భాజపా చిలకలు పలుకుతున్నాయ్‌

ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రానికి ప్రత్యేకహోదాకు సంబంధించిన అంశం.. కొన్ని రోజులుగా మళ్లీ హాట్‌ హాట్‌ గా నడుస్తోంది. సాధారణంగా కేంద్రం మీద ఆరోపణలో ముడిపడిన ఈ టాపిక్‌ మీద ఎలాంటి చర్చ జరుగుతూ ఉన్నా సరే, రాష్ట్రంలో ఉండే భాజపా నాయకులు తెర మీదకు వస్తుంటారు. కేంద్రంలో మోదీ ఎంతగా కష్టపడి పనిచేస్తున్నారో, ఆంధ్రప్రదేశ్‌కు అర్జంటుగా లాభం చేకూర్చడానికి, ఇబ్బడిముబ్బడిగా కేంద్రంనుంచి నిధులు దోచిపెట్టడానికి వెంకయ్యనాయుడు గారు ఎంతగా శ్రమిస్తున్నారో వీరు వివరిస్తూ ఉంటారనేది జనంలో ఉన్న అభిప్రాయం. 

అయితే ఈసారి హాట్‌ హాట్‌గా హోదా టాపిక్‌ మొదలు కాగానే.. ఎక్కడికక్కడ ఈ భాజపా చిలుకలు అన్నీ సైలెంట్‌ అయిపోయాయని, తీరా ఇప్పుడు కేంద్రంలో ప్యాకేజీ ఫైనలైజ్‌ అవుతున్న తరుణంలో ఈ కమలదళం చిలుకలన్నీ మళ్లీ రెక్కలు కట్టుకుని వచ్చి మీడియా ముందు వాలుతున్నాయని జనం భావిస్తున్నారు.  కేంద్రప్రభుత్వం ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రానికి ప్రత్యేక ప్యాకేజీ మాత్రం ఇవ్వబోతున్నది.. భారీగా నిధులు ఇస్తుంది... అంతే తప్ప హోదా గురించి ఇప్పట్లో చర్చ ఉండకపోవచ్చు.. ఇలాంటి వార్తలు కొన్ని రోజులుగా మీడియాలో ఊదరగొట్టేస్తున్నాయి. 

సహజంగా ఇలాంటి నేపథ్యంలో.. రాష్ట్రంలో ఉండే భాజపా నాయకులు రెండు బాధ్యతలను భుజానికెత్తుకుంటున్నారు. ఒకటి- కేంద్రం ప్యాకేజీ ఇస్తే అది మాత్రమే గొప్పది.. హోదా అనేది ఎందుకూ పనికి రాని చెత్త అని ప్రజల్ని నమ్మించడం. రెండు- కేవలం భాజపా కృషి వల్లనే ఆ నిదులు కూడా వస్తున్నాయని, రాష్ట్ర భాజపా నాయకులు కేంద్రాన్ని చాలా రకాలుగా ఇన్‌ఫ్లూయెన్సు చేసి నిధులు రాబట్టారని, రాష్ట్రాన్ని కేంద్రం ద్వారా ఉద్ధరిస్తున్నామంటే.. అది ఇక్కడి భాజపా వల్లనే సాధ్యమవుతోందని సొంత డబ్బా కొట్టుకోవడం. 

ఈ రెండు లక్ష్యాలతో నాయకులు మళ్లీ మీడియా ముందుకు వస్తున్నారు.  శనివారం నాడు పురందేశ్వరి, విష్ణుకుమార్‌ రాజు ఇలాంటి వారంతా చేస్తున్న ప్రకటనలు గమనిస్తే ఆ విషయమే అర్థమవుతుంది. అయితే ఇక్కడో సరదా అయిన ట్విస్టు గమనించాలి. నా భార్యను కూడా హోదాపై ఒప్పిస్తున్నా.. అని విష్ణుకుమార్‌ రాజు.. వాక్రుచ్చారు. ఆయన మాటలు విన్న వారికి.. ఇంట్లో హోదా గురించి కేంద్రం చేస్తున్నది మోసమే అని భార్య బలంగా అభిప్రాయ పడుతున్నట్లు అర్థమవుతుంది. 

అందుకే ఆమెకు హోదా పోయినా పర్లేదు, ప్యాకేజీ వస్తుంది అని ఆయన నమ్మించడానికి ప్రయత్నిస్తున్నట్లుగా అర్థమవుతోంది. అయినా.. కమల దళాలు.. తమ రాజకీయ అవసరం గనుక.. హోదా కంటె ప్యాకేజీ ఎక్కువని.. టముకు వేయడానికి నిస్సిగ్గుగా తెగబడతారు గానీ.. ఆ మాటలు నమ్మడానికి జనం వెర్రివాళ్లా ఏమిటి? 

Show comments