'ఇళయరాజా స్వరపరిచిన పాటల్ని పాడొద్దని ఆయన కార్యాలయం నుంచి నాకు ఒక్క ఫోన్ చేసినా బాగుండేది.. నేను పాడేవాడిని కాదు.. ఇంత వివాదం అయి వుండాల్సింది కాదేమో. అప్పటికీ ఇప్పటికీ ఎప్పటికీ మేమిద్దరం మంచి స్నేహితులం. మా మధ్య స్నేహం ఎప్పటికీ చెడిపోదు.. మేం విడిపోం.. ఆయన స్వరపరిచిన పాటలు పాడేందుకే నేను పుట్టానని చాలామంది అంటారు..' అంటూ పెద్ద వివరణే ఇచ్చుకున్నారు ప్రముఖ సినీ గాయకుడు ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం.
కానీ, అంతలోనే సూటిగా.. సుత్తి లేకుండా.. మరో ఝలక్ ఇచ్చేశారు ఎస్పీ బాలు. 'ఓ పాట వెనుక చాలామంది కష్టం వుంటుంది. దర్శకుడు, నిర్మాత, సంగీత దర్శకుడు, గాయకుడు, వాయిద్యకారులు.. ఇలా ఇంతమంది కలిసి పనిచేస్తేనే పాట తయారవుతుంది. పాట మీద హక్కులు చాలామందికి వుంటాయి..' అని ఆయన క్లారిటీ ఇవ్వడమంటేనే, ఇళయరాజాకి చాలా గట్టిగా 'కౌంటర్' ఇచ్చేసినట్టు.!
ఎస్పీ బాలు చెప్పారని కాదుగానీ, సినిమా ఏ ఒక్కరి కృషి కాదు. అది కలసికట్టుగా శ్రమిస్తేనే సినిమాగా ప్రేక్షకుల ముందుకొస్తుంది. సినిమాలో ఓ సన్నివేశమైనా, ఓ పాట అయినా, ఇంకోటైనా.. దాని వెనుక చాలామంది కష్టం వుంటుంది. ఇళయరాజాని కేవలం సంగీత దర్శకుడు అని ఊరుకోలేం. ఆయన సంగీత జ్ఞాని. సంగీతంలో మాత్రమే కాదు, అన్ని విషయాల్లోనూ అపారమైన జ్ఞానం ఆయన సొంతం. కానీ, ఆయనెందుకో 'నా పాట నువ్వు పాడొద్దు..' అంటున్నారు. అక్కడే వస్తోంది సమస్య అంతా.
'రాయల్టీ' అనేది ఇళయరాజా సాధించిన పేరు ప్రఖ్యాతుల ముందు చాలా చిన్న విషయం. ఏమిచ్చినా, ఆయన కీర్తి ముందు దిగదుడుపే. కానీ, ఆయన రాయల్టీ పేరుతో వివాదం తెరపైకి తెచ్చారు. ఎస్పీ బాలు క్లారిటీ ఇచ్చినా, ఇంకొంకరు మాట్లాడినా.. ఈ ఎపిసోడ్‌లో తప్పంతా ఇళయరాజాదే అయిపోయింది. 'నా పాటల్ని కమర్షియల్ అవసరాల కోసం వాడేస్తున్నారు..' అన్న ఇళయరాజా ఆవేదన తెరమరుగైపోతోందిక్కడ.