100 కోట్లు.. రేసులో విజేతలెందరు.?

ఈ ఏడాది టాలీవుడ్‌లో వంద కోట్ల రూపాయల వసూళ్ళ మార్క్‌ అందుకునే తొలి చిత్రం కానుంది 'ఖైదీ నెంబర్‌ 150'. గ్రాస్‌ పరంగా ఇప్పటికే 100 కోట్లను 'ఖైదీ' టచ్‌ చేసేసిందని, ఏడు రోజులకే వసూళ్ళ వివరాల్ని ప్రముఖ నిర్మాత అల్లు అరవింద్‌ ప్రకటించేసిన విషయం విదితమే. రేపో మాపో 100 కోట్ల షేర్‌పై అధికారిక ప్రకటన రానుంది. 

మరి, ఈ ఏడాది విడుదల కానున్న మిగతా పెద్ద చిత్రాల మాటేమిటి.? పవన్ 'కాటమరాయుడు' నిర్మాణంలో వుంది. మహేష్‌ - మురుగదాస్‌ కాంబినేషన్‌లో 'సంభవామి' సినిమా తెరకెక్కుతోంది. ఎన్టీఆర్‌ - బాబి కాంబినేషన్‌లో సినిమా సెట్స్‌పైకి వెళుతోంది. వీటన్నిటికన్నా ఎక్కువగా 'బాహుబలి-2'పై భారీ అంచనాలున్నాయి. చరణ్‌, సుకుమార్‌ సినిమాతోపాటు, ఈ ఏడాది చిరంజీవి హీరోగా మరో సినిమా రానుంది. అల్లు అర్జున్‌ 'డీజే' కూడా రేసులోనే వుంది. నాగార్జున 'నమో వెంకటేశాయ'పైనా భారీ అంచనాలే వున్నాయి. సో, వీటిల్లో 100 కోట్ల రూపాయల ప్రీ రిలీజ్‌ బిజినెస్‌ చేసే సినిమాలకు కొదవ లేదు. అయితే, వసూళ్ళలో 100 మార్క్‌ని దాటే సినిమాలు ఏవి.? అన్నదే ప్రస్తుతానికి సస్పెన్స్‌. 

అయితే, సరైన ప్లానింగ్‌.. దాంతోపాటుగా ఇతర సినిమాలతో పెర్‌ఫెక్ట్‌ కమ్యూనికేషన్స్‌.. ఇవన్నీ వుంటే మాత్రం, తెలుగు సినిమా పరిశ్రమ ఈ ఏడాది సరికొత్త సంచలనాలు సృష్టించడం ఖాయం. మన సినిమా మార్కెట్‌ పెంచుకోవాలంటే ముందుగా మన సినీ పరిశ్రమలో ఐక్యత ముఖ్యం. బాలీవుడ్‌లో ఓ హీరో సినిమాకి ఇంకో హీరో ప్రమోషన్‌ పరంగా కలిసొస్తుండడం చూస్తుంటాం. తెరవెనుక పోటీ ఎలా వున్నా, మార్కెట్‌ని పరిగణనలోకి తీసుకుని పరస్పర సహకారం అందించుకుంటుంటారు. అది ఇక్కడా వర్కవుట్ అయితే, పండగే కదా. 

చూద్దాం.. ఎప్పుడూ లేని విధంగా, ఈ ఏడాది సినిమా పరిశ్రమలో చాలా సినిమాలు 100 కోట్లే టార్గెట్‌గా దూసుకొస్తున్న దరిమిలా, ఈ ఏడాది 100 కోట్లు సాధించే సినిమాలు ఎన్ని తేలతాయో.!

Readmore!

Show comments