రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు చాలా కాలంగా డిఎ ఇవ్వడం లేదు. ఇప్పటికి రెండు డిఎ లు బకాయి పడింది ప్రభుత్వం. ఇంకా మిగిలిన ఉద్యోగుల సమస్యలు మామూలే. అలా పడి వున్నాయి. తమ నాయకుడు అశోక్ బాబు ను నమ్మి ఉద్యోగుస్థులంతా చంద్రబాబు వెనుక నడిచారు. ఆ తరువాత మరి అశోక్ బాబుకు చంద్రబాబు దగ్గర నుంచి ఉద్యోగుల కోసం వరాలు సాధించే అవకాశం అంతగా లేకపోయింది. దీంతో ఉద్యోగుల దగ్గర క్రమేపీ అశోక్ బాబు పరపతి తగ్గుతూ వస్తోంది. అయితే ఇన్నాళ్లు నెట్టుకుంటూ వచ్చారు కానీ, ఇప్పుడు సమస్య వచ్చింది. అశోక్ బాబు పదవి కాల పరిమితి తీరిపోతోంది. ఇప్పుడు ఓట్ల కోసం ఎన్జీవోల ముందుకు వెళ్లాలంటే, ఏ మొహం పెట్టుకుని వెళ్తారు. అప్పటికీ బాబుకు తన సమస్య మొరపెట్టుకున్నారు.
కానీ బాబు సంగతి ఈ అశోక్ బాబుకు పూర్తిగా తెలియదు. అశోక్ బాబుతో తన పనయిపోయింది అనుకున్నాక, ఇక సాయం చేయడం అంత సులువు కాదు. అప్పటికీ ఈ నెల ఫస్ట్ వీక్ లో అశోక్ బాబు ముఖ్యమంత్రిని కలిసారు. లోపల ఏం జరిగిందో కానీ, బయటకు వచ్చి, సంక్రాంతికి డిఎ ఇస్తున్నారని, ఉద్యోగుల సమస్యలు అన్నీ పరిష్కారం చేస్తానని హామీ ఇచ్చారని ప్రకటించేసారు. బాబుకు మద్దతు ఇచ్చే అశోక్ బాబుకు మాత్రం తాము మద్దతు ఇవ్వమా అని కొన్ని పత్రికలు ఈ వార్తను హైలైట్ చేసేసాయి. సంక్రాంతి వచ్చింది..వెళ్లింది డిఎ మాత్రం రాలేదు.
మళ్లీ మరోసారి అశోక్ బాబు ఇప్పుడు బాబును కలిసారు. మళ్లీ ఏ మాట్లాడారో ఏమో కానీ, బయటకు వచ్చి మళ్లీ అదే స్టేట్ మెంట్. సంక్రాంతి ముందుకు ఇచ్చిన స్టేట్ మెంట్ లో అక్షరం మారితే ఒట్టు. మళ్లీ అదే స్టేట్ మెంట్. త్వరలో డిఎ అని, సమస్యలు అన్నీ పరిష్కారం చేస్తామని సిఎమ్ హామీ ఇచ్చారని. మరోపక్క ఎన్జీవోల్లో అశోక్ బాబు వ్యతిరేక వర్గం అంతా ఏకం అవుతోంది. మరి ఇలాంటి ఎన్నికల టైమ్ లో ఉద్యోగుల సమస్యలు పరిష్కరించి అశోక్ బాబును ఎన్నికల్లో ఆదుకుంటారో? ఆయన బాధ పడతారని వదిలేస్తారో చూడాలి.