నాగార్జున 'గ్రాఫిక్స్‌' కష్టాలు

చిన్న సినిమా అయినా పెద్ద సినిమా అయినాసరే, ఇటీవలి కాలంలో గ్రాఫిక్స్‌కి విపరీతమైన ప్రాధాన్యతనిస్తున్నాయి. 'హై టెక్నికల్‌ వాల్యూస్‌' పేరుతో గ్రాఫిక్స్‌ని ఆశ్రయించడం సినీ రంగంలో సర్వసాధారణమైపోయింది. గ్రాఫిక్స్‌ అంటే కేవలం లేనివి వున్నట్లుగా క్రియేట్‌ చేయడం మాత్రమే కాదు. ఓ యాక్షన్‌ సీన్‌, ఓ సాంగ్‌, ఇంకో మెస్మరైజింగ్‌ సీన్‌కి అదనంగా కొన్ని హంగులు జోడించడం కూడా. 

అలాంటిది, ఓ 'మగధీర' లాంటి సినిమా, ఓ 'ఈగ లాంటి' సినిమా 'బాహుబలి' లాంటి సినిమాకి గ్రాఫిక్స్‌ అద్భుతాలు ఆశించకుండా ఎలా వుండగలం.? గ్రాఫిక్స్‌ లేకపోతే వాటిని ఊహించుకోలేం కూడా. కాస్తో కూస్తో 'ఓం నమో వెంకటేశాయ' కూడా ఆ కోవలోనిదేనట. సినిమా ఎప్పటికి ప్రేక్షకుల ముందుకు వస్తుంది.? అని నాగార్జునని 'ఓం నమో వెంకటేశాయ' గురించి అడిగితే, 'నవంబర్‌లో క్లారిటీ వస్తుంది..' అని సమాధానమిచ్చాడాయన. 

ఈ రోజుల్లో గ్రాఫిక్స్‌ గురించి ఆలోచిస్తే మతిపోతోందనీ, ఒక్కోసారి అంతా బాగానే వుందనుకున్న సమయంలో చిన్న లోపం కనిపిస్తుందనీ, దాంతో గ్రాఫిక్స్‌ కరెక్షన్‌ మళ్ళీ మొదటి నుంచి చేయాల్సి వస్తుందని గ్రాఫిక్స్‌ కష్టాల గురించి చెప్పుకొచ్చాడు నాగార్జున. నిజమే మరి, 'అఖిల్‌' సినిమా విషయంలో అదే జరిగింది. అందుకే, గ్రాఫిక్స్‌ అవసరమున్న సినిమాల్ని ఫలానా తేదీన విడుదలవుతుందని ముందే చెప్పలేమని నాగార్జున చెప్పుకొచ్చాడు. 

దర్శకేంద్రుడు రాఘవేంద్రరావు దర్శకత్వంలో నాగార్జున, అనుష్క ముఖ్య పాత్రల్లో 'ఓం నమో వెంకటేశాయ' చిత్రం తెరకెక్కుతోన్న విషయం విదితమే.

Show comments