అంగీకరించగలగాలి.. అది ఆటని ఆస్వాదించడమవుతుంది.. అంతే తప్ప, లేనిపోని ఆరోపణలు చేయడం తగదు..' అంటూ బ్రిటిష్‌ మీడియాపై సెహ్వాగ్‌ మండిపడ్డాడు. 

ఇప్పటికే ఈ ట్యాంపరింగ్‌కి సంబంధించి సౌతాఫ్రికా ఆటగాడు డుప్లెసిస్‌పై మ్యాచ్‌ ఫీజులో కోత పడిన విషయం విదితమే. అయితే, ఇంగ్లాండ్‌ టీమ్‌ నుంచి ఇంతవరకు కోహ్లీ ట్యాంపరింగ్‌ చేశాడన్న కోణంలో ఎలాంటి, క్రికెట్ విశ్లేషకుల పరంగానూ ఎప్పుడూ కోహ్లీపై అలాంటి ఆరోపణలు రాకపోయినా, బ్రిటిష్‌ మీడియా చేస్తున్న దుష్ప్రచారం సహజంగానే సెహ్వాగ్‌కి ఆగ్రహం తెప్పించేసింది. మొత్తమ్మీద, మైదానంలో బ్యాటింగ్‌ చేయకపోయినా.. తన మాటలతో ఇంకా ప్రత్యర్థులపై బ్యాటింగ్‌ చేస్తూనే వున్నాడన్నమాట. 

మీడియా ఇంటర్వ్యూల్లోనూ, సోషల్‌ మీడియాలోనూ సెహ్వాగ్‌ తన వ్యవహార శైలితో హాట్‌ టాపిక్‌ అవుతున్నాడిప్పుడు. ఇదే విషయాన్ని సెహ్వాగ్‌ వద్ద ప్రస్తావిస్తే, తానేమీ సంచలనాల కోసం పాకులాడటంలేదనీ, జట్టు కోసం దేశం కోసమే మాట్లాడుతున్నాననీ చెప్పుకొచ్చాడు. నిజమే, సెహ్వాగ్‌ క్రికెట్‌ ఆడినా తన రికార్డుల కోసం ఎప్పుడూ ఆడలేదు. 99 పరుగుల వద్ద కూడా సిక్స్‌ కొట్టడానికే ప్రయత్నించే ఆటగాడు సెహ్వాగ్‌. ఆట పట్ల, దేశం పట్ల అతని కమిట్‌మెంట్‌ అలాంటిది. Readmore!

Show comments