ములాయమే సీఎం? కానీ నిలబడగలడా?!

ఎలాగూ ఈ రోజు తన వర్గం ఎమ్మెల్యేలతో అఖిలేష్ యాదవ్ సమావేశం నిర్వహించనున్నాడు. ములాయం తన తనయుడిని వెలివేస్తే వెలివేసి ఉండవచ్చు గాక.. పార్టీ ఎమ్మెల్యేల్లో మాత్రం అఖిలేష్ అంటేనే ఎక్కువ క్రేజ్ ఉంది. వృద్ధ నేత కన్నా.. అఖిలేష్ నాయకత్వాన్నే ఎక్కువమంది ఇష్టపడుతున్నారు. ఉన్న వారిలో ఎక్కువమంది ఎమ్మెల్యేలు అఖిలేష్ వెంటే నడవనున్నారు. ఇప్పటికే చాలా మంది అఖిలేష్ శిబిరంలో చేరిపోయారు కూడా.

ఇలాంటి నేపథ్యంలో కొత్త ముఖ్యమంత్రిని ప్రకటిస్తా.. అని చెప్పిన ములాయం సింగ్ యాదవ్, తననే ముఖ్యమంత్రిగా ప్రకటించుకున్నా, తన ప్రియతమ సోదరుడిని సీఎంగా ప్రకటించినా.. లేక ఇంకా వేరే ఎవరినైనా సీఎంగా ప్రకటించినా.. పదవిని నిలబెట్టుకోవడానికి తగిన బలం మాత్రం ఉండకపోవచ్చు. 

పరిస్థితులను బట్టి ములాయం తననే సీఎంగా ప్రకటించుకోవచ్చు. కానీ బల నిరూపణ వరకూ వస్తే.. అఖిలేష్ వర్గం ఎమ్మెల్యేల నుంచి సహకారం ఉండదు కాబట్టి.. ప్రభుత్వం కుప్పకూలుతుంది. 

ఇప్పటికే తన వర్గం ముఖ్య నేతలతో అఖిలేష్ సమావేశం అయ్యాడు. ఈ రోజు.. ఎమ్మెల్యేలతో సమావేశం అని ప్రకటించారు. మరి ఈ సమావేశానికి ఎంతమంది ఎమ్మెల్యేలు వస్తారనేది బట్టి.. అఖిలేష్ బలమెంతో తెలుస్తోంది. అఖిలేష్ అధ్యక్షతన జరిగే సమావేశానికి వెళ్లే ఎమ్మెల్యేలందరి మీదా ములాయం బహిష్కరణ విధించవచ్చు.  మరి అదే జరిగితే.. మిగిలిన ఎమ్మెల్యేలతో కొత్త ప్రభుత్వం ఏర్పాటు అయ్యే అవకాశమే ఉండదు!

ఏతావాతా.. ములాయం చేజేతురాలా సమాజ్ వాదీ పార్టీ ప్రభుత్వాన్ని కుప్పకూల్చినట్టే. తనయుడిని సీఎం పదవిని దించేసిన ఏకైక తండ్రిగా చరిత్రకు ఎక్కినట్టే!

Show comments